కాటేయబోయిన కెరటాలు.. కాపాడిన లైఫ్ గార్డులు | man saved with lifeguards in vizag | Sakshi
Sakshi News home page

కాటేయబోయిన కెరటాలు.. కాపాడిన లైఫ్ గార్డులు

Published Sat, May 7 2016 5:46 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

కాటేయబోయిన కెరటాలు.. కాపాడిన లైఫ్ గార్డులు

కాటేయబోయిన కెరటాలు.. కాపాడిన లైఫ్ గార్డులు

ఆర్కే బీచ్‌లో కొట్టుకుపోయిన యువకుడు
సాహసోపేతంగా రక్షించిన లైఫ్‌గార్డులు
 
పెదవాల్తేరు : తీరంలో సేదతీరుదామని వచ్చిన స్నేహితులు... ఎగసిపడుతున్న కెరటాలు చూసి ముచ్చటపడి మూడు మునకలు వేసి ఆనందిద్దామని దిగితే.. ఒక్క ఉదుటున వచ్చిన కెరటం తన కౌగిలిలో చుట్టేసింది. పక్కనే ఉన్న తీరంలో జలకాలుడుతున్న జనం ఒక్కసారిగా గావుకేకలేయడంతో అక్కడే ఉన్న బీచ్ లైఫ్‌గార్డులు ‘కడలిరంగం’లోకి దిగారు. కెరటాల దిగున సంద్రంలోకి కొట్టుకుపోతున్న ఓ యువకుడిని సమయస్ఫూర్తితో రక్షించి బీచ్ సందర్శకులతో శభాష్ అనిపించుకున్నారు.
 
వివరాలివీ...  హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మిత్రులు గౌస్, బాబీ, బాలాజీలు విశాఖకు పర్యాటకులుగా వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఆర్కే బీచ్‌కు వచ్చి, ఎగసి పడుతున్న కెరటాలు చూసి కాసేపు జలకాలాడుదామని బీచ్‌లోకి దిగారు. నురగలు కక్కుతున్న సంద్రంలో మరికొందరు పర్యాటకులతో కలిసి సందడి చేస్తూ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇంతలోకే ఉవ్వెత్తున ఎగసిపడిన ఓ కెరటం ఒక్కసారిగా గౌస్(30)ను ముంచేసి క్షణాల్లో సంద్రంలోకి తీసుకుపోయింది.
 
 సందర్శకులు పెద్దగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న లైఫ్ గార్డులు  పోలరాజు, డేవిడ్, శ్రీను రంగంలోకి దిగారు. అప్పటికే గౌస్ సముద్రంలో అర కిలోమీటర్ దూరం వరకు కొట్టుకువెళ్లిపోవడంతో లైఫ్‌గార్డులు వారి వద్ద ఉన్న రోప్  సాయంతో.. ఎంతో సాహసోపేతంగా లోనికి వెళ్లి గౌస్‌ను రక్షించారు. తీరంలోకి తీసుకువచ్చి ప్రథమ చిక్సిత్స అందించారు. అప్పటికే తీవ్ర ఆందోళనకు లోనైన స్నేహితులు బాలాజీ, బాబీలు గౌస్‌ను ఒక్కసారిగా హత్తుకుని కన్నీరు పెట్టారు. తనకు పునర్జన్మనిచ్చారంటూ గౌస్‌తోపాటు, స్నేహితులు ముగ్గురూ కన్నీళ్లతోపాటు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement