వైరా : గత ఆరేళ్లుగా విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ట్రాన్స్‌కో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రె ండు రోజులుగా జిల్లాలోని మేజర్, మైనర్ పంచాయతీలకు పవర్ కట్ చేశారు. రెండు నెలల్లో బకాయిలు చెల్లించకుంటే వీధిలైట్లకు సరఫరా నిలిపివేస్తామని నోటీసులు జారీ చేసినా పంచాయతీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ కనెక్షన్‌లు తొలగించే కార్యక్రమం చేపట్టారు.
గతంలో ప్రభుత్వమే భరించింది...
గతంలో రాష్ట్ర ప్రభుత్వమే గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు చెల్లించేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులతో పంచాయతీలే విద్యుత్ బిల్లులు చెల్లించాలని నిబంధనలు ఉన్నప్పటికీ 2009 వరకు ప్రభుత్వమే చెల్లించేది. ఆ తర్వాత బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లు కట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో.. తమకు వచ్చే నిధులే అంతంతమాత్రంగా ఉన్నాయని, ఇందులోనుంచి బిల్లులు ఎలా చెల్లిస్తామని సర్పంచ్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రూ.45.80 కోట్ల బకాయిలు...
జిల్లాలో 17 మేజర్, 741 మైనర్ పంచాయతీలకు సంబంధించిన వీధిలైట్లు, నీటి పంపుల బిల్లులు రూ.45.80 కోట్ల బకాయిలు ఉన్నాయని ట్రాన్స్‌కో అధికారులు చెపుతున్నారు. మేజర్ పంచాయతీల్లో వాటర్ వర్క్స్ కింద రూ. 3.2 కోట్లు, మైనర్ పంచాయతీల్లో వాటర్ వర్క్స్ కింద రూ.16.34 కోట్లు బకాయిలు ఉండగా, మేజర్ పంచాయితీల్లో వీధిలైట్ల బిల్లులు రూ.3.80 కోట్లు, మైనర్ పంచాయతీల్లో రూ.20.20 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక విద్యుత్ కనెక్షన్‌లు తొలగిస్తున్నామని అధికారులు అంటున్నారు. మేజర్ పంచాయతీల్లో వైరా, తల్లాడ, మణుగురు, కల్లూరు, నేలకొండపల్లి, భద్రాచలంలో రెండు రోజుల క్రితమే విద్యుత్ సరఫరా నిలిపి వేశారు.
బతుకమ్మకు ఆటంకం...
తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తరువాత తొలిసారిగా బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే గ్రామాల్లో బకాయిల పేరుతో వీధి లైట్లు తొలగించడం సరైంది కాదని సర్పంచ్‌లు అంటున్నారు. బకాయిల చెల్లింపునకు మరికొంత కాలం ఆగాలని ట్రాన్స్‌కో అధికారులను కోరుతున్నారు. లేదంటే ఆందోళనకు దిగాల్సి వస్తుందని చెపుతున్నారు.
పంచాయతీలకు పవర్ కట్
Published Thu, Sep 25 2014 2:15 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement