నోటిఫికేషన్లకు... కోరం ఉండాల్సిందే | TSPSC Chairman And Members Tenure Over On 17th | Sakshi
Sakshi News home page

నోటిఫికేషన్లకు... కోరం ఉండాల్సిందే

Published Tue, Dec 15 2020 12:54 AM | Last Updated on Tue, Dec 15 2020 8:18 AM

TSPSC Chairman And Members Tenure Over On 17th - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో కోరం నిబంధనతో వీలైనంత త్వరగా కొత్త నియామకాలను చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టీఎస్‌పీఎస్సీ ప్రస్తుత చైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రీల ఆరేళ్ల పదవీకాలం ఈనెల 17తో ముగియనుంది. ఆ తర్వాత కమిషన్‌లో కేవలం ఇద్దరు సభ్యులు... కృష్ణారెడ్డి, సాయిలు మాత్రమే కొనసాగనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల జారీకి టీఎస్‌పీఎస్సీలో కోరం ఉండాల్సిందే. కమిషన్‌ చైర్మన్‌తో పాటు కనీసం ముగ్గురు సభ్యులు ఉండాలి. కానీ ఈ నెల 17 తర్వాత కమిషన్‌లో ఇద్దరే మిగులుతారు. కాబట్టి కొత్త చైర్మన్‌తో పాటు కనీసం ఒక సభ్యుడిని ప్రభుత్వం వీలైనంత త్వరగా నియమిస్తేనే ఉద్యోగ ప్రకటనల జారీకి ఇబ్బందులు ఉండవు.

రాజ్యాంగం ప్రకారం చైర్మన్, సభ్యుల కాలపరిమితి పెంచే అవకాశం లేకపోవడంతో కొత్త నియామకాలు అనివార్యం కానున్నాయి. అదేవిధంగా ప్రస్తుత కమిషన్‌లో ఈనెల 17 తర్వాత మిగిలే ఇద్దరు సభ్యుల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఒకరి, అక్టోబర్‌లో మరొకరి పదవీ కాలం ముగుస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా ఉన్న ఖాళీలు, ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదివారం ఆదేశించిన సంగతి తెలిసిందే. మంజూరైన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీల లెక్కలను తీసే పనిలో వివిధ ప్రభుత్వశాఖలు ఉన్నాయి. ఖాళీల లెక్క తేలాక ప్రభుత్వం వీటి భర్తీకి ఇండెంట్లు ఇస్తే వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. 

పదవీ విరమణ ఉత్తర్వులు జారీ
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, బి.చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రీ ఈ నెల 17న పదవీ విరమణ చేస్తారని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారంఉత్తర్వులు జారీ చేశారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement