డిండి..కదలదండి! | People sufering with Fluoride because of drinking water | Sakshi
Sakshi News home page

డిండి..కదలదండి!

Published Mon, Nov 13 2017 2:10 AM | Last Updated on Mon, Nov 13 2017 2:10 AM

People sufering with Fluoride because of drinking water - Sakshi

వంగిపోయిన నడుము.. వంకర కాళ్లు.. ఎటూ కదల్లేని దైన్యం.. వైద్యం చేయించుకోలని దుర్భర జీవితం.. ఎన్నాళ్లు బతుకుతామో కూడా తెలియని కష్టం.. ఇదీ పూర్వ నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ బాధితుల దుర్భర పరిస్థితి. ఈ దుస్థితికి శాశ్వత పరిష్కారం చూపేలా కృష్ణా జలాలను తరలించేందుకు ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వాటికి శంకుస్థాపనలు కూడా చేసింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టులు ఇంకా ప్రాథమిక దశలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. అవి ఎప్పటికి పూర్తవుతాయోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
– సాక్షి, హైదరాబాద్‌

అలైన్‌మెంట్‌ కూడా తేలలేదు 
పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల పరిధిలో ఫ్లోరైడ్‌ బాధిత మండలాలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకానికి 2015, జూన్‌ 11న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ రెండున్నరేళ్లయినా ప్రాథమిక దశ కూడా దాటలేదు. నార్లాపూర్‌ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్‌మెంట్‌తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతింటుందని మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరాలు లేవనెత్తారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రాజెక్టుపై సర్వే చేస్తున్న వ్యాప్కోస్‌ నిర్ణీ త గడువులో నివేదిక ఇవ్వకపోవడంతో అలైన్‌మెంట్‌ కూడా తేలలేదు. అయితే డిండికి దిగువన చేపట్టిన పనులు మాత్రం ఇప్పటికే మొదలై కొనసాగుతున్నాయి. 

మార్పులు, చేర్పులు.. వీడని చిక్కులు
వాస్తవానికి డిండి ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అంశమై అనేక మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. శ్రీశైలం వరద నీటిపై ఆధారపడుతూ చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ద్వారా 30 టీఎంసీల నీటిని డిండికి తరలించేలా ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. నక్కలగండి వద్ద రిజర్వాయర్‌ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 11 టీఎంసీలను మిడ్‌ డిండికి, డిండికి తరలించేలా డిజైన్‌ చేశారు. కానీ అధిక ఖర్చు దృష్ట్యా శ్రీశైలం నుంచే నేరుగా తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం శ్రీశైలం నుంచి ఓపెన్‌ చానల్, టన్నెళ్ల ద్వారా నీటిని ఎత్తిపోసి డిండికి తరలించేలా డిజైన్‌ చేశారు. ఇదే సమయంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా శ్రీశైలం నుంచే నీటిని తీసుకోవాలని నిర్ణయించడంతో.. డిండికి పాలమూరు పథకంలోని ఏదుల రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకోవాలని యోచిస్తున్నారు. తర్వాత హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు, రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు 30 టీఎంసీలు అవసరమని లెక్కించి.. మొత్తంగా 60 టీఎంసీలను డిండి ద్వారానే తరలించేందుకు కొత్త ప్రణాళిక తెరపైకి తెచ్చారు. తర్వాత ఏదుల కన్నా నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకుంటే నయమంటూ మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 

ఒడిదొడుకుల ఎస్‌ఎల్‌బీసీ
ఇక శ్రీశైలం నుంచి 30 టీఎంసీలను తీసుకునేలా చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2004లో రూ.1,925 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా.. భూసేకరణ సమస్యలు, వరదలతో పనులు జాప్యమయ్యాయి. ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. అందులో శ్రీశైలం డ్యామ్‌ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాల్సిన 43.89 కిలోమీటర్ల టన్నెల్‌లో.. ఇప్పటివరకు 30.46 కిలోమీటర్లు పూర్తయింది. మరో 13.46 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. దీనికి మరో మూడేళ్లు పట్టే అవకాశముందని అంచనా. ఈ దృష్ట్యా నక్కలగండి రిజర్వాయర్‌ను త్వరగా పూర్తిచేస్తే అప్పర్‌ డిండి నుంచి వచ్చే మిగులు జలాలను నిల్వ చేసుకునే అవకాశముందని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ సునీల్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement