నవోదయ విద్యాలయ.. దరఖాస్తు చేయండిలా
సాక్షి, హైదరాబాద్: జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డి జిల్లాలో 2021–22 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ డేనియల్ రత్నకుమార్ కోరారు. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని జేఎన్వీ కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రవేశ ప్రక్రియను వివరించారు. రంగారెడ్డి జిల్లా జేఎన్వీ పరిధిలోకి వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రస్తుతం అయిదో తరగతి విద్యార్థులంతా అర్హులన్నారు. ఆరవ తరగతి ప్రవేశ పరీక్షను 2021 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రశ్న: దరఖాస్తులను ఎలా చేసుకోవాలి?
ప్రిన్సిపల్ : వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తులను ఆన్లైన్లోనే చేసుకోవాలి. డిసెంబర్ 15వ తేదీ వరకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ప్రశ్న: ఆరవ తరగతి దరఖాస్తులకు అర్హులెవరు?
ప్రిన్సిపల్ : 01–05–2008 నుంచి 30.4.2012 మధ్య పుట్టినవారై వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతుండాలి.
ప్రశ్న: ఆరవ తరగతిలో అడ్మిషన్లకు రిజర్వేషన్లు వర్తింపజేస్తారా?
ప్రిన్సిపల్ : ఆరవ తరగతిలోని మొత్తం సీట్లలో 75 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, మిగిలిన 25 శాతం పట్టణ వాసులకు రిజర్వు చేస్తారు. మొత్తం సీట్లలో 1/3 సీట్లు బాలికలకు కేటాయించారు. అంతేకాక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం సీట్లు కేటాయిస్తాం.
ప్రశ్న: ఆన్లైన్ దరఖాస్తులో తోడ్పడుటకు ఎలాంటి సౌకర్యం కల్పించారు?
ప్రిన్సిపల్ : విద్యార్థులకు ఆన్లైన్ దరఖాస్తులో తోడ్పడుటకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. విద్యార్థి అన్ని డాక్యుమెంట్లను తీసుకొని రిజిష్ట్రేషన్ చేసుకొనేటప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ స్వీకరించడానికి పనిచేస్తున్న మొబైల్ తీసుకొని సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి. అందుకోసం సహాయకేంద్రం సహాయకులు పీ. శ్రీనివాసరావు– 9959513171, కే.మట్టారెడ్డి– 9490702185, భూప్‌సింగ్– 9390728928లతో సంప్రదించవచ్చు.
ప్రశ్న: జేఎన్వీ ప్రత్యేకతలు ఏమిటి?
ప్రిన్సిపల్ : కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి ద్వారా జేఎన్వీలను నిర్వహిస్తారు. సీబీఎస్ఈ సిలబస్‌తో ఇంగ్లిష్ మీడియం బోధన ఉంటుంది. జేఎన్వీ రంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల అన్ని అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చాం. 11, 12 తరగతి చదివే అమ్మాయిలకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖచే నెలకు రూ. 2 వేల స్కాలర్షిప్ అందిస్తారు. అవంతి ఫెలోస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా 11, 12 తరగతులు చదివే వారికి జేఈఈ (జీ), నీట్ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరగుతుంది.
చదవండి: బూజు జాడ చెప్పే కొత్త యంత్రం!