safe drinking water
-
సురక్షిత తాగునీటిలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో నూటికి నూరు శాతం సురక్షితమైన తాగునీటిని అందించే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. జలజీవన్ మిషన్ ద్వారా ఇది సాకారమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. జలజీవన్ మిషన్ అమలులో భారతదేశం పురోగతి సాధించిందని తెలిపింది. ఇంటింటికీ వంద శాతం సురక్షితమైన తాగునీరు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, గోవా, హరియాణా, గుజరాత్, పంజాబ్ ఉన్నాయి. తెలంగాణలో 53.98 లక్షల ఇళ్లుంటే.. అందులో ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉందని నివేదిక వివరించింది. కాగా, ఈ రాష్ట్రాల కంటే నీటి స్వచ్ఛతలో మాత్రం తెలంగాణే నంబర్‌వన్ స్థానంలో ఉంది. మన రాష్ట్ర తాగునీటి స్వచ్ఛత 98.7 శాతంగా ఉంది. యూరప్‌లో కేవలం 62 శాతం ఇళ్లకే స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. కాగా, దేశంలో ఇప్పటివరకు సగటున 62.84 శాతం మందికి ఇంటింటికీ తాగునీటి వసతి ఉందని తెలిపింది. దేశంలో డయేరియా మరణాలు 6 లక్షలు.. దేశంలో డయేరియా, ఇన్ఫెక్షన్లు, మలేరియా, డెంగీ, శ్వాసకోశ సంబంధిత రోగాల వల్ల ప్రతీ ఏడాది లక్షకు 40–70 మంది వరకు మరణిస్తున్నారని డబ్లు్యహెచ్‌వో వేదిక వివరించింది. ఈ మరణాల్లో ఐదేళ్లలోపువారే 60 శాతం ఉంటారని పేర్కొంది. తాగునీరు సరిగా లేకపోవడం, పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించకపోవడం, చేతి శుభ్రత పాటించకపోవడం వల్ల డయేరియా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. 2019 లెక్కల ప్రకారం డయేరియాతో దేశవ్యాప్తంగా 6.07 లక్షల మంది చనిపోతున్నారు. అందులో తాగునీరు సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియా మరణాలు 2,03,863 ఉన్నాయి. ఇందులో మహిళలే 1,23,964 మంది ఉన్నారు. ఐదేళ్లలోపు వారు 20,045 మంది ఉన్నారు. ఇక పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియాతో 2,44,287 మంది చనిపోతున్నారు. అందులో మహిళలు 1.48 లక్షల మంది ఉన్నారు. ఐదేళ్లలోపు వారు 24,020 మంది ఉన్నారు. ఇక చేతి శుభ్రత సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియా మరణాలు ఏడాదికి 1,59,015 ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వివరించింది. అందులో 96,694 మంది మహిళలుండగా, ఐదేళ్లలోపువారు 15,635 మంది ఉన్నారు. ఇదిలావుంటే 51,740 మంది చేతి శుభ్రత సరిగా లేకపోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్నారని ఆ వేదిక పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు.. ► పరిశుభ్రమైన నీరు, పరిసరాలు శుభ్రంగా ఉంచకపోవడం, చేతి శుభ్రత పాటించకపోతే సాంక్రమిక వ్యాధులు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు, మలేరియా, డెంగీ వంటివి వస్తాయి. ఆసుపత్రుల్లోనూ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ► తాగునీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే జబ్బులు వస్తాయి. ► డయేరియా కారణంగా పిల్లలు బడికి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల పనితీరులోనూ మార్పులు వస్తాయి. ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి పెరుగుతుంది. ► చేతి శుభ్రత లేకపోతే కరోనా వంటి వైరస్లు వస్తాయి. తాగునీరు సరిగా లేకపోవడం వల్ల రక్తహీనత కూడా సంభవిస్తుంది. ► ప్రపంచంలో 56 శాతం జనాభాకు మాత్రమే ఇంటి వద్ద సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంది. ఆఫ్రికాలో 9 శాతం, యూరప్‌లో 62 శాతం మాత్రమే సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంది. ఇది దక్షిణాసియా దేశాల్లో 27 శాతమే ఉంది. ► వాగులు వంకల్లో నీటిని తాగే వారితో పోలిస్తే శుద్ధి చేసిన ఇంటి వద్దే అందుబాటులో ఉన్న నీటిని తాగడం వల్ల 52 శాతం డయేరియా కేసుల సంఖ్య తగ్గుతుంది. మిషన్ భగీరథతో స్వచ్ఛమైన నీరు డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారానే ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించడం సాధ్యపడింది. ఇదే దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం స్వచ్ఛమైన నీటిని అందించే విషయంలో యూరప్ మన రాష్ట్రం కంటే వెనుకబడి ఉంది. తాగునీటి స్వచ్ఛతలో గెలంగాణ టాప్‌లో నిలవడం మనకు గర్వకారణం. -
ఉద్దానం ఫేజ్–2కు రెడీ
సాక్షి, అమరావతి: దశాబ్దాల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా సురక్షిత తాగునీరు అందించనుంది. ఇందుకోసం రూ.265 కోట్లతో ఉద్దానం ఫేజ్–2 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. తద్వారా పాతపట్నం, మెలియపుట్టి, హిరమండలం, కొత్తూరు, లక్ష్మీనరసపేట మండలాల పరిధిలోని 448 నివాసిత ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు మూడున్నర లక్షల మందికి తాగునీటి ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగిపోతాయి. ఉద్దానం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో కొన్ని ప్రమాదకర లోహాలు కారణంగానే ఆ నీటిని తాగే అక్కడి ప్రజలు ఏళ్ల తరబడి కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ సమస్య పరిష్కారానికి గత చంద్రబాబు ప్రభుత్వం మాయమాటలు చెబుతూ కాలక్షేపం చేస్తే.. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడునెలలకే రూ.700 కోట్లతో పలాస, ఇచ్ఛాపురం రెండు మున్సిపాలిటీలతో పాటు ఆ ప్రాంతంలోని ఏడు మండలాల పరిధిలోని 807 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించే ఉద్దానం ఫేజ్–1 రక్షిత మంచినీటి పథకానికి 2019 సెప్టెంబరు 6న ప్రభుత్వం మంజూరు చేసింది. 2020 ఆరంభంలోనే పనులను కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ పనులు 90 శాతానికి పైగా పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనికి అనుసంధానంగా ఇప్పుడు ఆ ప్రాంతంలోని మరో ఐదు మండలాల ప్రజలకు కూడా తాగునీరు అందించే పథకానికి ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) ఆ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. రూ.265 కోట్లతో చేపట్టే ఉద్దానం ఫేజ్–2 పనుల టెండరు డాక్యుమెంట్ ప్రస్తుతం జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలనలో ఉంది. మే 4 వరకు అభ్యంతరాల స్వీకరణ అనంతరం జ్యుడీషియల్ ప్రివ్యూ తుది ఆమోదం అనంతరమే టెండర్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆర్డబ్యూఎస్ అధికారులు ‘సాక్షి’కి వివరించారు. ‘హిరమండలం’ నుంచి నీటి తరలింపు.. ఉద్దానం మొదటి దశ, రెండో దశ మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఉద్దానానికి అతి సమీపంలో ఉండే బహుదా, మహేంద్రతనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశమున్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతుండడంవల్ల అక్కడ ప్రజలు తిరిగి బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి ఉంటుందేమోనని ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో కొంత అదనపు ఖర్చయినా ఏడాది పొడవునా నీరు అందించే అంశంపై దృష్టిపెట్టింది. దీంతో ఉద్దానానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేసి, అక్కడి ప్రజలకు ఏడాది పొడువునా తాగునీరు అందించాలని సంకల్పించింది. ఇప్పుడు రెండో దశ ప్రాజెక్టులో కొన్ని ప్రాంతాలకు కూడా నేరుగా రిజర్వాయర్ నుంచే తాగునీటి సరఫరాకు ఏర్పాట్లుచేశారు. హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని, అందులో 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం ఫేజ్–1 ద్వారా ఆ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కొత్తగా రూ.265 కోట్లతో చేపట్టే ఉద్దానం రెండో దశ ప్రాజెక్టుకు 0.291 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నారు. వచ్చే 30ఏళ్లలో పెరిగే జనాభాకు తగ్గట్లుగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. -
నేడే అర్బన్ 2.0, అమృత్ 2.0
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నగరాలను చెత్త రహితమైన నగరాలుగా, సురక్షితమైన తాగునీరు లభించే నగరాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్– అర్బన్ 2.0, అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్(అమృత్) 2.0కు రూపకల్పన చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టనున్నారు. దేశంలో పట్టణీకరణ విసురుతున్న సవాళ్లను ప్రభావ వంతమైన రీతిలో ఎదుర్కోవడంతోపాటు 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఈ రెండు కార్యక్రమాలు దోహదపడతాయని కేంద్రం భావిస్తోంది. అర్బన్ 2.0.. అన్ని నగరాలను ‘చెత్త రహితం’గా మార్చడమే అర్బన్ 2.0 లక్ష్యం. ఇందులో భాగంగా ఆయా నగరాల్లో మురుగు నీటి నిర్వహణకు చర్యలు చేపడతారు. బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా తీర్చిదిద్దుతారు. స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0కు దాదాపు రూ.1.41 లక్షల కోట్లు నిధులు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. అమృత్ 2.0.. దాదాపు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లను ఇవ్వడం ద్వారా 4,700 పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని కుటుంబాలకు 100 శాతం మంచినీరు అందించేందుకు అమృత్ 2.0ను రూపొందించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో 10.5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఉపరితల, భూగర్భ జలాల పరిరక్షణ, పునరుజ్జీవనాన్ని అమృత్ 2.0 ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమ వ్యయం రూ.2.87 లక్షల కోట్లు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
సురక్షిత తాగునీటి సరఫరాలో ఏపీ భేష్
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలు, అంగన్వాడీలు, గిరిజన వసతి పాఠశాలల్లోని చిన్నారులకు సురక్షిత తాగునీరు సరఫరాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నూటికి నూరు శాతం ప్రగతి కనబరచడంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సంతృప్తి వ్యక్తంచేసింది. ‘చిన్నారులకు సురక్షిత తాగునీరు’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 2, 2020న చేపట్టిన కార్యక్రమంపై సంఘం తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 42,655 అంగన్వాడీ కేంద్రాలు, 41,619 పాఠశాలలకు నూటికి నూరు శాతం పంపు కనెక్షన్లు ఇచ్చినట్లు స్థాయీ సంఘం గుర్తించింది. తెలంగాణ కూడా 27,310 అంగన్వాడీలు, 22,882 పాఠశాలల్లో నూరు శాతం లక్ష్యాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే ఈ రెండు విభాగాల్లో నూరు శాతం లక్ష్యాన్ని సాధించాయి. వ్యర్థాల నిర్వహణలోనూ ఏపీకి గుర్తింపు మరోవైపు.. గ్రామ పంచాయతీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు తగిన మౌలిక వసతులను సమకూర్చుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు చక్కటి పనితీరు కనబరిచాయని స్థాయీ సంఘం గుర్తించింది. అయితే, ఏపీలో 2018–19, 2019–20లో స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) పథకం ద్వారా కేంద్రం నుంచి వచి్చన నిధుల్లో వరుసగా రూ.987.39 కోట్లు, రూ.1,034 కోట్లు ఖర్చుకాలేదని.. అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని, దీనిపై జల్‌జీవన్ మిషన్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని స్థాయీ సంఘం పేర్కొంది. రాష్ట్రాలతో సమన్వయం చేస్తూ త్వరితగతిన నిధులు పూర్తిగా వినియోగమయ్యేలా చూడాలని సూచించింది. తెలంగాణ, గోవాలకు ప్రశంసలు జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ నీటి కుళాయిలు ఏర్పాటుచేయడంలో తెలంగాణ, గోవా నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించడంపై కూడా స్థాయీ సంఘం ప్రశంసించింది. అయితే, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణంలో తెలంగాణ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ వెనకబడ్డాయని వ్యాఖ్యానించింది. చదవండి: సంక్షేమ ప్రభుత్వాన్ని దీవించండి ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు -
డిండి..కదలదండి!
వంగిపోయిన నడుము.. వంకర కాళ్లు.. ఎటూ కదల్లేని దైన్యం.. వైద్యం చేయించుకోలని దుర్భర జీవితం.. ఎన్నాళ్లు బతుకుతామో కూడా తెలియని కష్టం.. ఇదీ పూర్వ నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితుల దుర్భర పరిస్థితి. ఈ దుస్థితికి శాశ్వత పరిష్కారం చూపేలా కృష్ణా జలాలను తరలించేందుకు ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వాటికి శంకుస్థాపనలు కూడా చేసింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టులు ఇంకా ప్రాథమిక దశలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. అవి ఎప్పటికి పూర్తవుతాయోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ అలైన్మెంట్ కూడా తేలలేదు పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల పరిధిలో ఫ్లోరైడ్ బాధిత మండలాలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకానికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ రెండున్నరేళ్లయినా ప్రాథమిక దశ కూడా దాటలేదు. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతింటుందని మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరాలు లేవనెత్తారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రాజెక్టుపై సర్వే చేస్తున్న వ్యాప్కోస్ నిర్ణీ త గడువులో నివేదిక ఇవ్వకపోవడంతో అలైన్మెంట్ కూడా తేలలేదు. అయితే డిండికి దిగువన చేపట్టిన పనులు మాత్రం ఇప్పటికే మొదలై కొనసాగుతున్నాయి. మార్పులు, చేర్పులు.. వీడని చిక్కులు వాస్తవానికి డిండి ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అంశమై అనేక మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. శ్రీశైలం వరద నీటిపై ఆధారపడుతూ చేపట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీటిని డిండికి తరలించేలా ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. నక్కలగండి వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 11 టీఎంసీలను మిడ్ డిండికి, డిండికి తరలించేలా డిజైన్ చేశారు. కానీ అధిక ఖర్చు దృష్ట్యా శ్రీశైలం నుంచే నేరుగా తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం శ్రీశైలం నుంచి ఓపెన్ చానల్, టన్నెళ్ల ద్వారా నీటిని ఎత్తిపోసి డిండికి తరలించేలా డిజైన్ చేశారు. ఇదే సమయంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా శ్రీశైలం నుంచే నీటిని తీసుకోవాలని నిర్ణయించడంతో.. డిండికి పాలమూరు పథకంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలని యోచిస్తున్నారు. తర్వాత హైదరాబాద్ తాగునీటి అవసరాలు, రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు 30 టీఎంసీలు అవసరమని లెక్కించి.. మొత్తంగా 60 టీఎంసీలను డిండి ద్వారానే తరలించేందుకు కొత్త ప్రణాళిక తెరపైకి తెచ్చారు. తర్వాత ఏదుల కన్నా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుంటే నయమంటూ మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒడిదొడుకుల ఎస్ఎల్బీసీ ఇక శ్రీశైలం నుంచి 30 టీఎంసీలను తీసుకునేలా చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2004లో రూ.1,925 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా.. భూసేకరణ సమస్యలు, వరదలతో పనులు జాప్యమయ్యాయి. ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. అందులో శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాల్సిన 43.89 కిలోమీటర్ల టన్నెల్లో.. ఇప్పటివరకు 30.46 కిలోమీటర్లు పూర్తయింది. మరో 13.46 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. దీనికి మరో మూడేళ్లు పట్టే అవకాశముందని అంచనా. ఈ దృష్ట్యా నక్కలగండి రిజర్వాయర్‌ను త్వరగా పూర్తిచేస్తే అప్పర్ డిండి నుంచి వచ్చే మిగులు జలాలను నిల్వ చేసుకునే అవకాశముందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ తెలిపారు. -
సురక్షిత నీటి ఖరీదు ఎంతో తెలుసా..?
న్యూఢిల్లీః మానవాళి అంతటికి సురక్షిత నీరు అందించాలంటే ప్రపంచ దేశాలన్నీ ఏటా రూ 95 లక్షల కోట్లకు పైగా వెచ్చించాలని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. చిన్నారులను వ్యాధుల బారి నుంచి కాపాడి, అకాల మరణాలను నిరోధించాలంటే ఈ స్థాయిలో ఖర్చు పెట్టాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ముఖ్యంగా పేదలు సరైన నీరు, పారిశుద్ధ్య వసతులకు దూరంగా ఉన్నారని, ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తక్షణం పూనుకోవాలని వరల్డ్ బ్యాంక్‌కు చెందిన గ్లోబల్ వాటర్ ప్రాక్టీస్ సీనియర్ డైరెక్టర్ గాంజె చెన్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన నీటి సరఫరా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో 2030 నాటికి అందరికీ సురక్షిత నీరు, పారిశుద్ధ్య వసతులు కల్పించాలనే ఐక్యరాజ్యసమితి లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉందని వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది. అరక్షిత నీటితో డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని పిల్లల ఎదుగుదలపై ఇది పెనుప్రభావం చూపుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.వ్యాధులను, పోషకాహార లేమిని అధిగమించేందుకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలతో నీరు, పారిశుద్ధ్య మెరుగుదలను అనుసంధానించాలని వరల్డ్ బ్యాంక్ నివేదిక సూచించింది. -
మూడేళ్లలో ఇంటింటికీ నీళ్లు
శాసనసభలో మంత్రి కె.తారకరామారావు వెల్లడి మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్ల వరకు ఖర్చు ఇప్పటికే నాబార్డు, హడ్కోల నుంచి రూ. 20 వేల కోట్ల రుణం అవసరమైతే జైకా లాంటి అంతర్జాతీయ సంస్థల తలుపుతడతాం హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా ఇంటింటికీ రక్షిత తాగునీటిని అం దించే మిషన్ భగీరథ ప్రాజెక్టును 2018-19 చివరి నాటికి 99 శాతం గ్రామాలకు చేరుస్తామని ప్రభుత్వం శాసనసభలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో 24,224 గ్రామాలకు నీరందించే లక్ష్యంతో అనుకున్న సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి 6,100 గ్రామాలు, 2017-18 చివరికల్లా 15,872 గ్రామాలు, 2018-19 నాటికి 22వేల పైచిలుకు గ్రామాల్లో ఇంటింటికీ రక్షిత తాగునీటిని అందిస్తామని, మిగతా గ్రామాలకూ అప్పటికల్లా నీటిని అందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేసింది. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మిషన్ భగీరథపై సభ్యులు పుట్ట మధు, గాదరి కిశోర్ కుమార్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అజ్మీరా రేఖ, సున్నం రాజయ్య, డాక్టర్ కె.లక్ష్మణ్‌లు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ మేరకు బదులిచ్చారు. మొదటి దశ పనులు పురోగతిలో ఉన్నాయని, రెండో దశ పనులను కూడా ప్రారంభించామన్నారు. జలమండలి ఆధ్వర్యంలో గోదావరి పైపులైను ద్వారా నికరమైన నీటి సరఫరాపై ఆధారపడి రూపొందించిన నాలుగు ప్యాకేజీలలో పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. మొదటి దశలో మేడ్చల్, కుత్బుల్లాపూర్‌లోని కొంత భాగం, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, భువనగిరి, ఆలేరు, నకిరేకల్‌లోని కొంత భాగం, తుంగతుర్తిలోని కొంత భాగం, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తిల్లోని కొన్ని భాగాలకు నీటి కనెక్షన్లను సమకూర్చాలని ప్రతిపాదించినట్లు మంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ భాగస్వామ్యం ఉందని, వారి నియోజకవర్గాల్లో ప్రాజెక్టు తీరును వివరించే బుక్లెట్లను ఈ సమావేశాల్లోనే అందజేస్తామని కేటీఆర్ చెప్పారు. స్థానికంగా సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులు సకాలంలో జరిగేలా చూడాలని సూచించారు. పథకాన్ని కేంద్రం మెచ్చుకున్నా.. నిధుల సమీకరణ, తదుపరి నిర్వహణ ఖర్చుల ప్రణాళికపై బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నలకు కేటీఆర్ విపులంగా జవాబిచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బీరేంద్రసింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రాజెక్టును సమీక్షించారని, పథకాన్ని పలువురు కేంద్ర మంత్రులు అభినందించటమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేస్తే బాగుంటుందన్నారని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలన్న తన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు ఎలాంటి సహకారం అందలేదన్నారు. ఈ పథకానికి రూ. 36,976.54 కోట్లు అవసరమని, అది రూ. 40 వేల కోట్లకు కూడా చేరుకునే అవకాశం ఉందని, ఇప్పటికే నాబార్డు, హడ్కోల నుంచి రూ. 20 వేల కోట్ల రుణం కోసం కమిట్మెంట్ వచ్చిందని కేటీఆర్ సభకు చెప్పారు. ఈ నిధులతో 70 శాతం పనులు పూర్తి చేస్తామన్నారు. ఎస్బీఐ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులతోనూ రుణ చర్చలు సాగుతున్నాయన్నారు. జైకా లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. పన్నులతోనే ప్రాజెక్టు నిర్వహణ మంచినీటి కోసం గ్రామ పంచాయతీలు పన్నులు చెల్లిస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ ఈ పన్నులను పక్కాగా వసూలు చేసి ఆ మొత్తంతోనే నీటి సరఫరా ఖర్చును భరిస్తామన్నారు. మెరుగైన సేవలందిస్తే పన్నులు పక్కాగా చెల్లించేందుకు ప్రజలు ముందుకొస్తారని, గుజరాత్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నీటి కమిటీలు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్న తరహాలో రాష్ట్రంలోనూ నీటి సంఘాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. పథకాన్ని నిర్వహించేందుకు గ్రామ పంచాయతీల్లో రూ. 875 కోట్లు, పట్టణాల్లో రూ. 900 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. -
తెలంగాణలో హనీవెల్ పరిశుభ్రమైన నీరు
-
దప్పిక తీర్చుకుంటే ముప్పేనా?
జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో కొరవడ్డ రక్షిత మంచినీరు విద్యార్థులకు అక్కరకు రాని ‘జలమణి’ పథకం నిర్వహణ లేక, విద్యుత్ బిల్లుల భారంతో ఆర్వో ప్లాంట్ల మూసివేత అమలాపురం టౌన్:జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందటం లేదు. పట్టణాలు, పంచాయతీల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలలకు మున్సిపాలిటీ లేదా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్‌లు, పంచాయతీల రక్షిత నీటి పథకాల ద్వారా తాగునీరందుతున్నా పాఠశాలల్లో నీటిని నిల్వ ఉంచే ట్యాంకులు అపరిశుభ్రంగా ఉంటున్నారుు. దీంతో తమ బిడ్డలు దప్పిక తీర్చుకుంటున్న జలంతోనా, జబ్బులకు కారణమయ్యే గరళంతోనా అన్న కలవరం కన్నవారిని వెన్నాడుతోంది. పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరందించాలనే లక్ష్యంతో రెండేళ్ల కిందట జిల్లా పరిషత్ జలమణి పథకాన్ని ప్రవేశపెట్టి, ఒక్కో మండలానికీ అయిదు నుంచి ఎనిమిది ఉన్నత పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకూ వెచ్చించి దాదాపు 350 ఉన్నత పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు సమకూర్చింది. ఇందు కోసం రూ. 2.50 కోట్ల వరకూ ఖర్చు చేశారు. అట్టహాసంగా ప్రారంభించినా.. జలమణి అమల్లోకి రాగానే ఒక్కో పాఠశాలలో ఒక్కో గదిని ఆర్వో ప్లాంటు కోసం కేటారుుంచి యంత్రాలను బిగించారు. 90 శాతం పాఠశాలల్లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్లాంట్లు మూడు నుంచి ఆరు నెలల వరకూ బాగానే పనిచేశాయి. నెలకు విద్యుత్ బిల్లు భారం రూ.1,500 నుంచి రూ.2,000 వరకూ పడుతుండటంతో కొన్ని పాఠశాలలు మధ్యలోనే ప్లాంట్ల నిర్వహణలో చేతులెత్తాశాయి. కొందరు ప్రధానోపాధ్యాయులు నిర్వహణ భారమైనా విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరివ్వాలన్న తపనతో ఏడాది పాటు అతికష్టంగా నిర్వహించారు. ఇంతలో పలు పాఠశాలలో ప్లాంట్లకు మరమ్మతులు అవసరం కావడం, ముఖ్యంగా విద్యుత్ మోటార్లు తరచూ మొరారుుంచడం వంటి కారణాలతో వాటి నిర్వహణను వదిలేశారు. ఇప్పుడు దాదాపు 55 పాఠశాలల్లో మాత్రమే ఆర్వో ప్లాంట్లు అతికష్టంగా పనిచేస్తుండగా మిగిలిన చోట్ల మోటార్లు పనిచేయక, విద్యుత్ బిల్లుల భారం భరించలేక మూలన పడ్డాయి. ఆ ప్లాంట్లున్న గదులకు తాళాలు వేశారు. అమలాపురం మండలంలో 9 ఉన్నత పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ఇప్పుడు రెండు పాఠశాలల్లో మాత్రమే అరకొరగా పనిచేస్తున్నాయి. అమలాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆర్వో ప్లాంటులోని మూడు విద్యుత్ మోటార్లను ఇటీవల దొంగలు ఎత్తుకెళ్లారు. ట్యాంకుల్లో శుభ్రత కరువు.. ఉన్నత పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేసినప్పుడు విద్యార్థులకు పూర్తి స్వచ్ఛతతో కూడిన తాగునీరందింది. అవి మూతపడ్డాక మున్సిపాలిటీ, పంచాయతీలు, ఆర్డబ్ల్యూఎస్ రక్షిత పథకాల ద్వారా సరఫరా అయ్యే తాగునీటినే పాఠశాలల్లోని ట్యాంకుల్లో నింపుతున్నారు. అయితే ట్యాంక్‌లను సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందటం లేదు. అమలాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో వాటర్ ట్యాంకు కింద బురద గుంట ఉంటే, పైన ట్యాంకు చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయూయి. పాఠశాలల్లో వాచ్మెన్ పోస్టులు కూడా లేకపోవటంతో పాఠశాలలు పనిచేయని వేళల్లో ట్యాంక్‌లకు రక్షణ లేకుండా పోతోంది. జిల్లాలో చాలా ఉన్నత పాఠశాలలకు సరైన ప్రహారీలు లేక బయట వ్యక్తులు కూడా యథేచ్ఛగా చొరబడ గల పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. జలమణి పథకం లక్ష్యం నెరవేరేలా చూడాలి. -
సోలార్‌తో తాగు నీరు
- విద్యుత్ లేని గిరిజన గ్రామాలు 220 - తొలి విడతగా 6 గూడేల్లో అమలు - మరో 85 గ్రామాల్లో ఏర్పాటుకు ప్రణాళిక మహారాణిపేట(విశాఖ) : జిల్లాలోని అన్ని గ్రామాలకు రక్షిత తాగు నీరు అందించాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ముఖ్యంగా గెడ్డనీరు, ఊట నీరుపై ఆధారపడుతున్న గిరిజన గ్రామాలకు రక్షిత తాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఏజెన్సీలో తాగునీటి కోసం గెడ్డలు, ఊట బావులపై ఆధారపడిన, విద్యుత్ లేని 220 గిరిజన గ్రామాలను అధికారులు గుర్తించారు. తొలి విడతగా ఇప్పటికే విద్యుత్ లేని ఆరు గ్రామాల్లో సోలార్ పద్ధతి ద్వారా తాగు నీరు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే మరో 85 గ్రామాల్లో ఈ పద్ధతి ద్వారా తాగు నీరందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంకులు, ట్యాంకులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎ. ప్రభాకర్‌రావు తెలిపారు. మిగిలిన గ్రామాలకు సెప్టెంబర్ లోగా సోలార్ పద్ధతిన తాగునీరందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచబ్యాంకు సాయంతో.. ఇదిలా ఉండగా ప్రపంచ బ్యాంకు, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో 9,464 కుటుంబాల్లో సమగ్ర రక్షిత మంచి నీరందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీలో 5 మండలాల(పెదబయలు, జి. మాడుగుల, ముంచంగిపుట్ట, అనంతగిరి, హుకుంపేట) పరిధిలోని 2,667 కుటుంబాలకు, మైదాన ప్రాంతంలో 2 మండలాలు (గొలుగొండ, పద్మనాభం) లోని 6,787 కుటుంబాలకు రక్షిత మంచి నీటి కోసం వాటర్ ట్యాంకులు నిర్మించారు. ప్రజలిచ్చిన విరాళాలతో కొన్ని గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు అమరుస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచ బ్యాంక్ రూ. 2019.80 లక్షలు ఆర్థిక సాయం చేయగా.. కుటుంబానికి రూ.250 చొప్పున రూ. 23,72,250 ప్రజలు విరాళాలుగా ఇవ్వాల్సి ఉండగా రూ. 9,13,250 వసూలయ్యాయి. సత్యసాయి ట్రస్ట్ ద్వారా కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో రక్షిత నీరందిస్తున్నారు. ఇంకా నీరందాల్సిన గ్రామాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం గానీ.. సంస్థలు గానీ.. చేపట్టే రక్షిత నీటి పథకాలు మూన్నాళ్ల ముచ్చట కాకుండా శాశ్వతంగా నీరందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. -
ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీలో అవినీతి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రామీణులకు రక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం(ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామీణులకు తాగునీటిని అందించడం ఎలా ఉన్నా.. ఈ పథకం కింద చేయాల్సిన పనులు చేయకుండానే.. బిల్లులు స్వాహా చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పథకం కింద మంజూరైన పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తూ.. ఇష్టం వచ్చినప్పుడు టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తూ భారీగానే దోపిడీ సాగిస్తున్నారు. అధికారులు టెండర్ల ముగుసులో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీలో నిధులు మంజూరైనా పనులు చేయడం లేదు. ఇతర పథకాల నిధులతో పనులు పూర్తయిన తర్వాత.. అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులతో పనులు చేసినట్లు రికార్డులుృసష్టిస్తున్నారు. చేయని పనులకు తప్పుడు రికార్డులు తయూరు చేసి రూ.లక్షలు దండుకుంటున్నారు. గ్రామాల్లో తాగు నీటికి తండ్లాట తప్పడం లేదు. ఒక పథకం కింద పనులు.. మరో పథకం కింద నిధులు.. జిల్లా వ్యాప్తంగా ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కింద దాదాపు రూ.80 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ఎన్ని పనులు.. ఎక్కడెక్కడ చేశారనే సమాచారం ఈ విభాగం అధికారుల వద్ద లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా ఇతర పథకంలో చేపట్టిన పనులు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకంలో చేసినట్లు రికార్డులు సృష్టించి విషయం ఆలస్యంగా వెలుగు చూసిం ది. ఎస్టీ ఉప ప్రణాళిక(టీఎస్పీ) పరిధిలోని 13 మండలాల్లో జరుగుతున్న అక్రమాలకు అంతూ అదుపు లేకుండా పోతోంది. ఇటీవల ఐటీడీఏలో చేపట్టిన పనికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సుమారు రూ.5 లక్షలకు పైగా బిల్లుల రూపం లో చెల్లించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... ఏటూరునాగారం మం డలం షాపల్లిలో 2010లో ఐటీడీఏలోని ఇంజినీరింగ్ విభాగం ఏఆర్‌డబ్ల్యూఎస్ పథకంలో రూ. 2 లక్షల వ్యయంతో స్టాస్టిక్ ట్యాంకును నిర్మిం చింది. గ్రామంలో పైపులైను నిర్మించాలని వినతులు మేరకు ఐటీడీఏ అధికారులు 2010-11 లో ఎస్సీఏ గ్రాంటులో పైపులైన్ నిర్మాణానికి రూ.3 లక్షలు కేటాయించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సుమారు 1200 మీటర్ల పైపులైన్‌ను గ్రామంలో నిర్మించి 32 నల్లాలను ఏర్పా టు చేశాడు. ఎస్సీఏ గ్రాంటుల్లో కేటాయింపుల కంటే ఎక్కువ పనులు చేపట్టడంతో ఈ పనికి బి ల్లులు చెల్లించేందుకు నిధులు లేకుండా పోయా యి. చేసిన పనికి బిల్లులు రాకపోవడంతో సద రు కాంట్రాక్టర్ పైపులైన్‌ను కట్ చేసినట్లు తెలి సింది. ఈ పైపులైన్‌ను ఇతర పథకంలో చేపట్టినట్లు రికార్డులు సమర్పించి రూ.లక్షల బిల్లుల ను అధికారులు చెల్లించారని.. ఈ పని పూర్తి చే సిన కాంట్రాక్టర్ ఆరోపణలు చేస్తుండడం ఆశ్చర్యంగా ఉంటోంది. ఒకే పనికి.. రెండు బిల్లులు! షాపెల్లిలోని కొత్తూరులో 20 వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్, పైపులైన్లు, నల్లాల నిర్మాణం కోసం ఎస్వీఎస్ పథకంలో భాగంగా 2011-12లో రూ.12 లక్షలు మంజూరయ్యాయి. ఈ ప నులకు 2013 ఆగస్టులో టెండర్ నిర్వహించా రు. 4.90 శాతం ఎక్కువ(ఎక్సెస్)తో కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. ఈ పనుల్లో భా గంగా ఓవర్ హెడ్ ట్యాంకును షాపల్లి కొత్తూరులో నిర్మించాల్సి ఉంది. కాంట్రాక్టర్ ముందుచూపుతో షాపల్లి పాత గ్రామంలోనే నిర్మించా డు. ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నిర్మించి ఐటీడీఏ నిధులతో గతంలోనే నిర్మించిన పాత పైపులైన్లకు కనెక్షన్ ఇచ్చి నల్లాలను ప్రారంభించినట్లు తెలిసింది. ఈ పనులను అధికారులకు చూపెట్టి రూ.12 లక్షల వరకు బిల్లులు పొందినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో 20 వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్‌తోపాటు పైపులైను నిర్మిం చాల్సి ఉన్నా ఇదేమీ చేయకుండానే బిల్లులు డ్రా అయినట్లు అధికారులు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌కు నిధులు కేటాయించిన విధంగానే.. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ విభాగంలో చేపట్టే తాగు నీటి పనులకు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ ఉప ప్రణాళిక(టీఎస్పీ), మైదాన ప్రాంతాల అభిృద్ధి సంస్థ(మాడా), డిజర్ట్ ట్రైబల్ గ్రూప్(డీటీజీ) వర్తించే గిరిజన గూడేలు, తండాల్లో ఈపనులు చేపడుతున్నారు. ఒకే పనిని ఒకే గ్రామంలో చేపడుతుండడంతో బిల్లులు రెండు శాఖల్లో చెల్లింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
‘బడ్జెట్ ఎంతో నచ్చింది’
రాయచూరు : రక్షిత మంచినీరు, అందరికి గూడు, మరుగుదొడ్ల నిర్మాణం, రైతులకు రుణాల పంపిణీ, బాలల సంరక్షణకు పలు పథకాలు, పేదలకు మేలు చేస్తున్న సబ్సిడీలను ఆపే ప్రసక్తే లేదంటూ శనివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ 2015-16 గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై జిల్లా ప్రజలు మిశ్రమ ప్రతిస్పందన తెలిపారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు మట్లాడుతూ సురక్షత మంచినీరు, రైతులకు రుణాలు, నిరాశ్రయులకు ఇళ్లు, సబ్సిడీలపై కోత విధించనన్న హామీ తదితర అంశాలు జిల్లా ప్రజలకు ఎంతో నచ్చాయన్నారు. చిన్ననీటిపారుదల, కుటీర పరిశ్రమలు ముఖ్యంగా రైతులకు రూ.8.5 లక్ష కోట్ల రుణాల మంజూరు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రూ.5.4 లక్ష కోట్లు, స్వచ్చ భారత్ పథకం ద్వారా ఆరు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం తదితరాల ప్రయోజనాన్ని పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
ఈ దాహం తీరనిది!
రక్షిత మంచినీటి పథకాలకు గ్రహణం తుప్పు పట్టిన పంప్సెట్లు ఊసేలేని ఆపరేటర్ల నియామకం పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు గుదిబండగా మారిన సర్‌చార్జి గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లు కర్నూలు(జిల్లా పరిషత్): గ్రామీణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాల తీరు అధ్వానంగా మారింది. 12 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పంప్సెట్లు చాలాచోట్ల తుప్పుపట్టిపోయాయి. 70 శాతం ప్యానెల్ బోర్డులు, పంప్సెట్లు మార్చాల్సి ఉండగా.. ఆ ఊసే కరువైంది. పంప్‌హౌస్ వద్ద ఆపరేటర్ల కొరత తీవ్రంగా ఉన్నా అధికారులు చొరవ చూపని పరిస్థితి. నాలుగైదు పంప్సెట్లకు ఒక ఆపరేటర్ ఉండటం.. విద్యుత్ కోత కారణంగా పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కొందరు ఆపరేటర్లు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై ప్రయాణిస్తూ పంప్సెట్లను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఇటీవల ప్రభుత్వం సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఆర్గనైజేషన్ నిబంధనల మేరకు ప్రతి పంప్‌హౌస్ వద్ద ఒక ఆపరేటర్, వాచ్‌మన్, ఎలక్ట్రీషియన్‌ను నియమించాలని ఆదేశించినా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. జిల్లాలోని 52 సీపీడబ్ల్యు స్కీంల నిర్వహణకు విద్యుత్ బిల్లుల చెల్లింపు ఆర్‌డబ్ల్యుఎస్ శాఖకు గుదిబండగా మారుతోంది. గత ఏడాది ప్రారంభంలో యూనిట్‌కు 1.20 పైసల నుంచి ఏకంగా 5.90 పైసలకు టారిఫ్ పెంచడంతో బిల్లుల వ్యయం అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటిపై విద్యుత్ అధికారులు చక్ర వడ్డీలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ భారానికి సర్‌చార్జీ అదనంగా తోడవుతోంది. మొత్తం మూడు డివిజన్లలో దాదాపు రూ.3కోట్ల విద్యుత్ బకాయిలు ఉండటం.. విద్యుత్ అధికారులు సరఫరా నిలిపేసేందుకు సిద్ధమవుతుండటంతో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం కనిపిస్తోంది. నత్తనడకన జాతీయ గ్రామీణ తాగునీటి పథకాలు జాతీయ గ్రామీణ తాగునీటి పథకం(ఎన్‌ఆర్‌డీడబ్ల్యుపీ) సింగిల్ విలేజ్ స్కీం(ఎస్వీఎస్) కింద 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.43.3 కోట్ల విలువతో.. గత సంవత్సరం మంజూరై మిగిలిపోయిన 213 పనులను చేపట్టారు. ఈ గ్రాంట్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3.28 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 213 పనుల్లో 23 పూర్తి కాగా.. 76 పనులు నిర్మాణ దశలో, 24 పనులు టెండర్ దశలో, 21 పనులు అగ్రిమెంట్ దశలో, మిగిలిన 69 పనులు ప్రారంభ దశలోనే ఉండిపోయాయి. అదేవిధంగా మల్టీ విలేజ్ స్కీం(ఎంవీఎస్) కింద 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.243 కోట్ల విలువతో గత సంవత్సరం మంజూరై మిగిలిపోయిన 55 పనులతో పాటు ఆరు కొత్త పనులు చేపట్టారు. ఈ గ్రాంట్ కింద ఆర్థిక సంవత్సరంలో రూ.37.3 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 55 పనుల్లో 24 పూర్తి కాగా, 13 పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. రెండు పనులు టెండర్ దశలో, 3 పనులు అగ్రిమెంట్ దశలో, మిగిలిన 13 పనులు ప్రారంభానికే నోచుకోని పరిస్థితి. 13వ ఆర్థిక ప్రణాళిక సంఘం నిధుల ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.98.6. కోట్ల విలువతో గత సంవత్సరం మంజూరై మిగిలిన 53 పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 53 పనుల్లో 5 పూర్తి చేశారు. 29 పనులు నిర్మాణ దశలో, 6 పనులు టెండర్ దశలో, 19 పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఈ నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రజలు దాహంతో అలమటించాల్సి వస్తోంది. కోడుమూరు మండలం సి.బెళగల్ గ్రామంలోని ఎస్సీ కాలనీవాసుల దాహార్తిని తీర్చేందుకు గత యేడాది ఎస్ఆర్డీడబ్ల్యుపీ స్కీమ్ కింద స్థానిక చర్చి సమీపంలో 60వేల లీటర్ల సామర్థ్యంతో రూ.24.38లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించారు. ట్యాంకు నుంచి నీటి సరఫరాకు పైపులు అమర్చకపోవడంతో ఈ పథకం వృథాగా మారింది. గనేకల్ వాటర్ స్కీమ్ నుంచి ఆదోని మండలంలోని ఉవ్వనూరు, సాంబగళ్లు, నెట్టెకల్లు, చిన్న పెండేకల్లు గ్రామాలకు సక్రమంగా నీరందటం లేదు. పైపులైన్లు పగిలినా కాంట్రాక్టర్లు పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. -
బాలారిష్టాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి
పథకంపై స్పష్టత కరవు సొమ్మొకరిది... సోకు ప్రభుత్వానిది ముందుకు రాని దాతలు అయోమయంలో అధికారులు ‘అన్న క్యాంటీన్ల’ దారిలోనే.... గుడివాడ రూరల్ : ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. అందరికీ రక్షిత తాగునీటిని అందిస్తామని ప్రగల్భాలు పలుకుతూ పాలకులు ప్రారంభించాలనుకున్న ఈ పథకానికీ బాలారిష్టాలు తప్పడం లేదు. ల్యాబ్, నిర్వహణ ఖర్చు, లీజు తదితర అంశాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో దాతలు ముందుకు రావడం లేదు. సమయం సమీపిస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ‘అన్న క్యాంటీన్ల’ వలే ఈ పథకమూ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పథకంపై స్పష్టత లేదు.. అక్టోబరు 2 కల్లా జిల్లాలో 513 గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అయితే ఆర్వోప్లాంటు ఏర్పాటుకు రూ 2 లక్షల నుంచి 4 లక్షలు, యువీ ప్లాంటుకు లక్షన్నర నుంచి రెండు లక్షలు వరకు ఖర్చవుతుంది. ఈడీఎఫ్, టారీఫ్ ప్లాంట్లు మన జిల్లాలో అవసరం లేదు. అవి ప్లోరెడ్, ఐరన్ ధాతువులు లోపించిన ప్రాంతాలకు అవసరం. ఈ పథకం కింద ఏర్పాటు చేసే ప్లాంటు నిర్వాహణ, ఖర్చు తదితర విషయాలపై సరైన స్పష్టత లేదు. దాతలు మిషనరీ, నిర్వహణ భారం భరిస్తే, ఉచితంగా మంచినీటి కనెక్షన్, భవనం, 50 శాతం కరెంటు బిల్లు ప్రభుత్వమే భరిస్తుంది. కానీ 20 లీటర్లు రూ.2కి ఇవ్వడం వలన నిర్వాహకులపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. దీనికిగానూ ప్రభుత్వం ఎటువంటి రాయితీలు ప్రకటించలేదు. ఇప్పటికే పంచాయతీల్లో కరెంటు బాకాయిలు రూ.లక్షల్లో పేరుకు పోయాయి. విద్యుత్ అధికారులు బాకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కట్ చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. ఆ తరుణంలో ప్లాంటు నిర్వహణకు అయ్యే విద్యుత్ బిల్లులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదు. ప్రైవేటు సంస్థలకు అప్పగించే యోచన? కొన్ని గ్రామాల్లో ప్లాంటు ఏర్పాటుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే ప్రైవేటు సంస్థలకు ప్లాంట్లు అప్పగించే అలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇదే గానీ జరిగితే అన్ని ప్లాంట్లు ప్రైవేటు గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోతాయి. ఇలా ఏర్పాటు చేసిన కొన్ని ప్లాంట్లు సరైన నిర్వహణ లేక ఇప్పటికే మూతపడ్డాయి. గుడివాడ మండలంలోని కల్వాపూడి ఆగ్రహారం, రామనపూడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్లాంట్లు ఆ కోవకు చెందినవే. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలోని లోటుపాట్లను సవరించి, సరైన మార్గదర్శకాలు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. -
నల్లనీళ్లు తాగేదెట్లా?
*నగర పంచాయతీ పరిధిలో మురికి నీరు సరఫరా *కాలుష్యపు కోరల్లో చలివాగు.. కానరాని శుద్ధి చర్యలు *నిరుపయోగంగా ఫిల్టర్బెడ్లు.. లక్షల రూపాయలు వృథా *చలివాగు నుంచి నేరుగా నల్లాలకు పంపింగ్ *రోగాల బారిన పడుతున్న జనం *ఐదేళ్లుగా కొనసా..గుతున్న డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ నిర్మాణం పరకాల : ఈ ఫొటోలో కనిపిస్తున్న నీటినే పరకాల ప్రజలు తాగుతున్నారు. అధికారులు ఈ రంగు మారిన నీళ్లనే పంపింగ్ చేస్తున్నారు. ప్రజలు గత్యంతరం లేక ఆ నీటినే తాగుతున్నారు. దీంతో రోగాల బారిన పడి ఆస్పత్రుల చుట్టు తిరుగు తున్నారు. పరకాల... మేజర్ గ్రామపంచాయతీ నుంచి నగర పంచాయతీగా మూడేళ్ల క్రితం అప్‌గ్రేడ్ అరుుంది. కానీ... ప్ర‘జల’ రాత మారలేదు. ఇందుకు నల్లాల ద్వారా సరఫరా అవుతున్న రంగు మారిన నీళ్లే నిదర్శనం. అంతేకాదు... వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో కలుషిత నీటి బాధలు ఇక్కడి ప్రజలకు షరామామూలుగా మారారుు. పాలకుల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి.. దశాబ్దాలుగా వారికి తాగునీటి తిప్పలు తప్పడం లేదు. వ్యాపార, వాణిజ్యపరంగా దూసుకుపోతున్న పట్టణంలో స్వచ్ఛమైన తాగు నీరు లభించని దుస్థితి నెలకొంది. నిరుపయోగంగా ఫిల్టర్బెడ్లు పరకాల పట్టణంలో సుమారు 40 వేల జనాభా ఉంది. ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు, కేటీపీపీ కార్మికులుతోపాటు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడే ఉంటున్నారు. ఏటేటా పట్టణ జనాభా పెరుగుతూ వస్తోంది. అరుునా... సరైన నీటి వసతులు కల్పించడంలో అటు ప్రజాప్రతినిధులు.. ఇటు అధికారులు విఫలమయ్యూరు. పట్టణ ప్రజలకు చలివాగు చెక్‌డ్యాం నుంచి తాగు నీరు అందుతోంది. పట్టణ శివారు నుంచి మూడు కిలోమీటర్ల మేర పైపులైన్ వేసి వాగులోని నీటిని నేరుగా పంపింగ్ చేస్తున్నారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు రెండు ఫిల్టర్బెడ్లు నిర్మించినా... అవి నిరుపయోగంగానే ఉన్నారుు. 1999లో రూ.33 లక్షలతో ఒక ఫిల్టర్‌బెడ్ నిర్మాణం చేపట్టారు. 2004లో మరో ఫిల్టర్‌బెడ్‌ను నిర్మించారు. అవి అందుబాటులోకి రాకపోవడంతో నీటి శుద్ధి కార్యక్రమం అమలుకునోచుకోలేదు. 2009లో చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టినా... అర్ధంతరంగా ఆపివేశారు. ఇలా లక్షల రూపాయలు వెచ్చించినా... ప్రజలకు మంచి నీళ్లు అందని ద్రాక్షగా మారారుు. కాలుష్యం బారిన చలివాగు పట్టణ ప్రజలకు తాగునీరు అందించే చలివాగు చెక్‌డ్యాం వ్యర్థ పదార్థాలతో నిండుతోంది. చలివాగు పరివాహక ప్రాంతం వెంట శాయంపేట మండల పరిధిలోని కొప్పుల, రేగొండ మండలం దామరంచపల్లి, చెన్నాపూర్ గ్రామాలు ఉన్నారుు. ఈ గ్రామాలకు చెందిన కొందరు గుడుంబా బట్టీలను పెట్టి అందులోంచి వచ్చే వ్యర్థపదార్థాలను వాగులోకి వదిలిపెడుతున్నారు. పరకాల పెద్ద చెరువు కింది భాగంలో కూడా గుడుంబా బట్టీలను ఏర్పాటు చేసి... వాటి పానకంను ఇందులోకి విడిచి పెడుతున్నారు. అంతేకాకుండా.. పశువుల కళేబరాలను వాగులో వేస్తున్నారు. దీంతో చలివాగు నీరు కలుషితమవుతోంది. ఊరిస్తున్న డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ పట్టణానికి మంచి నీరు అందించేందుకు 2009లో శాయంపేట మండలం జోగంపల్లిలోని చలివాగు వద్ద రూ.9 కోట్లతో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లు గడిచినా... ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాలేదు. పట్టణంతోపాటు పరకాల, శాయంపేట, మొగుళ్లపల్లి మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ నీళ్లు ప్రజలను కొన్నేళ్లుగా ఊరిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు పైపులైన్ నిర్మాణం పూర్తి కాలేదు. పట్టణంలోని మసీదు వద్ద బండరాయి అడ్డు రావడం, కొన్ని దుకాణాలు పోయే అవకాశముండడంతో ఈ పనులు పెండింగ్‌లో పడ్డాయి