సోలార్‌తో తాగు నీరు
- విద్యుత్ లేని గిరిజన గ్రామాలు 220
- తొలి విడతగా 6 గూడేల్లో అమలు
- మరో 85 గ్రామాల్లో ఏర్పాటుకు ప్రణాళిక
మహారాణిపేట(విశాఖ) : జిల్లాలోని అన్ని గ్రామాలకు రక్షిత తాగు నీరు అందించాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ముఖ్యంగా గెడ్డనీరు, ఊట నీరుపై ఆధారపడుతున్న గిరిజన గ్రామాలకు రక్షిత తాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఏజెన్సీలో తాగునీటి కోసం గెడ్డలు, ఊట బావులపై ఆధారపడిన, విద్యుత్ లేని 220 గిరిజన గ్రామాలను అధికారులు గుర్తించారు.
తొలి విడతగా ఇప్పటికే విద్యుత్ లేని ఆరు గ్రామాల్లో సోలార్ పద్ధతి ద్వారా తాగు నీరు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే మరో 85 గ్రామాల్లో ఈ పద్ధతి ద్వారా తాగు నీరందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంకులు, ట్యాంకులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఎ. ప్రభాకర్‌రావు తెలిపారు. మిగిలిన గ్రామాలకు సెప్టెంబర్ లోగా సోలార్ పద్ధతిన తాగునీరందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రపంచబ్యాంకు సాయంతో..
ఇదిలా ఉండగా ప్రపంచ బ్యాంకు, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో 9,464 కుటుంబాల్లో సమగ్ర రక్షిత మంచి నీరందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీలో 5 మండలాల(పెదబయలు, జి. మాడుగుల, ముంచంగిపుట్ట, అనంతగిరి, హుకుంపేట) పరిధిలోని 2,667 కుటుంబాలకు, మైదాన ప్రాంతంలో 2 మండలాలు (గొలుగొండ, పద్మనాభం) లోని 6,787 కుటుంబాలకు రక్షిత మంచి నీటి కోసం వాటర్ ట్యాంకులు నిర్మించారు. ప్రజలిచ్చిన విరాళాలతో కొన్ని గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు అమరుస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచ బ్యాంక్ రూ. 2019.80 లక్షలు ఆర్థిక సాయం చేయగా.. కుటుంబానికి రూ.250 చొప్పున రూ. 23,72,250 ప్రజలు విరాళాలుగా ఇవ్వాల్సి ఉండగా రూ. 9,13,250 వసూలయ్యాయి. సత్యసాయి ట్రస్ట్ ద్వారా కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో రక్షిత నీరందిస్తున్నారు. ఇంకా నీరందాల్సిన గ్రామాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం గానీ.. సంస్థలు గానీ.. చేపట్టే రక్షిత నీటి పథకాలు మూన్నాళ్ల ముచ్చట కాకుండా శాశ్వతంగా నీరందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.