- రక్షిత మంచినీటి పథకాలకు గ్రహణం
- తుప్పు పట్టిన పంప్‌సెట్లు
- ఊసేలేని ఆపరేటర్ల నియామకం
- పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు
- గుదిబండగా మారిన సర్‌చార్జి
- గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లు
కర్నూలు(జిల్లా పరిషత్): గ్రామీణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాల తీరు అధ్వానంగా మారింది. 12 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పంప్‌సెట్లు చాలాచోట్ల తుప్పుపట్టిపోయాయి. 70 శాతం ప్యానెల్ బోర్డులు, పంప్‌సెట్లు మార్చాల్సి ఉండగా.. ఆ ఊసే కరువైంది. పంప్‌హౌస్ వద్ద ఆపరేటర్ల కొరత తీవ్రంగా ఉన్నా అధికారులు చొరవ చూపని పరిస్థితి. నాలుగైదు పంప్‌సెట్లకు ఒక ఆపరేటర్ ఉండటం.. విద్యుత్ కోత కారణంగా పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కొందరు ఆపరేటర్లు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై ప్రయాణిస్తూ పంప్‌సెట్లను పర్యవేక్షించాల్సి వస్తోంది.
ఇటీవల ప్రభుత్వం సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఆర్గనైజేషన్ నిబంధనల మేరకు ప్రతి పంప్‌హౌస్ వద్ద ఒక ఆపరేటర్, వాచ్‌మన్, ఎలక్ట్రీషియన్‌ను నియమించాలని ఆదేశించినా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. జిల్లాలోని 52 సీపీడబ్ల్యు స్కీంల నిర్వహణకు విద్యుత్ బిల్లుల చెల్లింపు ఆర్‌డబ్ల్యుఎస్ శాఖకు గుదిబండగా మారుతోంది. గత ఏడాది ప్రారంభంలో యూనిట్‌కు 1.20 పైసల నుంచి ఏకంగా 5.90 పైసలకు టారిఫ్ పెంచడంతో బిల్లుల వ్యయం అమాంతం పెరిగిపోయింది.
దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటిపై విద్యుత్ అధికారులు చక్ర వడ్డీలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ భారానికి సర్‌చార్జీ అదనంగా తోడవుతోంది. మొత్తం మూడు డివిజన్లలో దాదాపు రూ.3కోట్ల విద్యుత్ బకాయిలు ఉండటం.. విద్యుత్ అధికారులు సరఫరా నిలిపేసేందుకు సిద్ధమవుతుండటంతో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం కనిపిస్తోంది.
నత్తనడకన జాతీయ గ్రామీణ తాగునీటి పథకాలు
జాతీయ గ్రామీణ తాగునీటి పథకం(ఎన్‌ఆర్‌డీడబ్ల్యుపీ) సింగిల్ విలేజ్ స్కీం(ఎస్‌వీఎస్) కింద 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.43.3 కోట్ల విలువతో.. గత సంవత్సరం మంజూరై మిగిలిపోయిన 213 పనులను చేపట్టారు. ఈ గ్రాంట్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3.28 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 213 పనుల్లో 23 పూర్తి కాగా.. 76 పనులు నిర్మాణ దశలో, 24 పనులు టెండర్ దశలో, 21 పనులు అగ్రిమెంట్ దశలో, మిగిలిన 69 పనులు ప్రారంభ దశలోనే ఉండిపోయాయి.
అదేవిధంగా మల్టీ విలేజ్ స్కీం(ఎంవీఎస్) కింద 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.243 కోట్ల విలువతో గత సంవత్సరం మంజూరై మిగిలిపోయిన 55 పనులతో పాటు ఆరు కొత్త పనులు చేపట్టారు. ఈ గ్రాంట్ కింద ఆర్థిక సంవత్సరంలో రూ.37.3 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 55 పనుల్లో 24 పూర్తి కాగా, 13 పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. రెండు పనులు టెండర్ దశలో, 3 పనులు అగ్రిమెంట్ దశలో, మిగిలిన 13 పనులు ప్రారంభానికే నోచుకోని పరిస్థితి. 13వ ఆర్థిక ప్రణాళిక సంఘం నిధుల ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.98.6. కోట్ల విలువతో గత సంవత్సరం మంజూరై మిగిలిన 53 పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 53 పనుల్లో 5 పూర్తి చేశారు. 29 పనులు నిర్మాణ దశలో, 6 పనులు టెండర్ దశలో, 19 పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఈ నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రజలు దాహంతో అలమటించాల్సి వస్తోంది.
కోడుమూరు మండలం సి.బెళగల్ గ్రామంలోని ఎస్సీ కాలనీవాసుల దాహార్తిని తీర్చేందుకు గత యేడాది ఎస్‌ఆర్‌డీడబ్ల్యుపీ స్కీమ్ కింద స్థానిక చర్చి సమీపంలో 60వేల లీటర్ల సామర్థ్యంతో రూ.24.38లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించారు. ట్యాంకు నుంచి నీటి సరఫరాకు పైపులు అమర్చకపోవడంతో ఈ పథకం వృథాగా మారింది.
గనేకల్ వాటర్ స్కీమ్ నుంచి ఆదోని మండలంలోని ఉవ్వనూరు, సాంబగళ్లు, నెట్టెకల్లు, చిన్న పెండేకల్లు గ్రామాలకు సక్రమంగా నీరందటం లేదు. పైపులైన్లు పగిలినా కాంట్రాక్టర్లు పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు.