♦ వెనక్కి తీసుకుంటారా.. ఆ సంస్థ ఆధీనంలోనే ఉంచుతారా?
♦ ఈ విషయం చెప్పేందుకు ఇన్ని వాయిదాలా..?
♦ ప్రభుత్వ న్యాయవాదిపై అసంతృప్తి
♦ ఇదే చివరి అవకాశమన్న ధర్మాసనం
♦ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్‌కు భూ కేటాయింపుపై పిల్
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, రాజేందర్‌నగర్ మండలం, గండిపేట గ్రామంలో ప్రజారోగ్య ప్రపంచస్థాయి కళాశాల ప్రాంగణం ఏర్పాటు నిమిత్తం 2009లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్‌కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంటారా..?
లేక ఆ సంస్థ అధీనంలోనే ఆ భూమి ఉంచదలిచారా..? చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఇదే విషయాన్ని చెప్పాలని గత రెండు వారాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఏ విషయం తమకు చెప్పడం లేదని, ఇదే చివరి అవకాశమని, మరోసారి ఎలాంటి గడువునిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదావేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గండిపేట గ్రామంలో అత్యంత విలువైన భూమిని అప్పటి ప్రభుత్వం నామమాత్రపు ధరకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్‌కు కేటాయించిందని, ఈ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది వి.రవిబాబు 2009లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. ఇప్పటికే ఈ వ్యాజ్యాన్ని పలుమార్లు విచారించిన ధర్మాసనం తాజాగా సోమవారం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్‌కు కేటాయించిన భూమి విషయంలో సీఎంతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి చెప్పారని, అందువల్ల మరింత గడువు కావాలని కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ‘ఎన్నిసార్లు వాయిదాలు కోరుతారు.. చిన్న విషయం చెప్పేందుకు ఇన్ని వారాలా..? రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్‌కు భూమి కేటాయించినందున ఆ కేటాయింపు విషయంలో ప్రభుత్వ వైఖరేమిటని గత రెండు వారాలుగా అడుగుతూనే ఉన్నాం.
ఆ విషయం చెప్పకుండా మీరు వాయిదాలు కోరుతూనే ఉన్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ఇలా అయితే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తాం. చివరి అవకాశం ఇదే. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాం. అప్పటికి ఏ విషయం చెప్పండి. వచ్చే విచారణకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని లేదా బాధ్యత కలిగిన ఏ అధికారినైనా కోర్టు ముందు హాజరుకమ్మని చెప్పండి.’ అని ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఆ భూమిని ఏం చేస్తారో చెప్పండి
Published Tue, Jul 21 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM
Advertisement
Advertisement