Government advocate
-
విల్లు.. వివాదాలకు చెల్లు
రఘు వయసు 51. అప్పటివరకూ కష్టపడి కూడబెట్టింది ఫిక్స్డ్ డిపాజిట్‌గా దాచుకున్నాడు. నామినీగా భార్య పేరు రాశాడు. కొన్నాళ్లకు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మరి.. రఘు డిపాజిట్లు మొత్తం నామినీగా ఉన్న భార్యకే దక్కాయా? అంటే లేదనే చెప్పాలి. సరస్వతి భర్త చిన్న వయసులోనే కాలం చేశాడు. వారికి పిల్లలు కూడా లేరు. ఉన్నదల్లా తల్లి, తండ్రి, అత్త మాత్రమే. ఈ పరిస్థితుల్లో సరస్వతి కూడా మరణిస్తే ఆమె సంపాదించినది ఎవరికి దక్కుతుంది? ముగ్గురికీ అనుకుంటున్నారా? కానీ చట్టప్రకారం ఒక్క అత్తకు మాత్రమే దక్కింది. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఘటనలు ఏ ఒకరిద్దరికో పరిమితం కాదు.. ఇటీవలి కాలంలో చాలా మంది ఇళ్లలో ఎదురవుతున్నవే. మరి ఒక వ్యక్తి తన ఆస్తులను ఇష్టం వచ్చిన వారికి ఇవ్వాలనుకుంటే ఎలా? నామినీకి, వీలునామాకు తేడా ఏమిటి? దాన్ని ఎప్పుడు రాయాలి.. ఎలా రాయాలి లాంటి వివరాలతో కథనం. వీలునామా అంటే... : ఒక వ్యక్తి మరణం తరువాత తన స్థిర, చరాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియజెప్పే చట్టబద్ధమైన డాక్యుమెంటే వీలునామా. మరణ వాంగ్మూలానికి ఎంత చట్టబద్ధత ఉందో అలాంటి చట్టబద్ధతే ఈ వీలునామాకు ఉంది. మనిషి బతికున్నంత వరకు వీలునామా ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు. కానీ చివరిసారిగా రాసిన వీలునామానే చట్టప్రకారం చెల్లుబాటు అవుతుంది. వీలునామాపై ఇద్దరు సాక్షుల సంతకం తప్పనిసరి. ఆర్యోగంగా, మానసికంగా సరిగ్గా ఉన్న మేజర్లు రాసిన విల్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. భారతీయ వారసత్వ చట్టం సెక్షన్ 59 ప్రకారం విల్లు రాయాలి. నామినీ వేరు.. వారసులు వేరు..: చాలా మంది జీవిత బీమాకో.. బ్యాంకు ఖాతాకో.. ఇతర ఆర్థిక లావాదేవీలకో.. నామినీగా ఎవరినో ఒకరిని పెడతారు. తమకేమన్నా అయితే నామినీకి ఆ మొత్తం వెళుతుందనుకుంటారు. అయితే చట్టప్రకారం నామినీ అనేది వారసుల కిందకు రాదు. వ్యక్తి మరణించిన తర్వాత ఆ నగదు నామినీకి చెందదు. వారసుల్లో నామినీ ఉంటే వారికి చట్టప్రకారం వాటా మాత్రమే వస్తుంది. నామినీగా ఒక వారసుడి పేరో లేదా వారసురాలి పేరో పెట్టినంత మాత్రాన ఆ నగదు మొత్తం వారికే చెందదు. ఇది తెలియని చాలా మంది నామినీగా ఫలానా వారి పేరు పెట్టారని వారికి రావాల్సిన వాటాను కోల్పోతుంటారు. వీలునామా రిజిస్ట్రేషన్అవసరమా?..: వీలునామాను రిజిస్ట్రేషన్ చేయిస్తే.. దాంతో లబ్దిదారులు బ్యాంకు రుణాలు, ఇతర అవసరాలకు వాడుకొనే వీలు ఉంటుంది. రిజిస్టర్ అయిన వీలునామాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నామమాత్రపు చార్జీతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. తెల్ల కాగితంపై రాసినా చట్టబద్ధమే. కుటుంబంలో కనీసం ఒక్క వ్యక్తికయినా వీలునామాను ఎక్కడ భద్రపరిచిందీ తెలియజేయాలి. ఆన్లైన్లో వీలునామా సేవల కోసం ఓ సంస్థ..: అత్యంత స్వల్ప రుసుముతో ఆన్లైన్ ద్వారా చట్ట ప్రకారం విల్లు సిద్ధం చేసే లక్ష్యంతో ఆసాన్విల్ అనే సంస్థ ఏడాది క్రితం ప్రారంభమైంది. ఈ సంస్థ రూపకర్త తెలంగాణ వ్యక్తి విష్ణు చుండి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ ఉన్నట్లు.. వీలునామా కూడా ఉండాలన్నదే ఆ సంస్థ లక్ష్యం. అంతేకాదు.. తమ వద్దకు వచ్చే వారిని సేవా కార్యక్రమాలు, అవయవదానం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ. 100 కోట్లను వివిధ చారిటీలకు అందించారు. దీనికిగాను 2018లో ది సొసైటీ ఆఫ్ విల్ రైటర్స్ నుంచి గుర్తింపు పత్రం అందుకున్నారు. రూ. 1,50,000 కోట్లు.. ఎవరికీ చెందకుండా దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లో, బీమా పాలసీ కంపెనీల్లో పేరుకుపోయిన నగదు లెక్క ఇది. (లెక్కల్లోకి రానిది ఈ మొత్తంకన్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చు.) స్పృహలో లేనప్పుడు రాస్తే చెల్లదు... సొంతంగా సంపాదించిన ఆస్తులకు, ఆదాయానికి సంబంధించి మాత్రమే వీలునామా రాయొచ్చు. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు చట్టప్రకారం వారసులకే ఆ ఆస్తులు దక్కుతాయి. ఆ వ్యక్తి మరణానంతరమే వీలునామా అమల్లోకి వస్తుంది. మత్తులో ఉన్న సమయంలోనూ, తీవ్ర అనారోగ్యంగా ఉన్నప్పుడు, తాను ఏం చేస్తున్నానన్న దానిపై స్పృహ లేని వ్యక్తులు వీలునామా రాయడానికి అవకాశం లేదు. – సామల రవీందర్, ప్రభుత్వ న్యాయవాది, హైకోర్టు -
4 వారాల్లోగా లీగల్ ఫీజులు చెల్లించాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల తరఫున హైకోర్టు, ట్రిబ్యునళ్లు, ఇతర న్యాయస్థానాల్లో వివిధ హోదాల్లో సేవలందించిన న్యాయవాదులకు లీగల్ ఫీజులు/గౌరవ వేతనం సకాలంలో చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లకు ఇప్పటివరకు చెల్లించాల్సిన ఫీజులను 4 వారాల్లో చెల్లించాలని 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. ఇక నుంచి వారి ఫీజులను బిల్లులు సమర్పించిన 4 వారాల్లో లేదా 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి నెల తర్వాత చెల్లించాలని స్పష్టం చేసింది. కింది కోర్టులు, ట్రిబ్యునళ్లలో సేవలందిస్తున్న వారికి ప్రతి నెలా సకాలంలో లీగల్ ఫీజులు అందేలా చర్యలు తీసుకోవాలని న్యాయ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తీర్పు వెలువరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతంలో మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించిన సీహెచ్ వేదవాణి తనకు చెల్లించాల్సిన లీగల్ ఫీజులను చెల్లించడంలేదంటూ 2015లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆమెకు ఫీజులను చెల్లించాలని అధికారులను ఆదేశించింది. వారు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో వేదవాణి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ బట్టు దేవానంద్ విచారించారు. విచారణ సందర్భం గా ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్స్ సకాలంలో లీగల్ ఫీజులు అందక పడుతున్న ఇ బ్బందులు న్యాయమూర్తి దృష్టికి వచ్చాయి. దీంతో తనకున్న విచక్షణాధికారంతో ఈ వ్యాజ్యం పరిధిని విస్తృతపరిచి ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్స్ అందరికీ వర్తించేలా తీర్పునిచ్చారు. కోర్టుకెక్కే పరిస్థితి తేవద్దు ‘ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్స్ సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం, ఇతర విభాగాలు బిల్లులను మాత్రం సకాలంలో చెల్లించడంలేదు. వారూ కుటుంబాల సంక్షేమాన్ని చూసుకోవాలి. ఓ కార్యాలయాన్ని, గ్రంథాలయాన్ని, సహచరులను, సిబ్బందిని నిర్వహించాలి. సకాలంలో లీగల్ ఫీజులు చెల్లించకపోతే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫీజు కోసం హైకోర్టులో