Government efforts
-
చెత్తా బంగారమే!
- వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తికి కసరత్తు - జిల్లాలో తొలిసారిగా తిరుపతిలో యూనిట్ - ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న యంత్రాంగం - ఈ నెలాఖరులోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం చిత్తూరు (అర్బన్): ‘ చెత్త చెత్త కాదు. సద్వినియోగపరిస్తే మళ్లీ ఉపయోగపడుతుంది. చెత్తను రీసైకిల్ చేద్దాం. రీ యూస్ చేద్దాం. చేయిచేయి కలుపుదాం. చెత్తపై సమరం సాగిద్దాం..’ అంటూ మునిసిపల్ అధికారులు, సిబ్బంది సెల్ఫోన్లలో వినిపించే రింగ్‌టోన్ నిజం కానుంది. జిల్లాలో ఉపయోగపడదని మనం పారబోసే చెత్త నుంచి విద్యుత్ తయారు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి నగరంలో ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి చకచకా పనులు సాగుతున్నాయి. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్ల నుంచి రోజుకు 600 మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపైకి వచ్చి పడుతోంది. ఈ మొత్తం వ్యర్థాలను ఆయా పరిధిల్లోని డంపింగ్ యార్డుల్లో వేయడం.. వీటిని తడి, పొడి చెత్తగా వేరుచేసి తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్తను మళ్లీ ఇతర ప్రాంతాల్లో పడేయడం స్థానిక సంస్థలకు భారంగా మారుతోంది. అయితే ఇలా వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే ఆలోచన ఆరేళ్ల క్రితమే తెరపైకి వచ్చింది. కానీ వ్యయం ఎక్కువ అవుతుందని, చెత్త సైతం భారీ మొత్తంలో కావాలని గతంలో కొందరు అధికారులు ఇచ్చిన సమాచారంతో ప్రాజెక్టును ప్రభుత్వం పక్కన పడేసింది. అయితే ఇటీవల సింగపూర్‌కు వెళ్లొచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అక్కడ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చూసి.. ఇదే తరహాలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కనీసం ఒక్కో చోట ఏర్పాటు చేయాలని కమిషనర్లను ఆదేశించారు. రెండు రోజుల క్రితం హైదరాబాదులో జరిగిన మునిసిపల్ కమిషనర్ల సమావేశంలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి తక్కువ మొత్తం వ్యర్థాలు చాలని, జిల్లాలో తొలిగా తిరుపతి నగరంలో ఈ ప్రాజెక్టు నెలకొల్పడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ వినయ్‌చంద్‌కు చెప్పారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ సమీక్షించాలని సైతం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రాజెక్టు ఏర్పాటుకు జోరుగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇలా తయారీ... చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే 350 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు అవసరం. తిరుపతి కార్పొరేషన్లో రోజుకు సగటున 234 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. దీంతో పాటు చిత్తూరులో 80 టన్నులు, శ్రీకాళహస్తి నుంచి 42 టన్నులు, పుత్తూరు నుంచి 30 టన్నులు, నగరి నుంచి 22 టన్నుల చెత్తను తిరుపతికి తరలించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రోజుకు మొత్తం 400 మెట్రిక్ టన్నుల చెత్తను తిరుపతికి తరలిస్తారు. ఆ చెత్తను మండించి రోజుకు 2 నుంచి 8 మెగా వాట్ల విద్యుత్ తయారు చేస్తారు. ప్రాజెక్టు ఏర్పాటుకు తిరుపతిలో 3 నుంచి 6 ఎకరాల స్థలం వెంటనే సిద్ధం చేయాలని ప్రభుత్వం కలెక్టర్, తిరుపతి కమిషనర్‌ను ఆదేశించింది. నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇవ్వగానే నెలాఖరులోపు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడానికి అధికారులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. -
సోలార్‌తో తాగు నీరు
- విద్యుత్ లేని గిరిజన గ్రామాలు 220 - తొలి విడతగా 6 గూడేల్లో అమలు - మరో 85 గ్రామాల్లో ఏర్పాటుకు ప్రణాళిక మహారాణిపేట(విశాఖ) : జిల్లాలోని అన్ని గ్రామాలకు రక్షిత తాగు నీరు అందించాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ముఖ్యంగా గెడ్డనీరు, ఊట నీరుపై ఆధారపడుతున్న గిరిజన గ్రామాలకు రక్షిత తాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఏజెన్సీలో తాగునీటి కోసం గెడ్డలు, ఊట బావులపై ఆధారపడిన, విద్యుత్ లేని 220 గిరిజన గ్రామాలను అధికారులు గుర్తించారు. తొలి విడతగా ఇప్పటికే విద్యుత్ లేని ఆరు గ్రామాల్లో సోలార్ పద్ధతి ద్వారా తాగు నీరు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే మరో 85 గ్రామాల్లో ఈ పద్ధతి ద్వారా తాగు నీరందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంకులు, ట్యాంకులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎ. ప్రభాకర్‌రావు తెలిపారు. మిగిలిన గ్రామాలకు సెప్టెంబర్ లోగా సోలార్ పద్ధతిన తాగునీరందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచబ్యాంకు సాయంతో.. ఇదిలా ఉండగా ప్రపంచ బ్యాంకు, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో 9,464 కుటుంబాల్లో సమగ్ర రక్షిత మంచి నీరందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీలో 5 మండలాల(పెదబయలు, జి. మాడుగుల, ముంచంగిపుట్ట, అనంతగిరి, హుకుంపేట) పరిధిలోని 2,667 కుటుంబాలకు, మైదాన ప్రాంతంలో 2 మండలాలు (గొలుగొండ, పద్మనాభం) లోని 6,787 కుటుంబాలకు రక్షిత మంచి నీటి కోసం వాటర్ ట్యాంకులు నిర్మించారు. ప్రజలిచ్చిన విరాళాలతో కొన్ని గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు అమరుస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచ బ్యాంక్ రూ. 2019.80 లక్షలు ఆర్థిక సాయం చేయగా.. కుటుంబానికి రూ.250 చొప్పున రూ. 23,72,250 ప్రజలు విరాళాలుగా ఇవ్వాల్సి ఉండగా రూ. 9,13,250 వసూలయ్యాయి. సత్యసాయి ట్రస్ట్ ద్వారా కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో రక్షిత నీరందిస్తున్నారు. ఇంకా నీరందాల్సిన గ్రామాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం గానీ.. సంస్థలు గానీ.. చేపట్టే రక్షిత నీటి పథకాలు మూన్నాళ్ల ముచ్చట కాకుండా శాశ్వతంగా నీరందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.