Vaira
-
ఖమ్మం జిల్లా వైరాలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం
-
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
ఖమ్మం వైరా : కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై తాండ్ర నరేష్ తెలిపిన వివరాలు... స్థానిక బీసీ కాలనీకి చెందిన చందా సైదారావు(36), ఆయన భార్య వరలక్ష్మి మధ్య కొన్నాళ్లుగా ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఆమె సోదరుడైన రామారావు, శుక్రవారం సైదారావు ఇంటికి వచ్చి బెదిరించాడు, దాడి చేశాడు. అదే రోజు రాత్రి, ఎస్బీఐ సమీపంలో తనకు చెందిన టీ స్టాల్ వద్ద సైదారావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వరలక్ష్మి ఫిర్యాదుతో రామారావుపై కేసు నమోదు చేశారు దర్యాప్తు జరుపుతున్నారు. -
2 వేల కిలోల గంజాయి స్వాధీనం
వై.రామవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 2 వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వై రామవరం మండలం డొంకరాయి వద్ద శుక్రవారం తనిఖీలు చేపడుతున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. -
బల్లి పడిన ఆహారం తిని మహిళ మృతి
వైరా: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బల్లి పడిన ఆహారం తిని ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన వైరా మండలం పాటడుగు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జానకి రామయ్య కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుమానం వచ్చిన వారు వంట గిన్నెలు తీసి చూడగా.. సాంబారులో బల్లి పడి ఉంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. జానకి రామయ్య భార్య భారతమ్మ చికిత్స పొందుతూ మృతిచెందగా..జానకి రామయ్యతో పాటు కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. -
నేటి నుంచి ఓటరు జాబితా సవరణ
వైరా : కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు మళ్లీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా శుక్రవారం నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్ఓలు) ఇంటింటికి వె ళ్లి ఓటర్ల జాబితా సవరణ, బోగస్ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన యువతను ఓటు హక్కు నమోదు చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి తనిఖీ నిర్వహించనున్నారు. ఈ తనిఖీలో అధికారులు ఓటర్ల జాబితా సవరణ, వలసలు వెళ్లిన వారి పేర్ల తొలగింపు, డబుల్ ఓటరు కార్డుల తొలగింపు మరణించిన వారి పేర్ల తొలగింపు తదితర వివరాలు నమోదు చేయనున్నారు. జిల్లాలో 20,17,511 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 9,97,366 మంది, స్త్రీలు 10,19,538 మంది ఓటర్లు ఉండగా ఇతరులు 126, సర్వీసు ఓటర్లు 481 మంది ఓటర్లు ఉన్నారు. 15 రోజుల్లో తనిఖీలు పూర్తి.... నేటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ తనిఖీ నిర్వహించనున్నారు. అనంతరం ఆ వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయనున్నారు. మార్పులు చేసిన జాబితాలను నవంబర్ నెలాఖరున ప్రకటించనున్నారు. ఆ జాబితాలో పేర్లు లేని వ్యక్తులు ఓటర్లుగా నమోదు చేయించుకోవడం కోసం డిసెంబర్ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి. ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత ఓటరు నమోదు చేసుకునేందుకు కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ వరకు నిర్వహిస్తారు. 2015 జనవరి 25న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఓటర్ల వివరాలను ఆన్లైన్లో పెట్టనున్నారు. -