పిటిషన్లు, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలు చేసే పరిస్థితి వారికి తీసుకురావద్దు. రాజకీయ కారణాలతో కూడా ఫీజుల చెల్లింపుల్లో అసాధారణ జాప్యం జరుగుతోందన్న ఆరోపణ ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారి ఫీజులు ఆపుతున్నారన్న ఆరోపణ నిజమైతే అది సమంజసం కాదు. వారు సేవలందించింది రాష్ట్రానికే తప్ప వ్యక్తులకు కాదు. పాలకులు వస్తూ పోతూ ఉంటారు. రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది. సకాలంలో ఫీజులు పొందే హక్కు అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ న్యాయవాది, స్టాండింగ్ కౌన్సిల్ సహా అందరికీ ఉంది’ అని జస్టిస్ దేవానంద్ తన తీర్పులో స్పష్టం చేశారు. -
ఆ భూమిని ఏం చేస్తారో చెప్పండి
♦ వెనక్కి తీసుకుంటారా.. ఆ సంస్థ ఆధీనంలోనే ఉంచుతారా? ♦ ఈ విషయం చెప్పేందుకు ఇన్ని వాయిదాలా..? ♦ ప్రభుత్వ న్యాయవాదిపై అసంతృప్తి ♦ ఇదే చివరి అవకాశమన్న ధర్మాసనం ♦ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్‌కు భూ కేటాయింపుపై పిల్ సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, రాజేందర్‌నగర్ మండలం, గండిపేట గ్రామంలో ప్రజారోగ్య ప్రపంచస్థాయి కళాశాల ప్రాంగణం ఏర్పాటు నిమిత్తం 2009లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్‌కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంటారా..? లేక ఆ సంస్థ అధీనంలోనే ఆ భూమి ఉంచదలిచారా..? చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఇదే విషయాన్ని చెప్పాలని గత రెండు వారాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఏ విషయం తమకు చెప్పడం లేదని, ఇదే చివరి అవకాశమని, మరోసారి ఎలాంటి గడువునిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదావేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గండిపేట గ్రామంలో అత్యంత విలువైన భూమిని అప్పటి ప్రభుత్వం నామమాత్రపు ధరకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్‌కు కేటాయించిందని, ఈ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది వి.రవిబాబు 2009లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. ఇప్పటికే ఈ వ్యాజ్యాన్ని పలుమార్లు విచారించిన ధర్మాసనం తాజాగా సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్‌కు కేటాయించిన భూమి విషయంలో సీఎంతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి చెప్పారని, అందువల్ల మరింత గడువు కావాలని కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ‘ఎన్నిసార్లు వాయిదాలు కోరుతారు.. చిన్న విషయం చెప్పేందుకు ఇన్ని వారాలా..? రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్‌కు భూమి కేటాయించినందున ఆ కేటాయింపు విషయంలో ప్రభుత్వ వైఖరేమిటని గత రెండు వారాలుగా అడుగుతూనే ఉన్నాం. ఆ విషయం చెప్పకుండా మీరు వాయిదాలు కోరుతూనే ఉన్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ఇలా అయితే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తాం. చివరి అవకాశం ఇదే. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాం. అప్పటికి ఏ విషయం చెప్పండి. వచ్చే విచారణకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని లేదా బాధ్యత కలిగిన ఏ అధికారినైనా కోర్టు ముందు హాజరుకమ్మని చెప్పండి.’ అని ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టం చేసింది.