ఫేజ్–1లో భాగంగా హిరమండలంలో నిర్మించిన అప్రోచ్ బ్రిడ్జ్
సాక్షి, అమరావతి: దశాబ్దాల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా సురక్షిత తాగునీరు అందించనుంది. ఇందుకోసం రూ.265 కోట్లతో ఉద్దానం ఫేజ్–2 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. తద్వారా పాతపట్నం, మెలియపుట్టి, హిరమండలం, కొత్తూరు, లక్ష్మీనరసపేట మండలాల పరిధిలోని 448 నివాసిత ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు మూడున్నర లక్షల మందికి తాగునీటి ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగిపోతాయి.
ఉద్దానం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో కొన్ని ప్రమాదకర లోహాలు కారణంగానే ఆ నీటిని తాగే అక్కడి ప్రజలు ఏళ్ల తరబడి కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ సమస్య పరిష్కారానికి గత చంద్రబాబు ప్రభుత్వం మాయమాటలు చెబుతూ కాలక్షేపం చేస్తే.. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడునెలలకే రూ.700 కోట్లతో పలాస, ఇచ్ఛాపురం రెండు మున్సిపాలిటీలతో పాటు ఆ ప్రాంతంలోని ఏడు మండలాల పరిధిలోని 807 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించే ఉద్దానం ఫేజ్–1 రక్షిత మంచినీటి పథకానికి 2019 సెప్టెంబరు 6న ప్రభుత్వం మంజూరు చేసింది.
2020 ఆరంభంలోనే పనులను కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ పనులు 90 శాతానికి పైగా పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనికి అనుసంధానంగా ఇప్పుడు ఆ ప్రాంతంలోని మరో ఐదు మండలాల ప్రజలకు కూడా తాగునీరు అందించే పథకానికి ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్) ఆ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా మొదలుపెట్టింది.
రూ.265 కోట్లతో చేపట్టే ఉద్దానం ఫేజ్–2 పనుల టెండరు డాక్యుమెంట్ ప్రస్తుతం జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలనలో ఉంది. మే 4 వరకు అభ్యంతరాల స్వీకరణ అనంతరం జ్యుడీషియల్ ప్రివ్యూ తుది ఆమోదం అనంతరమే టెండర్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆర్‌డబ్యూఎస్ అధికారులు ‘సాక్షి’కి వివరించారు.
‘హిరమండలం’ నుంచి నీటి తరలింపు..
ఉద్దానం మొదటి దశ, రెండో దశ మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఉద్దానానికి అతి సమీపంలో ఉండే బహుదా, మహేంద్రతనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశమున్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతుండడంవల్ల అక్కడ ప్రజలు తిరిగి బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి ఉంటుందేమోనని ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో కొంత అదనపు ఖర్చయినా ఏడాది పొడవునా నీరు అందించే అంశంపై దృష్టిపెట్టింది.
దీంతో ఉద్దానానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేసి, అక్కడి ప్రజలకు ఏడాది పొడువునా తాగునీరు అందించాలని సంకల్పించింది. ఇప్పుడు రెండో దశ ప్రాజెక్టులో కొన్ని ప్రాంతాలకు కూడా నేరుగా రిజర్వాయర్ నుంచే తాగునీటి సరఫరాకు ఏర్పాట్లుచేశారు.
హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని, అందులో 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం ఫేజ్–1 ద్వారా ఆ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కొత్తగా రూ.265 కోట్లతో చేపట్టే ఉద్దానం రెండో దశ ప్రాజెక్టుకు 0.291 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నారు. వచ్చే 30ఏళ్లలో పెరిగే జనాభాకు తగ్గట్లుగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment