banoth chandravathi
-
నోటిఫికేషన్లకు... కోరం ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కోరం నిబంధనతో వీలైనంత త్వరగా కొత్త నియామకాలను చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టీఎస్పీఎస్సీ ప్రస్తుత చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీల ఆరేళ్ల పదవీకాలం ఈనెల 17తో ముగియనుంది. ఆ తర్వాత కమిషన్‌లో కేవలం ఇద్దరు సభ్యులు... కృష్ణారెడ్డి, సాయిలు మాత్రమే కొనసాగనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల జారీకి టీఎస్పీఎస్సీలో కోరం ఉండాల్సిందే. కమిషన్ చైర్మన్‌తో పాటు కనీసం ముగ్గురు సభ్యులు ఉండాలి. కానీ ఈ నెల 17 తర్వాత కమిషన్‌లో ఇద్దరే మిగులుతారు. కాబట్టి కొత్త చైర్మన్‌తో పాటు కనీసం ఒక సభ్యుడిని ప్రభుత్వం వీలైనంత త్వరగా నియమిస్తేనే ఉద్యోగ ప్రకటనల జారీకి ఇబ్బందులు ఉండవు. రాజ్యాంగం ప్రకారం చైర్మన్, సభ్యుల కాలపరిమితి పెంచే అవకాశం లేకపోవడంతో కొత్త నియామకాలు అనివార్యం కానున్నాయి. అదేవిధంగా ప్రస్తుత కమిషన్‌లో ఈనెల 17 తర్వాత మిగిలే ఇద్దరు సభ్యుల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఒకరి, అక్టోబర్‌లో మరొకరి పదవీ కాలం ముగుస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా ఉన్న ఖాళీలు, ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదివారం ఆదేశించిన సంగతి తెలిసిందే. మంజూరైన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీల లెక్కలను తీసే పనిలో వివిధ ప్రభుత్వశాఖలు ఉన్నాయి. ఖాళీల లెక్క తేలాక ప్రభుత్వం వీటి భర్తీకి ఇండెంట్లు ఇస్తే వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. పదవీ విరమణ ఉత్తర్వులు జారీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, బి.చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ ఈ నెల 17న పదవీ విరమణ చేస్తారని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారంఉత్తర్వులు జారీ చేశారు. -
చిన్న వయసులోనే.. పెద్ద రికార్డు
మన దేశంలో లోక్‌సభ ఎంపీగా, అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రాజ్యాంగం నిర్దేశించిన కనీస వయసు 25 సంవత్సరాలు. అయితే 25 ఏళ్లకే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి పలువురు రికార్డు సృష్టించారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా..: 2009లో ఆంధప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున గెలిచిన బాణోతు చంద్రావతి వయసు అప్పటికి 25 ఏళ్లు మాత్రమే. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమె విశాఖలో మెడిసిన్ ఫైనలియర్ పూర్తి చేశారు. తాత బీక్యానాయక్ సీపీఐలో చురుకుగా పనిచేసేవారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. దీంతో చంద్రావతికి టికెట్ దక్కింది. చిన్న వయసులోనే మంత్రిగా సుష్మా స్వరాజ్ రికార్డు..: చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో సుష్మా స్వరాజ్ ఒకరు. ఆమె 1977లో 25 ఏళ్ల వయసులోనే హరియాణా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే 25 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టారు. 1962లో రాజస్తాన్‌లోని బార్మర్ నుంచి ఉమేద్‌సింగ్ , 2012లో ఉత్తరప్రదేశ్‌లోని సదర్ నియోజకవర్గం నుంచి అరుణ్ వర్మ 25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 29 ఏళ్లకే సీఎంగా..: దేశంలో అతిచిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించింది ఎం.ఓ.హసన్ ఫరూక్ మరికర్. 1967లో 29 ఏళ్లకే ఆయన పుదుచ్చేరి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రేమ్ ఖండూ 36 ఏళ్లకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, హేమంత్ సోరెన్ 37 ఏళ్లకు జార్ఖండ్ సీఎంగా, అఖిలేశ్ యాదవ్ 38 ఏళ్లకే యూపీ సీఎంగా పనిచేశారు. చిన్నవయసులోనే ఎంపీగా దుష్యంత్..: దేశంలో అతిపిన్న వయసులో ఎంపీగా గెలుపొందిన ఘనత దుష్యంత్ చౌతాలాకు దక్కింది. ఐఎన్ఎల్డీ నుంచి 2014లో హరియాణాలోని హిసార్ నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్‌పై గెలుపొందారు. ఎంపీ అయ్యేనాటికి వయసు 25 ఏళ్లు మాత్రమే. దుష్యంత్ మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు కాగా.. హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు మనువడు. ఉంగాండా నుంచి 19 ఏళ్లకే ఎంపీ..: ప్రపంచంలోనే అతి పిన్న వయసుగల ఎంపీని ఎన్నుకున్న ఘనత ఆఫ్రికా దేశమైన ఉగాండాకు దక్కింది. ఉగాండాకు చెందిన ప్రోస్కోవియా ఓరోమయిట్ హైస్కూలు పూర్తవుతూనే నేరుగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించేనాటికి ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. 31 ఏళ్లకే దేశ ప్రధానిగా..: చిన్న వయసులోనే ఒక దేశాధినేతగా ఎన్నికై సెబాస్టియన్ కర్జ్ రికార్డు సృష్టించారు. 2017 డిసెంబర్లో 31 ఏళ్లకే ఆయన ఆస్ట్రియా చాన్సలర్ పదవిని అధిష్టించారు. – సాక్షి, ఎలక్షన్ డెస్క్ -
