సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలు, అంగన్‌వాడీలు, గిరిజన వసతి పాఠశాలల్లోని చిన్నారులకు సురక్షిత తాగునీరు సరఫరాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నూటికి నూరు శాతం ప్రగతి కనబరచడంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సంతృప్తి వ్యక్తంచేసింది. ‘చిన్నారులకు సురక్షిత తాగునీరు’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 2, 2020న చేపట్టిన కార్యక్రమంపై సంఘం తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 42,655 అంగన్‌వాడీ కేంద్రాలు, 41,619 పాఠశాలలకు నూటికి నూరు శాతం పంపు కనెక్షన్లు ఇచ్చినట్లు స్థాయీ సంఘం గుర్తించింది. తెలంగాణ కూడా 27,310 అంగన్‌వాడీలు, 22,882 పాఠశాలల్లో నూరు శాతం లక్ష్యాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే ఈ రెండు విభాగాల్లో నూరు శాతం లక్ష్యాన్ని సాధించాయి.
వ్యర్థాల నిర్వహణలోనూ ఏపీకి గుర్తింపు
మరోవైపు.. గ్రామ పంచాయతీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు తగిన మౌలిక వసతులను సమకూర్చుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు చక్కటి పనితీరు కనబరిచాయని స్థాయీ సంఘం గుర్తించింది. అయితే, ఏపీలో 2018–19, 2019–20లో స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) పథకం ద్వారా కేంద్రం నుంచి వచి్చన నిధుల్లో వరుసగా రూ.987.39 కోట్లు, రూ.1,034 కోట్లు ఖర్చుకాలేదని.. అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని, దీనిపై జల్‌జీవన్ మిషన్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని స్థాయీ సంఘం పేర్కొంది. రాష్ట్రాలతో సమన్వయం చేస్తూ త్వరితగతిన నిధులు పూర్తిగా వినియోగమయ్యేలా చూడాలని సూచించింది.
తెలంగాణ, గోవాలకు ప్రశంసలు
జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ నీటి కుళాయిలు ఏర్పాటుచేయడంలో తెలంగాణ, గోవా నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించడంపై కూడా స్థాయీ సంఘం ప్రశంసించింది. అయితే, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణంలో తెలంగాణ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ వెనకబడ్డాయని వ్యాఖ్యానించింది.
చదవండి:
సంక్షేమ ప్రభుత్వాన్ని దీవించండి
ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment