gouse
-
సత్తెనపల్లి విషాద ఘటనపై విచారణకు ఆదేశం
సాక్షి, గుంటూరు : లాక్డౌన్ నేపథ్యంలో సత్తెనపల్లిలో జరిగిన విషాద ఘటనపై గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్‌రావు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సోమవారం ఉదయం పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద గౌస్ అనే యువకుడు ఒక్కసారిగా చెమటలు పట్టి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే లాక్డౌన్ సమయంలో బయటకు ఎందుకు వచ్చావని పోలీసులు ప్రశ్నించడంతో గౌస్ భయంతో కిందపడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు కొట్టడం వల్లే గౌస్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ఐజీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లిలో చనిపోయిన గౌస్ గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. బయటకు ఎందుకు వచ్చావని పోలీసులు అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదు. పోలీసులు ఆడటంతో అతడికి చెమటలు పట్టి కిందపడిపోయాడు. వెంటనే గౌస్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ జరుపుతున్నాం. ఎస్ఐ తప్పు ఉందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే గౌస్ మృతదేహానికి పోస్ట్‌మార్టం వీడియో తీయిస్తాం. పోలీసులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. పోలీసులపై ప్రత్యేకంగా ఒత్తిడేమీ లేదు.’ అని తెలిపారు. -
అమరావతిలో మరో ఘరానా మోసం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ఘరానా మోసం బయటపడింది. రాజధానికి భూమి ఇవ్వకుండానే గౌస్ ఖాన్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున లబ్ధి పొందాడు. సీఆర్డీఏ అధికారులతో కలిసి అతడు ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సీఆర్డీఏకి మందడం రెవెన్యూలో గౌస్ ఖాన్ భూమి ఇచ్చినట్లు అధికారులు రికార్డులు సృష్టించారు. నది పరివాహక ప్రాంతంలో మిగులు భూమికి పత్రాలు సృష్టించి గౌస్ ఖాన్ పేరుతో అధికారులు ల్యాండ్ పూలింగ్‌కు తీసుకున్నారు. ఇందుకోసం గౌస్ ఖాన్‌కు ప్లాట్లు కూడా కేటాయించారు. దీంతో అతడికి సుమారు రూ.3.50 కోట్లుకు పైగా విలువ చేసే ప్రయోజనాలు చేకూరాయి. ఈ కుంభకోణం వెనుక సీఆర్డీఏ అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా గౌస్ ఖాన్ ఆ ప్లాట్లను హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు విక్రయించాడు. అయితే లింక్ డాక్యుమెంట్ల వద్ద ఈ ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గతంలోనూ సీఆర్డీఏ అధికారులు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ కుంభకోణం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశించారు. కాగా ఈ కుంభకోణంలో సీఆర్డీఏ అధికారులతో పాటు టీడీపీ నేతల పాత్ర కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపైన సీబీఐ విచారణ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్రమాలు జరిగాయి: సీఆర్డీఏ కమిషనర్ రాజధాని ప్రాంతం మందడంలో భూఅక్రమాలు జరిగాయని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అంగీకరించారు. మందడంలో ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఆన్ లైన్ రికార్డులను తారుమారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై అదనపు కమిషనర్ షణ్ముకంను విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. మూడు రోజుల్లో నివేదిక వస్తుందని, మందడం భూ దందాపై క్రిమినల్ కేసు నమోదు చేశామని సీఆర్డీఏ కమిషనర్ వెల్లడించారు. ఈ కుంభకోణంలో సీఆర్డీఏ అధికారుల పాత్ర కూడా ఉండవచ్చన్నారు. కంప్యూటర్ ఆపరేటర్తోనే ఈ అక్రమం జరిగే అవకాశం లేదని అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోందని తెలిపారు.59 వేల ప్లాట్లు లాటరీ ద్వారానే ఇచ్చామని,మంత్రులు, టిడిపి నేతలకు కార్నర్ ప్లాట్లు ఇచ్చామనే అంశంపై ఇంతవరకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఆయన పేర్కొన్నారు. సీఆర్డీఏ కార్యాలయం ఎదటు సీపీఎం ఆందోళన అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన భారీ కుంభకోణాలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సీఆర్డీఏ కార్యాలయం వద్ద సీపీఎం మంగళవారం ఆందోళనకు దిగింది.అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అధికారులే భూదందాకు సహకరిస్తున్నారని, ప్లాట్ ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించింది. మంత్రులకు, టిడిపి నేతలకు కార్నర్ ప్లాట్లు ఎలా కేటాయించారని ప్రశ్నించింది. సిఎం నివాసంకు సమీపంలోనే భూదందా జరుగుతోందని,రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని సీఆర్డీఏ ప్రాంత సీపీఎం కన్వీనర్ సిహెచ్ బాబూరావు ఆరోపణలు చేశారు. -
కాటేయబోయిన కెరటాలు.. కాపాడిన లైఫ్ గార్డులు
ఆర్కే బీచ్‌లో కొట్టుకుపోయిన యువకుడు సాహసోపేతంగా రక్షించిన లైఫ్‌గార్డులు పెదవాల్తేరు : తీరంలో సేదతీరుదామని వచ్చిన స్నేహితులు... ఎగసిపడుతున్న కెరటాలు చూసి ముచ్చటపడి మూడు మునకలు వేసి ఆనందిద్దామని దిగితే.. ఒక్క ఉదుటున వచ్చిన కెరటం తన కౌగిలిలో చుట్టేసింది. పక్కనే ఉన్న తీరంలో జలకాలుడుతున్న జనం ఒక్కసారిగా గావుకేకలేయడంతో అక్కడే ఉన్న బీచ్ లైఫ్‌గార్డులు ‘కడలిరంగం’లోకి దిగారు. కెరటాల దిగున సంద్రంలోకి కొట్టుకుపోతున్న ఓ యువకుడిని సమయస్ఫూర్తితో రక్షించి బీచ్ సందర్శకులతో శభాష్ అనిపించుకున్నారు. వివరాలివీ... హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మిత్రులు గౌస్, బాబీ, బాలాజీలు విశాఖకు పర్యాటకులుగా వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఆర్కే బీచ్‌కు వచ్చి, ఎగసి పడుతున్న కెరటాలు చూసి కాసేపు జలకాలాడుదామని బీచ్‌లోకి దిగారు. నురగలు కక్కుతున్న సంద్రంలో మరికొందరు పర్యాటకులతో కలిసి సందడి చేస్తూ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇంతలోకే ఉవ్వెత్తున ఎగసిపడిన ఓ కెరటం ఒక్కసారిగా గౌస్(30)ను ముంచేసి క్షణాల్లో సంద్రంలోకి తీసుకుపోయింది. సందర్శకులు పెద్దగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న లైఫ్ గార్డులు పోలరాజు, డేవిడ్, శ్రీను రంగంలోకి దిగారు. అప్పటికే గౌస్ సముద్రంలో అర కిలోమీటర్ దూరం వరకు కొట్టుకువెళ్లిపోవడంతో లైఫ్‌గార్డులు వారి వద్ద ఉన్న రోప్ సాయంతో.. ఎంతో సాహసోపేతంగా లోనికి వెళ్లి గౌస్‌ను రక్షించారు. తీరంలోకి తీసుకువచ్చి ప్రథమ చిక్సిత్స అందించారు. అప్పటికే తీవ్ర ఆందోళనకు లోనైన స్నేహితులు బాలాజీ, బాబీలు గౌస్‌ను ఒక్కసారిగా హత్తుకుని కన్నీరు పెట్టారు. తనకు పునర్జన్మనిచ్చారంటూ గౌస్‌తోపాటు, స్నేహితులు ముగ్గురూ కన్నీళ్లతోపాటు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. -
ఫొటోగ్రాఫర్ దారుణ హత్య
కర్నూలు: వ్యక్తి గత కారణాలతో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో జరిగింది. వివరాలు..నూనెపల్లికి చెందిన గౌస్(30) నంద్యాల పట్టణంలోని ఫోటోగ్రాఫర్స్ ఆసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. కాగా, సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంజుమన్ వీధిలో ఉన్న ఉస్సేన్‌బాషా ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉస్సేన్బాషాకు, గౌస్‌కు మధ్య జరిగిన గొడవ జరిగింది. ఈ గొడవలో బాషా కత్తితో గౌస్‌ను హతమార్చాడు. అయితే, ఈ హత్యకు గత కారణాలు పూర్తిగా తెలియాల్సిఉంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం బాషాను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.