
సైకిలెక్కనున్న కామ్రేడ్ చంద్రావతి?
వైరా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీపీఐ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి.. ఆ పార్టీకి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడం వల్లే ఎర్రజెండాను విడిచిపెట్టాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆమె సన్నాహాలు చేసుకుంటున్నారని అక్కడి పార్టీ వర్గాలు అంటున్నాయి.
గత అసెంబ్లీలో మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి చంద్రావతికి శ్రీమంతం చేయడం, తర్వాత ఆమె పండంటి బిడ్డను తీసుకుని అసెంబ్లీకి రావడం కూడా తెలిసిందే. అప్పట్లో అసెంబ్లీకి వచ్చిన అతి బుల్లి అతిథిగా చంద్రావతి కొడుకు రికార్డు సృష్టించాడు.