చంద్రావతి ఏం చేస్తారో...?
సాక్షి, ఖమ్మం: అతిచిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టి రికార్డు సృష్టించిన వైరా ఎమ్మెల్యే డాక్టర్ బాణోతు చంద్రావతి రాజకీయ భవితవ్యం ఏమిటన్నది ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. గత ఎన్నికలలో అనూహ్యంగా తెరపైకి వచ్చి అంతే అనూహ్యంగా విజయం సాధించిన ఈ డాక్టరమ్మకు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అన్నీ ప్రతికూల పరిస్థితులే ఏర్పడ్డాయి.
సొంత పార్టీనే మళ్లీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారామె. అయితే ఈసారి ఎన్నికలలో పోటీచేసేందుకు గాను ఆమె పేరు మీద రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నామినేషన్ పత్రాలు తీసుకెళ్లడం చర్చనీయాంశమయింది. అసలు ఈ నామినేషన్లు ఈమె ఎందుకు తీసుకెళ్లినట్టు? ఏ పార్టీ తరఫున బరిలో దిగుతున్నట్టు అనేది తేలాల్సి ఉంది.
ముందే దూకుడు..
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తొలిరోజే వైరాలో ఐదుగురు అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఇందులో బాణోతు చంద్రావతి పేరు మీద ఆమె అనుచర నేతలు నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఆమె తరఫున నామినేషన్ పత్రాలు తీసుకున్నారన్న విషయం వైరా నియోజకవర్గం అంతా వ్యాపించింది. దీంతో అసలు చంద్రావతి ఏం చేయబోతున్నారన్నది వైరాలో హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి కూడా చంద్రావతి పేరుమీద నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. అయితే చంద్రావతి ఖమ్మం, వైరా రెండు చోట్ల నామినేషన్ వేస్తారని, చివరకు ఖమ్మం ఉపసంహరించుకొని, వైరా బరిలో నిలుస్తారని సమాచారం.
చంద్రావతి ఏపార్టీ నుంచి బరిలోకి దిగినా కాంగ్రెస్‌తో పొత్తుతో సీపీఐ తప్పకుండా విజయం సాధిస్తుందన్న ధీమాలో ఆ పార్టీ నేతలున్నా, కొంత మేర నష్టం జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. సీపీఐకి గండి కొట్టడమే ధ్యేయంగా ఆమె ముందుకు కదులుతున్నారని ఆమె అనుచరులు వైరాలో ఇప్పటికే ప్రచారం చేస్తుండడం గమనార్హం. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఆమె సీపీఐ టికెట్ల విషయం కొలిక్కి రావడం, వైరా నియోజకవర్గానికి మూడు నారాయణను జిల్లా పార్టీ ఎంపిక చేయడంతో, ఇక తనకు టికెట్ రానట్లేనని భావించి ఏంచేయాలన్న దానిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
భవితవ్యం ఏమిటి?
చంద్రావతి ఎటువైపు అడుగులు వేస్తున్నారనేదానిపై చర్చ జరుగుతోంది. ఆమె ఈసారి బీజేపీ లేదా టీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉంటారని వైరా నియోజకవర్గంలో ప్రచారం గుప్పుమంటోంది. బీజేపీ నుంచి పోటీచేసేందుకు పెద్దగా పోటీ లేకపోవడంతో ఆమె అటు వైపు చూస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరే అవకాశం ఉండడంతో ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించాలన్న ధీమాలో ఆమె ఉన్నట్లు సమాచారం. తనపై ఉన్న సానుభూతి కూడా తనను విజయ తీరం చేరుస్తుందన్న ఆశతో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వామపక్ష పార్టీ నుంచి అయినా బీజేపీలోకి వెళ్లేందుకు చంద్రావతి ఆలోచిస్తున్నారని అంటున్నారు.