బాధ్యతలు చేపట్టిన ఘంటా చక్రపాణి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఉదయం 11:30 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. చక్రపాణితోపాటు టీఎస్పీఎస్సీ సభ్యులుగా సి.విఠల్, మతీదుద్దీన్ ఖాద్రీ, బానోతు చంద్రావతి బాధ్యతలు తీసుకున్నారు. వీరంతా ఆరేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌తో సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. -
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా చక్రపాణి
-
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా చక్రపాణి
* సభ్యులుగా విఠల్, చంద్రావతి, మతీదుద్దీన్ * గవర్నర్ ఆమోదంతో అర్ధరాత్రి జీవో జారీ * నేడు బాధ్యతలు స్వీకరించనున్న చక్రపాణి * అసంతృప్త ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు అవకాశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) తొలి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రతిపాదనకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అలాగే కమిషన్ సభ్యులుగా ఉద్యోగ సంఘాల నేత సి.విఠల్, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, ప్రభుత్వోద్యోగి మతీదుద్దీన్ పేర్లను కూడా ఆమోదించారు. దీంతో వీరి నియామకానికి సంబంధించి అర్ధరాత్రికే రాష్ర్ట ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అయితే ప్రభుత్వం సిఫారసు చేసిన మరో ఐదుగురు సభ్యుల విషయంలో మాత్రం గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓయూ ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి, కేయూ ప్రొఫెసర్లు దినేష్‌కుమార్, పి. శ్రీనివాస్, న్యాయవాదులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీరంగారావు పేర్లను తిరస్కరించారు. ప్రభుత్వ సిఫారసు జాబితాను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారమే స్వయంగా రాజ్‌భవన్‌కు తీసుకెళ్లి గవర్నర్‌కు అందించారు. అందరి పేర్లను పరిశీలించిన గవర్నర్.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల మేరకు ఐదుగురి విషయంలో అభ్యంతరం తెలిపారు. నిబంధనల ప్రకారం సభ్యుల్లో సగం మంది విధిగా ప్రభుత్వ ఉద్యోగులై, వారు కనీసం 20 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసుకుని ఉండాలి. అయితే ప్రొఫెసర్లు ప్రభుత్వోద్యోగుల కిందకు రారని, వారు స్వయం ప్రతిపత్తిగల విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని గవర్నర్ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే జాబితాలోని ఇద్దరు న్యాయవాదులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌తోనూ ఫోన్లో చెప్పినట్లు సమాచారం. దీంతో ఐదుగురి పేర్లను నరసింహన్ తిరస్కరించారు. దీంతో మిగిలిన వారి నియామక ఉత్తర్వుల జారీ విషయంలో ప్రభుత్వం తర్జనభర్జనలు పడింది. చివరకు కమిషన్ చైర్మన్‌తోపాటు ముగ్గురు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. వీరంతా ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. చైర్మన్‌గా నియమితులైన ఘంటా చక్రపాణి గురువారం ఉదయం 11.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా కరీంనగర్ జిల్లాకు చెందిన ఘంటాను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 1.07 లక్షల ఖాళీల్లో టీఎస్పీఎస్సీ భర్తీ చేయాల్సిన ఉద్యోగాలే 60 వేల వరకు ఉంటాయని అంచనా. పదవుల భర్తీపై కేసీఆర్ దృష్టి కాగా, కార్పొరేషన్ పదవుల భర్తీపైనా సీఎం దృష్టి సారించారు. మంత్రివర్గంలో చోటు ఆశించి, భంగపడిన ఎమ్మెల్యేలకు ముందుగా అవకాశం ఇవ్వాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీపై కొందరు సన్నిహితులతో సీఎం తాజాగా చర్చించినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నవారిని, వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన సీనియర్లు, ఆలస్యంగా చేరినా హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నవారికి, వివిధ రంగాల్లో నిపుణులను కార్పొరేషన్ల పదవులకు నామినేట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తమకు తగిన గుర్తింపు లభించడం లేదని, పార్టీ కోసం కష్టపడినా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికే టీఆర్ఎస్లోని పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షునిగా ఉన్న మందుల సామేలు, పార్టీ మానకొండూరు ఇన్చార్జిగా ఉన్న ఓరుగంటి ఆనంద్ వంటివారు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. -
వైరా ‘నాయక్’ఎవరో..?
