సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ఘరానా మోసం బయటపడింది. రాజధానికి భూమి ఇవ్వకుండానే గౌస్ ఖాన్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున లబ్ధి పొందాడు. సీఆర్డీఏ అధికారులతో కలిసి అతడు ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సీఆర్డీఏకి మందడం రెవెన్యూలో గౌస్ ఖాన్ భూమి ఇచ్చినట్లు అధికారులు రికార్డులు సృష్టించారు. నది పరివాహక ప్రాంతంలో మిగులు భూమికి పత్రాలు సృష్టించి గౌస్ ఖాన్ పేరుతో అధికారులు ల్యాండ్ పూలింగ్‌కు తీసుకున్నారు. ఇందుకోసం గౌస్ ఖాన్‌కు ప్లాట్లు కూడా కేటాయించారు. దీంతో అతడికి సుమారు రూ.3.50 కోట్లుకు పైగా విలువ చేసే ప్రయోజనాలు చేకూరాయి. ఈ కుంభకోణం వెనుక సీఆర్డీఏ అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా గౌస్ ఖాన్ ఆ ప్లాట్లను హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు విక్రయించాడు. అయితే లింక్ డాక్యుమెంట్ల వద్ద ఈ ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గతంలోనూ సీఆర్డీఏ అధికారులు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ కుంభకోణం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశించారు. కాగా ఈ కుంభకోణంలో సీఆర్డీఏ అధికారులతో పాటు టీడీపీ నేతల పాత్ర కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపైన సీబీఐ విచారణ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అక్రమాలు జరిగాయి: సీఆర్డీఏ కమిషనర్
రాజధాని ప్రాంతం మందడంలో భూఅక్రమాలు జరిగాయని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అంగీకరించారు. మందడంలో ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఆన్ లైన్ రికార్డులను తారుమారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై అదనపు కమిషనర్ షణ్ముకంను విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. మూడు రోజుల్లో నివేదిక వస్తుందని, మందడం భూ దందాపై క్రిమినల్ కేసు నమోదు చేశామని సీఆర్డీఏ కమిషనర్ వెల్లడించారు. ఈ కుంభకోణంలో సీఆర్‌డీఏ అధికారుల పాత్ర కూడా ఉండవచ్చన్నారు. కంప్యూటర్ ఆపరేటర్తోనే ఈ అక్రమం జరిగే అవకాశం లేదని అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోందని తెలిపారు.59 వేల ప్లాట్లు లాటరీ ద్వారానే ఇచ్చామని,మంత్రులు, టిడిపి నేతలకు కార్నర్ ప్లాట్లు ఇచ్చామనే అంశంపై ఇంతవరకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఆయన పేర్కొన్నారు.
సీఆర్డీఏ కార్యాలయం ఎదటు సీపీఎం ఆందోళన
అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన భారీ కుంభకోణాలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద సీపీఎం మంగళవారం ఆందోళనకు దిగింది.అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అధికారులే భూదందాకు సహకరిస్తున్నారని, ప్లాట్ ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించింది. మంత్రులకు, టిడిపి నేతలకు కార్నర్ ప్లాట్లు ఎలా కేటాయించారని ప్రశ్నించింది. సిఎం నివాసంకు సమీపంలోనే భూదందా జరుగుతోందని,రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని సీఆర్‌డీఏ ప్రాంత సీపీఎం కన్వీనర్ సిహెచ్ బాబూరావు ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment