అన్నీ నాసిరకమే!
కొందరు రేషన్‌షాపు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర వస్తువులేగాక నాసిరకమైన సబ్బులు, సర్ఫ ప్యాకెట్లు, టీపొడి, మంచినూనె, కొబ్బరినూనె తదితర వస్తువులను విక్రయిస్తున్నారు.. అవి వద్దన్నా బలవంతంగా లబ్ధిదారులకు అంటగడుతూ ఇబ్బందులపాలు చేస్తున్నారు.. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు.. - పూడూరు
- రేషన్ షాపుల్లో కల్తీ వస్తువులు
- పట్టించుకోని అధికారులు
- ఆందోళనలో లబ్ధిదారులు
మండలంలో మొత్తం రేషన్ 34 షాపులు ఉన్నాయి. అందులో కొన్ని మినహా అన్నిట్లో ఈ సరుకులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం కేవలం బియ్యం, పంచదార, కందిపప్పు, కిరోసిన్, గోధుమలు మాత్రమే సరఫరా చేస్తోంది. అయితే పూడూరు మండలంలోని కొన్ని రేషన్ షాపుల డీలర్లు నాసిరకమైన సబ్బులు, ఇతర వస్తువులను కార్డుదారులకు అంటగడుతున్నారు. అధికారులు, డీలర్లు కుమ్మక్కై తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని షాపుల్లో ఈ వస్తువులన్నీ తప్పనిసరి కొనాల్సిందేనని నమ్మబలుకుతున్నారు. లే దంటే వచ్చేనెల రేషన్ కట్ అవుతుందని బెదిరిస్తున్నారు. ఈ తంతు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందని ఈ వ్యవహారంపై ఎవరూ పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా డీలర్ల సంఘం రాష్ట్ర నాయకుడే వీటిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. వాటిని అమ్మండి ఏమైనా ఇబ్బందులు వస్తే.. నేను చూసుకుంటాను.. అని అతను హామీ ఇస్తున్నారని డీలర్లు చెబుతున్నారు. ఈ సరుకులు అమ్మకుంటే ఉన్నతాధికారులతో తనిఖీలు చేయిస్తూ వేటు వేయిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాడన్నారు.
డీలర్‌షిప్‌లు రద్దు చేస్తాం
రేషన్ షాపుల్లో ప్రభుత్వం అందించే వస్తువులు మాత్రమే విక్రయించాలి. కొన్ని రేషన్‌షాపుల్లో కిరాణా వస్తువులు సైతం అనుమతి లేకుండా అమ్ముతున్నట్లు మాకు ఫిర్యాదులు అందాయి. ఇతర వస్తువులు అమ్మితే చర్యలు తీసుకుని డీలర్‌షిప్‌ను రద్దు చేస్తాం. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి పంచదార, బియ్యం, గోధుమలు, కిరోసిన్, గోధుమపిండి, కందిపప్పు సరఫరా అవుతోంది. త్వరలో అన్ని రేషన్‌షాపుల్లో తనిఖీలు నిర్వహించి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం.
- వెంక ట ఉపేందర్‌రెడ్డి,
ఇన్చార్జి తహసీల్దార్, పూడూరు
తనిఖీలు నిర్వహించాలి
రేషన్ షాపుల్లో నాసిరకం సరుకులు అమ్ముతూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వచ్చిన సరుకులు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్న లబ్ధిదారులకు వాటిని అంటగట్టడం తగదు. ఏకంగా డీలర్ల సంఘం రాష్ర్ట నాయకుడే ఇలా పంపిణీ చేస్తున్నారు. వెంటనే అధికారులు ఆయా రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలి.
- హరీశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం మండల అధ్యక్షుడు
బ్లాక్‌లో అమ్ముతున్నారు
కొందరు రేషన్ డీలర్లు బ్లాక్‌లో సరుకులను అమ్ముతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇవి అమ్ముకోవాలని జీఓ ఉందని చెబుతున్నారు. ప్రతి మండలంలో ఇదే తంతు జరుగుతున్నా పౌరసరఫరాలశాఖ అధికారులు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఇతర సరుకుకులు కొంటేనే బియ్యం ఇస్తామని లబ్ధిదారులకు బలవంతంగా అంటగడుతున్నారు. వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి.
- కోళ్ల యాదయ్య, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి