జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో కొరవడ్డ రక్షిత మంచినీరు
విద్యార్థులకు అక్కరకు రాని ‘జలమణి’ పథకం
నిర్వహణ లేక, విద్యుత్ బిల్లుల భారంతో ఆర్వో ప్లాంట్ల మూసివేత
అమలాపురం టౌన్:జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందటం లేదు. పట్టణాలు, పంచాయతీల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలలకు మున్సిపాలిటీ లేదా ఆర్‌డబ్ల్యూఎస్ స్కీమ్‌లు, పంచాయతీల రక్షిత నీటి పథకాల ద్వారా తాగునీరందుతున్నా పాఠశాలల్లో నీటిని నిల్వ ఉంచే ట్యాంకులు అపరిశుభ్రంగా ఉంటున్నారుు. దీంతో తమ బిడ్డలు దప్పిక తీర్చుకుంటున్న జలంతోనా, జబ్బులకు కారణమయ్యే గరళంతోనా అన్న కలవరం కన్నవారిని వెన్నాడుతోంది. పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరందించాలనే లక్ష్యంతో రెండేళ్ల కిందట జిల్లా పరిషత్ జలమణి పథకాన్ని ప్రవేశపెట్టి, ఒక్కో మండలానికీ అయిదు నుంచి ఎనిమిది ఉన్నత పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకూ వెచ్చించి దాదాపు 350 ఉన్నత పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు సమకూర్చింది. ఇందు కోసం రూ. 2.50 కోట్ల వరకూ ఖర్చు చేశారు.
అట్టహాసంగా ప్రారంభించినా..
జలమణి అమల్లోకి రాగానే ఒక్కో పాఠశాలలో ఒక్కో గదిని ఆర్వో ప్లాంటు కోసం కేటారుుంచి యంత్రాలను బిగించారు. 90 శాతం పాఠశాలల్లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్లాంట్లు మూడు నుంచి ఆరు నెలల వరకూ బాగానే పనిచేశాయి. నెలకు విద్యుత్ బిల్లు భారం రూ.1,500 నుంచి రూ.2,000 వరకూ పడుతుండటంతో కొన్ని పాఠశాలలు మధ్యలోనే ప్లాంట్ల నిర్వహణలో చేతులెత్తాశాయి. కొందరు ప్రధానోపాధ్యాయులు నిర్వహణ భారమైనా విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరివ్వాలన్న తపనతో ఏడాది పాటు అతికష్టంగా నిర్వహించారు. ఇంతలో పలు పాఠశాలలో ప్లాంట్లకు మరమ్మతులు అవసరం కావడం, ముఖ్యంగా విద్యుత్ మోటార్లు తరచూ మొరారుుంచడం వంటి కారణాలతో వాటి నిర్వహణను వదిలేశారు. ఇప్పుడు దాదాపు 55 పాఠశాలల్లో మాత్రమే ఆర్వో ప్లాంట్లు అతికష్టంగా పనిచేస్తుండగా మిగిలిన చోట్ల మోటార్లు పనిచేయక, విద్యుత్ బిల్లుల భారం భరించలేక మూలన పడ్డాయి. ఆ ప్లాంట్లున్న గదులకు తాళాలు వేశారు. అమలాపురం మండలంలో 9 ఉన్నత పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ఇప్పుడు రెండు పాఠశాలల్లో మాత్రమే అరకొరగా పనిచేస్తున్నాయి. అమలాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆర్వో ప్లాంటులోని మూడు విద్యుత్ మోటార్లను ఇటీవల దొంగలు ఎత్తుకెళ్లారు.
ట్యాంకుల్లో శుభ్రత కరువు..
ఉన్నత పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేసినప్పుడు విద్యార్థులకు పూర్తి స్వచ్ఛతతో కూడిన తాగునీరందింది. అవి మూతపడ్డాక మున్సిపాలిటీ, పంచాయతీలు, ఆర్‌డబ్ల్యూఎస్ రక్షిత పథకాల ద్వారా సరఫరా అయ్యే తాగునీటినే పాఠశాలల్లోని ట్యాంకుల్లో నింపుతున్నారు. అయితే ట్యాంక్‌లను సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందటం లేదు. అమలాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో వాటర్ ట్యాంకు కింద బురద గుంట ఉంటే, పైన ట్యాంకు చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయూయి. పాఠశాలల్లో వాచ్‌మెన్ పోస్టులు కూడా లేకపోవటంతో పాఠశాలలు పనిచేయని వేళల్లో ట్యాంక్‌లకు రక్షణ లేకుండా పోతోంది. జిల్లాలో చాలా ఉన్నత పాఠశాలలకు సరైన ప్రహారీలు లేక బయట వ్యక్తులు కూడా యథేచ్ఛగా చొరబడ గల పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. జలమణి పథకం లక్ష్యం నెరవేరేలా చూడాలి.
దప్పిక తీర్చుకుంటే ముప్పేనా?
Published Fri, Sep 11 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM
Advertisement
Advertisement