వైరా, న్యూస్‌లైన్: అసెంబ్లీ : వైరా రిజర్వేషన్: ఎస్టీ జనరల్ నియోజకవర్గం ప్రత్యేకతలు.... ఓటర్లలో 45 శాతం గిరిజనులు.వ్యవసాయానికి అనువైన ప్రాంతం. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 25 వేల ఎకరాలకు సాగునీరు, రిజర్వాయర్ నుంచి 80 గ్రామాలకు తాగునీరు సౌకర్యం. తెలంగాణ శబరిమలైగా పేరుగాంచిన వైరా హరిహరసుత అయ్యప్పక్షేత్రం, ఏన్కూరు మండలంలోని నాచారం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయి. వైరా నియోజకవర్గానికి ఇది రెండో ఎన్నిక. మొదటిసారి టీడీపీ, వామపక్షాలు, టీఆర్ఎస్ మహాకూటమి తరఫున సీపీఐ అభ్యర్థినిగా బా ణోత్ చంద్రావతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైరా నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. సీపీఎం మద్దతుతో వైఎస్ఆర్సీపీ దూసుకెళ్తోంది. ఆ పార్టీ నుంచి బాణోత్ మదన్‌లాల్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా మూడు నారాయణ, బీజేపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా బాణోత్ బాలాజీ పోటీలో ఉన్నారు. క్రితంసారి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా గెలిచిన బాణోత్ చంద్రావతికి ఈసారి ఆ పార్టీ టిక్కెట్ నిరాకరించింది. ఆమె టీఆర్ఎస్ అభ్యర్థినిగా ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. వీరుకాక మరో ఆరుగురు అభ్యర్థులు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తున్నారు. పునర్విభజనకు ముందు నాలుగు నియోజకవర్గాల్లో ఈ సెగ్మెంట్ పరిధిలోని మండలాలున్నాయి. ఆ తర్వాత వైరా, కొణిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి, ఏన్కూరు మండలాలతో నియోజకవర్గం ఆవిర్భవించింది. నియోజకవర్గంలో గెలుపోటములను శాసించేది గిరిజనులే. చంద్రావతి, మదన్‌లాల్ మినహా అందరూ కొత్తవారే... 2009 సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఎన్నికల్లో బాణోత్ చంద్రావతి గెలపొందారు. ఆ ఎన్నికల్లో నేడు వైఎస్సార్సీపీ తరఫున పోటీచేస్తున్న బాణోత్ మదన్‌లాల్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీచేశారు. వీరిద్దరు మినహా మిగిలిన వారందరూ కొత్తవారే. సీపీఐ నుంచి పోటీలో ఉన్న డాక్టర్ మూడు నారాయణ జూలూరుపాడు మండలంలో వైద్యునిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం, టీఆర్ఎస్లతో జతకట్టి లబ్ధిపొందిన సీపీఐ తరఫున ఈయన పోటీచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్‌తో జతకట్టినా ఎంతమేరకు ప్రయోజనం జరుగుతుందనేది ప్రశ్నార్థకమే. బీజేపీ మద్దతో టీడీపీ అభ్యర్థిగా బాణోత్ బాలాజీనాయక్ బరిలో దిగినా బీజేపీ ప్రాబల్యం నియోజకవర్గంలో లేదనే చెప్పాలి. కొణిజర్ల మండలం మినహా మిగిలిన ప్రాంతాల్లో అభ్యర్థి అంతగా తెలియకపోవడం కూడా ఆ పార్టీకి గట్టిదెబ్బేనని అంటున్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రాబల్యం అంతగా లేనందున సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రావతి గెలుపు సాధ్యంకాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. నియోజకవర్గంలో గడపగడపకు తెలిసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ ఈ ఎన్నికల్లో సీపీఎం అండతో దూసుకుపోతున్నారు. గిరిజనుల అండ, వైఎస్ఆర్ సంక్షేమ పథకాలే తనను గెలిపించి తీరుతాయని ఆయన విశ్వసిస్తున్నారు. -
చంద్రావతి ఏం చేస్తారో...?
సాక్షి, ఖమ్మం: అతిచిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టి రికార్డు సృష్టించిన వైరా ఎమ్మెల్యే డాక్టర్ బాణోతు చంద్రావతి రాజకీయ భవితవ్యం ఏమిటన్నది ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. గత ఎన్నికలలో అనూహ్యంగా తెరపైకి వచ్చి అంతే అనూహ్యంగా విజయం సాధించిన ఈ డాక్టరమ్మకు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అన్నీ ప్రతికూల పరిస్థితులే ఏర్పడ్డాయి. సొంత పార్టీనే మళ్లీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారామె. అయితే ఈసారి ఎన్నికలలో పోటీచేసేందుకు గాను ఆమె పేరు మీద రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నామినేషన్ పత్రాలు తీసుకెళ్లడం చర్చనీయాంశమయింది. అసలు ఈ నామినేషన్లు ఈమె ఎందుకు తీసుకెళ్లినట్టు? ఏ పార్టీ తరఫున బరిలో దిగుతున్నట్టు అనేది తేలాల్సి ఉంది. ముందే దూకుడు.. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తొలిరోజే వైరాలో ఐదుగురు అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఇందులో బాణోతు చంద్రావతి పేరు మీద ఆమె అనుచర నేతలు నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఆమె తరఫున నామినేషన్ పత్రాలు తీసుకున్నారన్న విషయం వైరా నియోజకవర్గం అంతా వ్యాపించింది. దీంతో అసలు చంద్రావతి ఏం చేయబోతున్నారన్నది వైరాలో హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి కూడా చంద్రావతి పేరుమీద నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. అయితే చంద్రావతి ఖమ్మం, వైరా రెండు చోట్ల నామినేషన్ వేస్తారని, చివరకు ఖమ్మం ఉపసంహరించుకొని, వైరా బరిలో నిలుస్తారని సమాచారం. చంద్రావతి ఏపార్టీ నుంచి బరిలోకి దిగినా కాంగ్రెస్‌తో పొత్తుతో సీపీఐ తప్పకుండా విజయం సాధిస్తుందన్న ధీమాలో ఆ పార్టీ నేతలున్నా, కొంత మేర నష్టం జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. సీపీఐకి గండి కొట్టడమే ధ్యేయంగా ఆమె ముందుకు కదులుతున్నారని ఆమె అనుచరులు వైరాలో ఇప్పటికే ప్రచారం చేస్తుండడం గమనార్హం. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఆమె సీపీఐ టికెట్ల విషయం కొలిక్కి రావడం, వైరా నియోజకవర్గానికి మూడు నారాయణను జిల్లా పార్టీ ఎంపిక చేయడంతో, ఇక తనకు టికెట్ రానట్లేనని భావించి ఏంచేయాలన్న దానిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భవితవ్యం ఏమిటి? చంద్రావతి ఎటువైపు అడుగులు వేస్తున్నారనేదానిపై చర్చ జరుగుతోంది. ఆమె ఈసారి బీజేపీ లేదా టీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటారని వైరా నియోజకవర్గంలో ప్రచారం గుప్పుమంటోంది. బీజేపీ నుంచి పోటీచేసేందుకు పెద్దగా పోటీ లేకపోవడంతో ఆమె అటు వైపు చూస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరే అవకాశం ఉండడంతో ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించాలన్న ధీమాలో ఆమె ఉన్నట్లు సమాచారం. తనపై ఉన్న సానుభూతి కూడా తనను విజయ తీరం చేరుస్తుందన్న ఆశతో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వామపక్ష పార్టీ నుంచి అయినా బీజేపీలోకి వెళ్లేందుకు చంద్రావతి ఆలోచిస్తున్నారని అంటున్నారు. -
రాస్తారోకో కేసులో ఎమ్మెల్యే చంద్రావతి అరెస్ట్
ఏన్కూరు న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బాణోతు చంద్రావతిని ఏన్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 11న ఏన్కూరులో మంత్రి రాంరెడ్డి భూపట్టాలు పంపిణీ చేసిన సందర్భంగా లబ్ధిదారులకు సరైన సౌకర్యాలు కల్పించ లేదని ఎమ్మెల్యే రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కల్పించారని ఎమ్మెల్యేతో సహా పలువురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఎమ్మెల్యేను అరెస్టు చేసి అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. -
సైకిలెక్కనున్న కామ్రేడ్ చంద్రావతి?
వైరా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీపీఐ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడం వల్లే ఎర్రజెండాను విడిచిపెట్టాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆమె సన్నాహాలు చేసుకుంటున్నారని అక్కడి పార్టీ వర్గాలు అంటున్నాయి. గత అసెంబ్లీలో మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి చంద్రావతికి శ్రీమంతం చేయడం, తర్వాత ఆమె పండంటి బిడ్డను తీసుకుని అసెంబ్లీకి రావడం కూడా తెలిసిందే. అప్పట్లో అసెంబ్లీకి వచ్చిన అతి బుల్లి అతిథిగా చంద్రావతి కొడుకు రికార్డు సృష్టించాడు.