సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో నూటికి నూరు శాతం సురక్షితమైన తాగునీటిని అందించే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. జలజీవన్ మిషన్ ద్వారా ఇది సాకారమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. జలజీవన్ మిషన్ అమలులో భారతదేశం పురోగతి సాధించిందని తెలిపింది. ఇంటింటికీ వంద శాతం సురక్షితమైన తాగునీరు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, గోవా, హరియాణా, గుజరాత్, పంజాబ్ ఉన్నాయి.
తెలంగాణలో 53.98 లక్షల ఇళ్లుంటే.. అందులో ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉందని నివేదిక వివరించింది. కాగా, ఈ రాష్ట్రాల కంటే నీటి స్వచ్ఛతలో మాత్రం తెలంగాణే నంబర్‌వన్ స్థానంలో ఉంది. మన రాష్ట్ర తాగునీటి స్వచ్ఛత 98.7 శాతంగా ఉంది. యూరప్‌లో కేవలం 62 శాతం ఇళ్లకే స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. కాగా, దేశంలో ఇప్పటివరకు సగటున 62.84 శాతం మందికి ఇంటింటికీ తాగునీటి వసతి ఉందని తెలిపింది.
దేశంలో డయేరియా మరణాలు 6 లక్షలు..
దేశంలో డయేరియా, ఇన్ఫెక్షన్లు, మలేరియా, డెంగీ, శ్వాసకోశ సంబంధిత రోగాల వల్ల ప్రతీ ఏడాది లక్షకు 40–70 మంది వరకు మరణిస్తున్నారని డబ్లు్యహెచ్‌వో వేదిక వివరించింది. ఈ మరణాల్లో ఐదేళ్లలోపువారే 60 శాతం ఉంటారని పేర్కొంది. తాగునీరు సరిగా లేకపోవడం, పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించకపోవడం, చేతి శుభ్రత పాటించకపోవడం వల్ల డయేరియా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. 2019 లెక్కల ప్రకారం డయేరియాతో దేశవ్యాప్తంగా 6.07 లక్షల మంది చనిపోతున్నారు.
అందులో తాగునీరు సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియా మరణాలు 2,03,863 ఉన్నాయి. ఇందులో మహిళలే 1,23,964 మంది ఉన్నారు. ఐదేళ్లలోపు వారు 20,045 మంది ఉన్నారు. ఇక పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియాతో 2,44,287 మంది చనిపోతున్నారు. అందులో మహిళలు 1.48 లక్షల మంది ఉన్నారు. ఐదేళ్లలోపు వారు 24,020 మంది ఉన్నారు.
ఇక చేతి శుభ్రత సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియా మరణాలు ఏడాదికి 1,59,015 ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వివరించింది. అందులో 96,694 మంది మహిళలుండగా, ఐదేళ్లలోపువారు 15,635 మంది ఉన్నారు. ఇదిలావుంటే 51,740 మంది చేతి శుభ్రత సరిగా లేకపోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్నారని ఆ వేదిక పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
► పరిశుభ్రమైన నీరు, పరిసరాలు శుభ్రంగా ఉంచకపోవడం, చేతి శుభ్రత పాటించకపోతే సాంక్రమిక వ్యాధులు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు, మలేరియా, డెంగీ వంటివి వస్తాయి. ఆసుపత్రుల్లోనూ ఇన్ఫెక్షన్లు వస్తాయి.
► తాగునీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే జబ్బులు వస్తాయి.
► డయేరియా కారణంగా పిల్లలు బడికి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల పనితీరులోనూ మార్పులు వస్తాయి. ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి పెరుగుతుంది.
► చేతి శుభ్రత లేకపోతే కరోనా వంటి వైరస్‌లు వస్తాయి. తాగునీరు సరిగా లేకపోవడం వల్ల రక్తహీనత కూడా సంభవిస్తుంది.
► ప్రపంచంలో 56 శాతం జనాభాకు మాత్రమే ఇంటి వద్ద సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంది. ఆఫ్రికాలో 9 శాతం, యూరప్‌లో 62 శాతం మాత్రమే సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంది. ఇది దక్షిణాసియా దేశాల్లో 27 శాతమే ఉంది.
► వాగులు వంకల్లో నీటిని తాగే వారితో పోలిస్తే శుద్ధి చేసిన ఇంటి వద్దే అందుబాటులో ఉన్న నీటిని తాగడం వల్ల 52 శాతం డయేరియా కేసుల సంఖ్య తగ్గుతుంది.
మిషన్ భగీరథతో స్వచ్ఛమైన నీరు
డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారానే ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించడం సాధ్యపడింది. ఇదే దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం స్వచ్ఛమైన నీటిని అందించే విషయంలో యూరప్ మన రాష్ట్రం కంటే వెనుకబడి ఉంది. తాగునీటి స్వచ్ఛతలో గెలంగాణ టాప్‌లో నిలవడం మనకు గర్వకారణం.
సురక్షిత తాగునీటిలో తెలంగాణ టాప్
Published Fri, Jun 30 2023 5:56 AM | Last Updated on Fri, Jun 30 2023 5:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment