సత్తెనపల్లి విషాద ఘటనపై విచారణకు ఆదేశం | Guntur Range IG Prabhakar Rao Respond On Sattenapalli Incident | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లి విషాద ఘటనపై విచారణకు ఆదేశం

Published Mon, Apr 20 2020 12:52 PM | Last Updated on Mon, Apr 20 2020 1:30 PM

Guntur Range IG Prabhakar Rao Respond On Sattenapalli Incident - Sakshi

సాక్షి, గుంటూరు : లాక్‌డౌన్‌ నేపథ్యంలో సత్తెనపల్లిలో జరిగిన విషాద ఘటనపై గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌రావు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సోమవారం ఉదయం పోలీస్‌ చెక్‌పోస్ట్‌ వద్ద గౌస్‌ అనే యువకుడు ఒక్కసారిగా చెమటలు పట్టి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో బయటకు ఎందుకు వచ్చావని పోలీసులు ప్రశ్నించడంతో గౌస్‌ భయంతో కిందపడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు కొట్టడం వల్లే గౌస్‌ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఈ సంఘటనపై ఐజీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లిలో చనిపోయిన గౌస్‌ గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. బయటకు ఎందుకు వచ్చావని పోలీసులు అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదు. పోలీసులు ఆడటంతో అతడికి చెమటలు పట్టి కిందపడిపోయాడు. వెంటనే గౌస్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ జరుపుతున్నాం. ఎస్‌ఐ తప్పు ఉందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే గౌస్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం వీడియో తీయిస్తాం. పోలీసులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. పోలీసులపై ప్రత్యేకంగా ఒత్తిడేమీ లేదు.’ అని తెలిపారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement