Lok Sabha Election 2018
-
ఉద్యోగుల చూపు బీజేపీ వైపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకే అత్యధికంగా పోస్టల్ ఓట్లు లభించాయి. తర్వాతి స్థానంలో ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థులకు లభించగా, మూడో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చినట్లు కౌంటింగ్ లెక్కల్లో తేలింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 17,319 మంది ఉద్యోగులు పోస్టల్ ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. వారిలో 6,196 మంది ఉద్యోగులు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేశారు. అంటే 35.77 శాత మంది ఉద్యోగులు బీజేపీ అభ్యర్థులకు ఓటేశారు. ఇక 5,162 మంది ఉద్యోగులు (29.8 శాతం) కాంగ్రెస్ అభ్యర్థులకు పోస్టల్ ఓట్లు వేయగా, 4,718 మంది ఉద్యోగులు (27.24 శాతం) టీఆర్ఎస్కు వేశారు. మిగతా వారు ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీ, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు వేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో చాలా తక్కువ మంది ఉద్యోగులు పోస్టల్ ఓట్లను ఉపయోగించుకున్నారు. పోలింగ్ సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల్లో దాదాపు 55 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో 17,319 మంది మాత్రమే వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిషన్ లెక్కలు తేల్చింది. -
మోదీ ప్రధాని కావాలని గేదెలకు పూజ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ తమిళనాడులో ఓ వ్యక్తి గేదెలతో యాగం, పూజలు నిర్వహించాడు. తూత్తుకూడి జిల్లా వల్లనాడులో నారాయణన్ అనే వ్యక్తి గోశాలను నిర్వహిస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ ఈ గోశాలలో ఇటీవల రహస్యంగా ప్రత్యేక యాగం నిర్వహించారు. గోశాలలోని 21 గేదెలకు 15 మంది వేదపండితులు నాలుగుగంటలపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఒక గేదె కాలికి బంగారు గొలుసు అలంకరించి ప్రత్యేక యాగం నిర్వహించారు. గోప్యంగా జరిగిన ఈ యాగానికి మోదీ ప్రతినిధిగా హాజరైన వ్యక్తి మాత్రమే ఫొటోలు తీయగా, మిగిలిన ఎవ్వరూ సెల్‌ఫోన్ తీసుకురాకుండా కట్టుదిట్టం చేశారని సమాచారం. -
ఇక ‘ఫ్యాన్’ కింద మాట్లాడుకుందాం: లోకేశ్
తాడేపల్లి రూరల్ (మంగళగిరి)/అమరావతి బ్యూరో: ‘ఇక నుంచి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మా ఇంట్లో ‘ఫ్యాన్’ కింద కూర్చుని చల్లగా కబుర్లు చెప్పుకుందాం. మీరెవరూ అధైర్యపడొద్దు’.. అంటూ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. మంగళగిరి రత్నాలచెరువులో శనివారం నిర్వహించిన సభలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇటీవల కూడా ఏప్రిల్ 11కు బదులు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ లోకేశ్ ప్రచారం చేశారు. నూతక్కిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ మార్చి 23న ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామడంతో అంతా విస్తుపోయారు. అలాగే దేశంలో 29 రాష్ట్రాలకు బదులు 28 రాష్ట్రాలని అనడంతో ఆయన వెంట ఉన్నవారు కంగుతిన్నారు. మరోవైపు లోకేశ్ తరపున సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నా తప్పుల తడకగా మాట్లాడుతుండటంతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. -
చిన్న వయసులోనే.. పెద్ద రికార్డు
మన దేశంలో లోక్‌సభ ఎంపీగా, అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రాజ్యాంగం నిర్దేశించిన కనీస వయసు 25 సంవత్సరాలు. అయితే 25 ఏళ్లకే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి పలువురు రికార్డు సృష్టించారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా..: 2009లో ఆంధప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున గెలిచిన బాణోతు చంద్రావతి వయసు అప్పటికి 25 ఏళ్లు మాత్రమే. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమె విశాఖలో మెడిసిన్ ఫైనలియర్ పూర్తి చేశారు. తాత బీక్యానాయక్ సీపీఐలో చురుకుగా పనిచేసేవారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. దీంతో చంద్రావతికి టికెట్ దక్కింది. చిన్న వయసులోనే మంత్రిగా సుష్మా స్వరాజ్ రికార్డు..: చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో సుష్మా స్వరాజ్ ఒకరు. ఆమె 1977లో 25 ఏళ్ల వయసులోనే హరియాణా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే 25 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టారు. 1962లో రాజస్తాన్‌లోని బార్మర్ నుంచి ఉమేద్‌సింగ్ , 2012లో ఉత్తరప్రదేశ్‌లోని సదర్ నియోజకవర్గం నుంచి అరుణ్ వర్మ 25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 29 ఏళ్లకే సీఎంగా..: దేశంలో అతిచిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించింది ఎం.ఓ.హసన్ ఫరూక్ మరికర్. 1967లో 29 ఏళ్లకే ఆయన పుదుచ్చేరి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రేమ్ ఖండూ 36 ఏళ్లకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, హేమంత్ సోరెన్ 37 ఏళ్లకు జార్ఖండ్ సీఎంగా, అఖిలేశ్ యాదవ్ 38 ఏళ్లకే యూపీ సీఎంగా పనిచేశారు. చిన్నవయసులోనే ఎంపీగా దుష్యంత్..: దేశంలో అతిపిన్న వయసులో ఎంపీగా గెలుపొందిన ఘనత దుష్యంత్ చౌతాలాకు దక్కింది. ఐఎన్ఎల్డీ నుంచి 2014లో హరియాణాలోని హిసార్ నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్‌పై గెలుపొందారు. ఎంపీ అయ్యేనాటికి వయసు 25 ఏళ్లు మాత్రమే. దుష్యంత్ మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు కాగా.. హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు మనువడు. ఉంగాండా నుంచి 19 ఏళ్లకే ఎంపీ..: ప్రపంచంలోనే అతి పిన్న వయసుగల ఎంపీని ఎన్నుకున్న ఘనత ఆఫ్రికా దేశమైన ఉగాండాకు దక్కింది. ఉగాండాకు చెందిన ప్రోస్కోవియా ఓరోమయిట్ హైస్కూలు పూర్తవుతూనే నేరుగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించేనాటికి ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. 31 ఏళ్లకే దేశ ప్రధానిగా..: చిన్న వయసులోనే ఒక దేశాధినేతగా ఎన్నికై సెబాస్టియన్ కర్జ్ రికార్డు సృష్టించారు. 2017 డిసెంబర్లో 31 ఏళ్లకే ఆయన ఆస్ట్రియా చాన్సలర్ పదవిని అధిష్టించారు. – సాక్షి, ఎలక్షన్ డెస్క్