బాలారిష్టాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి
- పథకంపై స్పష్టత కరవు
- సొమ్మొకరిది... సోకు ప్రభుత్వానిది
- ముందుకు రాని దాతలు
- అయోమయంలో అధికారులు
- ‘అన్న క్యాంటీన్ల’ దారిలోనే....
గుడివాడ రూరల్ : ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. అందరికీ రక్షిత తాగునీటిని అందిస్తామని ప్రగల్భాలు పలుకుతూ పాలకులు ప్రారంభించాలనుకున్న ఈ పథకానికీ బాలారిష్టాలు తప్పడం లేదు. ల్యాబ్, నిర్వహణ ఖర్చు, లీజు తదితర అంశాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో దాతలు ముందుకు రావడం లేదు. సమయం సమీపిస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ‘అన్న క్యాంటీన్ల’ వలే ఈ పథకమూ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పథకంపై స్పష్టత లేదు..
అక్టోబరు 2 కల్లా జిల్లాలో 513 గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అయితే ఆర్వోప్లాంటు ఏర్పాటుకు రూ 2 లక్షల నుంచి 4 లక్షలు, యువీ ప్లాంటుకు లక్షన్నర నుంచి రెండు లక్షలు వరకు ఖర్చవుతుంది. ఈడీఎఫ్, టారీఫ్ ప్లాంట్లు మన జిల్లాలో అవసరం లేదు. అవి ప్లోరెడ్, ఐరన్ ధాతువులు లోపించిన ప్రాంతాలకు అవసరం. ఈ పథకం కింద ఏర్పాటు చేసే ప్లాంటు నిర్వాహణ, ఖర్చు తదితర విషయాలపై సరైన స్పష్టత లేదు. దాతలు మిషనరీ, నిర్వహణ భారం భరిస్తే, ఉచితంగా మంచినీటి కనెక్షన్, భవనం, 50 శాతం కరెంటు బిల్లు ప్రభుత్వమే భరిస్తుంది. కానీ 20 లీటర్లు రూ.2కి ఇవ్వడం వలన నిర్వాహకులపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు.
దీనికిగానూ ప్రభుత్వం ఎటువంటి రాయితీలు ప్రకటించలేదు. ఇప్పటికే పంచాయతీల్లో కరెంటు బాకాయిలు రూ.లక్షల్లో పేరుకు పోయాయి. విద్యుత్ అధికారులు బాకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కట్ చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. ఆ తరుణంలో ప్లాంటు నిర్వహణకు అయ్యే విద్యుత్ బిల్లులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదు.
ప్రైవేటు సంస్థలకు అప్పగించే యోచన?
కొన్ని గ్రామాల్లో ప్లాంటు ఏర్పాటుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే ప్రైవేటు సంస్థలకు ప్లాంట్లు అప్పగించే అలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇదే గానీ జరిగితే అన్ని ప్లాంట్లు ప్రైవేటు గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోతాయి. ఇలా ఏర్పాటు చేసిన కొన్ని ప్లాంట్లు సరైన నిర్వహణ లేక ఇప్పటికే మూతపడ్డాయి. గుడివాడ మండలంలోని కల్వాపూడి ఆగ్రహారం, రామనపూడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్లాంట్లు ఆ కోవకు చెందినవే. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలోని లోటుపాట్లను సవరించి, సరైన మార్గదర్శకాలు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.