పంచాయతీలకు పవర్ కట్
వైరా : గత ఆరేళ్లుగా విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ట్రాన్స్‌కో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రె ండు రోజులుగా జిల్లాలోని మేజర్, మైనర్ పంచాయతీలకు పవర్ కట్ చేశారు. రెండు నెలల్లో బకాయిలు చెల్లించకుంటే వీధిలైట్లకు సరఫరా నిలిపివేస్తామని నోటీసులు జారీ చేసినా పంచాయతీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ కనెక్షన్లు తొలగించే కార్యక్రమం చేపట్టారు. గతంలో ప్రభుత్వమే భరించింది... గతంలో రాష్ట్ర ప్రభుత్వమే గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు చెల్లించేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులతో పంచాయతీలే విద్యుత్ బిల్లులు చెల్లించాలని నిబంధనలు ఉన్నప్పటికీ 2009 వరకు ప్రభుత్వమే చెల్లించేది. ఆ తర్వాత బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లు కట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో.. తమకు వచ్చే నిధులే అంతంతమాత్రంగా ఉన్నాయని, ఇందులోనుంచి బిల్లులు ఎలా చెల్లిస్తామని సర్పంచ్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రూ.45.80 కోట్ల బకాయిలు... జిల్లాలో 17 మేజర్, 741 మైనర్ పంచాయతీలకు సంబంధించిన వీధిలైట్లు, నీటి పంపుల బిల్లులు రూ.45.80 కోట్ల బకాయిలు ఉన్నాయని ట్రాన్స్‌కో అధికారులు చెపుతున్నారు. మేజర్ పంచాయతీల్లో వాటర్ వర్క్స్ కింద రూ. 3.2 కోట్లు, మైనర్ పంచాయతీల్లో వాటర్ వర్క్స్ కింద రూ.16.34 కోట్లు బకాయిలు ఉండగా, మేజర్ పంచాయితీల్లో వీధిలైట్ల బిల్లులు రూ.3.80 కోట్లు, మైనర్ పంచాయతీల్లో రూ.20.20 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నామని అధికారులు అంటున్నారు. మేజర్ పంచాయతీల్లో వైరా, తల్లాడ, మణుగురు, కల్లూరు, నేలకొండపల్లి, భద్రాచలంలో రెండు రోజుల క్రితమే విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. బతుకమ్మకు ఆటంకం... తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తరువాత తొలిసారిగా బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే గ్రామాల్లో బకాయిల పేరుతో వీధి లైట్లు తొలగించడం సరైంది కాదని సర్పంచ్‌లు అంటున్నారు. బకాయిల చెల్లింపునకు మరికొంత కాలం ఆగాలని ట్రాన్స్‌కో అధికారులను కోరుతున్నారు. లేదంటే ఆందోళనకు దిగాల్సి వస్తుందని చెపుతున్నారు. -
నేనూ రైతు బిడ్డనే..!
వైరా :‘నేనూ రైతుబిడ్డనే..నాకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం’ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి స్పష్టం చేశారు. మండలంలోని సోమవరం పంచాయతీలో పంటలను ఆయన సోమవారం పరిశీలించారు. రోడ్డుపక్కన పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీలతో కొద్దిసేపు సంభాషించారు. వ్యవసాయ పనులు ఏవిధంగా సాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. వైరా రిజర్వాయర్ కింద నీరు విడుదల చేయక వరినాట్లు అంతగా లేవని కూలీలు బదులిచ్చారు. రిజర్వాయర్‌కు నీరు విడుదల చేస్తే నాట్లు ఉంటాయని, తమకు వ్యవసాయ పనులు దొరుకుతాయని కూలీలు కలెక్టర్‌కు చెప్పారు. అరగంటపాటు ఆయన కూలీలతో మాట్లాడారు. నారు కట్టలు, వరి నాటు వేసే విధానాన్ని పరిశీలించారు. అంతకుముందు రిజర్వాయర్ వద్దకు కలెక్టర్ వెళ్లారు. రిజర్వాయర్‌లో ఎంత మేర నీరు ఉన్నది, సాగర్ జలాలు ఏ మేరకు అవసరం ఉన్నాయో అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ నింపాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని వైరా ఎంపీపీ బొంతు సమత కలెక్టర్‌కు విన్నవించారు. వర్షాభావ పరిస్థితులపై జిల్లాలో త్వరలో శాఖలవారీగా సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఎన్నెస్పీ ఎస్ఈ అప్పలనాయుడు, జేడీఏ భాస్కర్‌రావు, మధిర ఏడీఏ బాబూరావు, ఐబీ ఏఈ రాణి, తదితరులున్నారు. -
ఖమ్మం జిల్లాలో భారీ వర్షం
ఖమ్మం జిల్లాలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షం పడింది. కొత్తగూడెం, వైరా, ఖమ్మం, మధిర ప్రాంతాల్లో గాలివానతో బీభత్సం సృష్టించింది. కొత్తగూడెంలో అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగడం, చెట్లు రోడ్లపై కూలడంతో రాత్రి వరకు కూడా విద్యుత్ సరాఫర కాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కెటీపీఎస్ నుంచి సీతరామపట్నం వచ్చే విద్యుత్ లైన్ ట్రిప్ కావడం, లక్ష్మీదేవిపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్‌పై పిడుగు పడడంతో 5 లక్షల వరకు నష్టం జరిగింది. దీంతో విద్యుత్ సరాఫర నిలిచిపోయింది. పాల్వంచలో జాతీయ రహదారిపై పాత పాల్వంచ సమీపంలోభారీ వృక్షం రోడ్డుపై పడింది. దీంతో తెల్లవారుజామున 4 గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మున్సిపల్ , పోలీసు అధికారుల చొరువతో సిబ్బంది చెట్టును తొలగించారు. ఖమ్మం నగరంలో కూడా సాయంత్రం భారీ వర్షం పడింది. గాలివానతో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో నగరంలో రాత్రి 10 గంటల వరకు అంధకారం నెలకొంది. గాలి దుమారంతో బయ్యారం మండలం జగ్గుతండలో 3 విద్యుత్ స్తంభాలు విరిగాయి. వైరా, కొణిజర్లలో భారీ వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. మధిర, చింతకాని మండలాల్లో జల్లులతో వర్షం పడింది. -
ఖమ్మం, వైరాలో రూ. 10 లక్షలు పట్టివేత
ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్ నేతలు వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో రూ. 4.94 లక్షలు, వైరాలో రూ.5 లక్షలు పోలీసులకు పట్టుబడ్డాయి. వివరాలు.. వైరా టీడీపీ అధ్యక్షుడు మేదరమెట్ల శ్రీనివాస్ మరికొందరు కార్యకర్తలతో కలిసి గాంధీనగర్‌లో డబ్బు పంచుతున్నారనే సమాచారం మేరకు ఎస్సై విక్రమ్ దాడి చేశారు. వారినుంచి రూ.5 లక్షలు, ఓటర్ స్లిప్‌లు, ఓటరు జాబితాలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పంచుతున్న టీడీపీ నాయకులపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే, ఖమ్మం నగరంలో కాంగ్రెస్ నాయకులు రాజేష్, క్రాంతికుమార్ ఓటర్లుకు డబ్బులు పంపిణీ చేస్తుండగా వన్‌టౌన్ పోలీసులు దాడి చేసి వారి వద్ద నుంచి రూ.4.94 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
చంద్రావతి ఏం చేస్తారో...?
