
రఘు వయసు 51. అప్పటివరకూ కష్టపడి కూడబెట్టింది ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా దాచుకున్నాడు. నామినీగా భార్య పేరు రాశాడు. కొన్నాళ్లకు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మరి.. రఘు డిపాజిట్లు మొత్తం నామినీగా ఉన్న భార్యకే దక్కాయా? అంటే లేదనే చెప్పాలి.
సరస్వతి భర్త చిన్న వయసులోనే కాలం చేశాడు. వారికి పిల్లలు కూడా లేరు. ఉన్నదల్లా తల్లి, తండ్రి, అత్త మాత్రమే. ఈ పరిస్థితుల్లో సరస్వతి కూడా మరణిస్తే ఆమె సంపాదించినది ఎవరికి దక్కుతుంది? ముగ్గురికీ అనుకుంటున్నారా? కానీ చట్టప్రకారం ఒక్క అత్తకు మాత్రమే దక్కింది.
సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఘటనలు ఏ ఒకరిద్దరికో పరిమితం కాదు.. ఇటీవలి కాలంలో చాలా మంది ఇళ్లలో ఎదురవుతున్నవే. మరి ఒక వ్యక్తి తన ఆస్తులను ఇష్టం వచ్చిన వారికి ఇవ్వాలనుకుంటే ఎలా? నామినీకి, వీలునామాకు తేడా ఏమిటి? దాన్ని ఎప్పుడు రాయాలి.. ఎలా రాయాలి లాంటి వివరాలతో కథనం.
వీలునామా అంటే... : ఒక వ్యక్తి మరణం తరువాత తన స్థిర, చరాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియజెప్పే చట్టబద్ధమైన డాక్యుమెంటే వీలునామా. మరణ వాంగ్మూలానికి ఎంత చట్టబద్ధత ఉందో అలాంటి చట్టబద్ధతే ఈ వీలునామాకు ఉంది. మనిషి బతికున్నంత వరకు వీలునామా ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు. కానీ చివరిసారిగా రాసిన వీలునామానే చట్టప్రకారం చెల్లుబాటు అవుతుంది. వీలునామాపై ఇద్దరు సాక్షుల సంతకం తప్పనిసరి. ఆర్యోగంగా, మానసికంగా సరిగ్గా ఉన్న మేజర్లు రాసిన విల్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. భారతీయ వారసత్వ చట్టం సెక్షన్ 59 ప్రకారం విల్లు రాయాలి.
నామినీ వేరు.. వారసులు వేరు..: చాలా మంది జీవిత బీమాకో.. బ్యాంకు ఖాతాకో.. ఇతర ఆర్థిక లావాదేవీలకో.. నామినీగా ఎవరినో ఒకరిని పెడతారు. తమకేమన్నా అయితే నామినీకి ఆ మొత్తం వెళుతుందనుకుంటారు. అయితే చట్టప్రకారం నామినీ అనేది వారసుల కిందకు రాదు. వ్యక్తి మరణించిన తర్వాత ఆ నగదు నామినీకి చెందదు. వారసుల్లో నామినీ ఉంటే వారికి చట్టప్రకారం వాటా మాత్రమే వస్తుంది. నామినీగా ఒక వారసుడి పేరో లేదా వారసురాలి పేరో పెట్టినంత మాత్రాన ఆ నగదు మొత్తం వారికే చెందదు. ఇది తెలియని చాలా మంది నామినీగా ఫలానా వారి పేరు పెట్టారని వారికి రావాల్సిన వాటాను కోల్పోతుంటారు.
వీలునామా రిజిస్ట్రేషన్అవసరమా?..: వీలునామాను రిజిస్ట్రేషన్ చేయిస్తే.. దాంతో లబ్దిదారులు బ్యాంకు రుణాలు, ఇతర అవసరాలకు వాడుకొనే వీలు ఉంటుంది. రిజిస్టర్ అయిన వీలునామాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నామమాత్రపు చార్జీతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. తెల్ల కాగితంపై రాసినా చట్టబద్ధమే. కుటుంబంలో కనీసం ఒక్క వ్యక్తికయినా వీలునామాను ఎక్కడ భద్రపరిచిందీ తెలియజేయాలి.
ఆన్‌లైన్‌లో వీలునామా సేవల కోసం ఓ సంస్థ..: అత్యంత స్వల్ప రుసుముతో ఆన్‌లైన్ ద్వారా చట్ట ప్రకారం విల్లు సిద్ధం చేసే లక్ష్యంతో ఆసాన్‌విల్ అనే సంస్థ ఏడాది క్రితం ప్రారంభమైంది. ఈ సంస్థ రూపకర్త తెలంగాణ వ్యక్తి విష్ణు చుండి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ ఉన్నట్లు.. వీలునామా కూడా ఉండాలన్నదే ఆ సంస్థ లక్ష్యం. అంతేకాదు.. తమ వద్దకు వచ్చే వారిని సేవా కార్యక్రమాలు, అవయవదానం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ. 100 కోట్లను వివిధ చారిటీలకు అందించారు. దీనికిగాను 2018లో ది సొసైటీ ఆఫ్ విల్ రైటర్స్ నుంచి గుర్తింపు పత్రం అందుకున్నారు.
రూ. 1,50,000 కోట్లు..
ఎవరికీ చెందకుండా దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లో, బీమా పాలసీ కంపెనీల్లో పేరుకుపోయిన నగదు లెక్క ఇది. (లెక్కల్లోకి రానిది ఈ మొత్తంకన్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చు.)
స్పృహలో లేనప్పుడు రాస్తే చెల్లదు...
సొంతంగా సంపాదించిన ఆస్తులకు, ఆదాయానికి సంబంధించి మాత్రమే వీలునామా రాయొచ్చు. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు చట్టప్రకారం వారసులకే ఆ ఆస్తులు దక్కుతాయి. ఆ వ్యక్తి మరణానంతరమే వీలునామా అమల్లోకి వస్తుంది. మత్తులో ఉన్న సమయంలోనూ, తీవ్ర అనారోగ్యంగా ఉన్నప్పుడు, తాను ఏం చేస్తున్నానన్న దానిపై స్పృహ లేని వ్యక్తులు వీలునామా రాయడానికి అవకాశం లేదు. – సామల రవీందర్, ప్రభుత్వ న్యాయవాది, హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment