మన దేశంలో లోక్‌సభ ఎంపీగా, అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రాజ్యాంగం నిర్దేశించిన కనీస వయసు 25 సంవత్సరాలు. అయితే 25 ఏళ్లకే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి పలువురు రికార్డు సృష్టించారు.
25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా..: 2009లో ఆంధప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున గెలిచిన బాణోతు చంద్రావతి వయసు అప్పటికి 25 ఏళ్లు మాత్రమే. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమె విశాఖలో మెడిసిన్ ఫైనలియర్ పూర్తి చేశారు. తాత బీక్యానాయక్ సీపీఐలో చురుకుగా పనిచేసేవారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. దీంతో చంద్రావతికి టికెట్ దక్కింది.
చిన్న వయసులోనే మంత్రిగా సుష్మా స్వరాజ్ రికార్డు..: చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో సుష్మా స్వరాజ్ ఒకరు. ఆమె 1977లో 25 ఏళ్ల వయసులోనే హరియాణా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే 25 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టారు. 1962లో రాజస్తాన్‌లోని బార్మర్ నుంచి ఉమేద్‌సింగ్ , 2012లో ఉత్తరప్రదేశ్‌లోని సదర్ నియోజకవర్గం నుంచి అరుణ్ వర్మ 25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
29 ఏళ్లకే సీఎంగా..: దేశంలో అతిచిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించింది ఎం.ఓ.హసన్ ఫరూక్ మరికర్. 1967లో 29 ఏళ్లకే ఆయన పుదుచ్చేరి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రేమ్ ఖండూ 36 ఏళ్లకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, హేమంత్ సోరెన్ 37 ఏళ్లకు జార్ఖండ్ సీఎంగా, అఖిలేశ్ యాదవ్ 38 ఏళ్లకే యూపీ సీఎంగా పనిచేశారు.
చిన్నవయసులోనే ఎంపీగా దుష్యంత్..: దేశంలో అతిపిన్న వయసులో ఎంపీగా గెలుపొందిన ఘనత దుష్యంత్ చౌతాలాకు దక్కింది. ఐఎన్‌ఎల్డీ నుంచి 2014లో హరియాణాలోని హిసార్ నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్‌పై గెలుపొందారు. ఎంపీ అయ్యేనాటికి వయసు 25 ఏళ్లు మాత్రమే. దుష్యంత్ మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు కాగా.. హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు మనువడు.
ఉంగాండా నుంచి 19 ఏళ్లకే ఎంపీ..: ప్రపంచంలోనే అతి పిన్న వయసుగల ఎంపీని ఎన్నుకున్న ఘనత ఆఫ్రికా దేశమైన ఉగాండాకు దక్కింది. ఉగాండాకు చెందిన ప్రోస్కోవియా ఓరోమయిట్ హైస్కూలు పూర్తవుతూనే నేరుగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించేనాటికి ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే.
31 ఏళ్లకే దేశ ప్రధానిగా..: చిన్న వయసులోనే ఒక దేశాధినేతగా ఎన్నికై సెబాస్టియన్ కర్జ్ రికార్డు సృష్టించారు. 2017 డిసెంబర్‌లో 31 ఏళ్లకే ఆయన ఆస్ట్రియా చాన్సలర్ పదవిని అధిష్టించారు.
– సాక్షి, ఎలక్షన్ డెస్క్
చిన్న వయసులోనే.. పెద్ద రికార్డు
Published Thu, Mar 14 2019 10:41 AM | Last Updated on Thu, Mar 14 2019 11:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment