అది ఫేక్ అంటావా.. వెబ్‌సైట్‌పై టీవీ నటి కేసు!
న్యూయార్క్: ప్రముఖ టీవీ సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ ఓ వెబ్‌సైట్‌పై పరువునష్టం దావా వేసింది. పారిస్‌లో తనపై జరిగిన సాయుధ దోపిడీ ఉత్త నాటకమేనని, బీమా సొమ్ము నొక్కేసేందుకే కిమ్ ఈ నాటకం ఆడి.. అందరినీ బోల్తా కొట్టించిందని ‘మీడియాటేక్అవుట్.కామ్’ ఓ కథనం ప్రచురించింది. ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తంచేసిన కిమ్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో పరువునష్టం దావా వేసింది. వదంతులు రాసే ఆ వెబ్సైట్ తనపై జరిగిన దోపిడీ విషయంలో అసత్యాలు ప్రచురించిందని కిమ్ ఆరోపించింది.
గత నెల 3న పారిస్‌లోని తన అపార్ట్మెంట్లో కిమ్ కర్దాషియన్‌పై దోపిడీ దొంగలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తుపాకులతో బెదిరించి 10 మిలియన్ డాలర్ల విలువచేసే సొమ్మును దోచేశారు. అయితే, తనకు ఇన్సూరెన్స్ ఉండటంతో దోపిడీకి గురైన సొమ్మును చెల్లించాలమని ఆమె బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దోపిడీ నేపథ్యంలో 35 ఏళ్ల కిమ్ ఇప్పటివరకు టీవీ షోల్లోకానీ, సోషల్ మీడియాలోకానీ కనిపించలేదు. కిమ్ వ్యాఖ్యాతగా ఉన్న ‘కీపింగ్ అప్ విత్ ద కర్దాషియన్స్’ కార్యక్రమాన్ని కూడా నిలిపివేశారు. తనపై జరిగిన దోపిడీ అఘాయిత్యంతో కిమ్ భయభ్రాంతులకు గురైందని, తమ కుటుంబ భద్రతపై తాము తీవ్రంగా మథనపడుతున్నామని కిమ్ సోదరి ఖ్లోషి కర్దాషియన్ పేర్కొంది.