సాక్షి, ఖమ్మం: అతిచిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టి రికార్డు సృష్టించిన వైరా ఎమ్మెల్యే డాక్టర్ బాణోతు చంద్రావతి రాజకీయ భవితవ్యం ఏమిటన్నది ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. గత ఎన్నికలలో అనూహ్యంగా తెరపైకి వచ్చి అంతే అనూహ్యంగా విజయం సాధించిన ఈ డాక్టరమ్మకు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అన్నీ ప్రతికూల పరిస్థితులే ఏర్పడ్డాయి. సొంత పార్టీనే మళ్లీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారామె. అయితే ఈసారి ఎన్నికలలో పోటీచేసేందుకు గాను ఆమె పేరు మీద రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నామినేషన్ పత్రాలు తీసుకెళ్లడం చర్చనీయాంశమయింది. అసలు ఈ నామినేషన్లు ఈమె ఎందుకు తీసుకెళ్లినట్టు? ఏ పార్టీ తరఫున బరిలో దిగుతున్నట్టు అనేది తేలాల్సి ఉంది. ముందే దూకుడు.. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తొలిరోజే వైరాలో ఐదుగురు అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఇందులో బాణోతు చంద్రావతి పేరు మీద ఆమె అనుచర నేతలు నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఆమె తరఫున నామినేషన్ పత్రాలు తీసుకున్నారన్న విషయం వైరా నియోజకవర్గం అంతా వ్యాపించింది. దీంతో అసలు చంద్రావతి ఏం చేయబోతున్నారన్నది వైరాలో హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి కూడా చంద్రావతి పేరుమీద నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. అయితే చంద్రావతి ఖమ్మం, వైరా రెండు చోట్ల నామినేషన్ వేస్తారని, చివరకు ఖమ్మం ఉపసంహరించుకొని, వైరా బరిలో నిలుస్తారని సమాచారం. చంద్రావతి ఏపార్టీ నుంచి బరిలోకి దిగినా కాంగ్రెస్‌తో పొత్తుతో సీపీఐ తప్పకుండా విజయం సాధిస్తుందన్న ధీమాలో ఆ పార్టీ నేతలున్నా, కొంత మేర నష్టం జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. సీపీఐకి గండి కొట్టడమే ధ్యేయంగా ఆమె ముందుకు కదులుతున్నారని ఆమె అనుచరులు వైరాలో ఇప్పటికే ప్రచారం చేస్తుండడం గమనార్హం. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఆమె సీపీఐ టికెట్ల విషయం కొలిక్కి రావడం, వైరా నియోజకవర్గానికి మూడు నారాయణను జిల్లా పార్టీ ఎంపిక చేయడంతో, ఇక తనకు టికెట్ రానట్లేనని భావించి ఏంచేయాలన్న దానిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భవితవ్యం ఏమిటి? చంద్రావతి ఎటువైపు అడుగులు వేస్తున్నారనేదానిపై చర్చ జరుగుతోంది. ఆమె ఈసారి బీజేపీ లేదా టీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటారని వైరా నియోజకవర్గంలో ప్రచారం గుప్పుమంటోంది. బీజేపీ నుంచి పోటీచేసేందుకు పెద్దగా పోటీ లేకపోవడంతో ఆమె అటు వైపు చూస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరే అవకాశం ఉండడంతో ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించాలన్న ధీమాలో ఆమె ఉన్నట్లు సమాచారం. తనపై ఉన్న సానుభూతి కూడా తనను విజయ తీరం చేరుస్తుందన్న ఆశతో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వామపక్ష పార్టీ నుంచి అయినా బీజేపీలోకి వెళ్లేందుకు చంద్రావతి ఆలోచిస్తున్నారని అంటున్నారు. -
గిరిజన మహిళనైన నన్ను బాధపెట్టారు: వైరా ఎమ్మెల్యే
ఖమ్మం: సీపీఐపై వైరా ఎమ్మెల్యే చంద్రావతి లేఖాస్త్రం సంధించారు. గత కొద్దిరోజులుగా చంద్రావతి సీపీఐని వీడుతున్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో లేఖాస్త్రం సంధించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. గిరిజన మహిళనైన నన్ను బాధపెట్టారు. అనేక రకాలుగా ఇబ్బందికి గురిచేశారు. పార్టీలో గిరిజన ప్రజాప్రతినిధులకు సమస్యలు సృష్టించి బయటకు గెంటేస్తున్నారు అని చంద్రావతి లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే సీటు వేరే అభ్యర్ధికి ఇస్తామన్న విషయంలో కనీసం నా అభిప్రాయం కూడా తీసుకోలేదని, సీపీఐ వల్ల ఆర్ధికంగా నష్టపోయానని లేఖలో తెలిపారు. అయితే తనకు పార్టీ మారే ఆలోచన లేదని చంద్రావతి తెలిపారు. ఎప్పటికీ పార్టీ సీపీఐలోనే ఉంటానని చంద్రావతి స్పష్టం చేశారు.