సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికలకు తెరలేచింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయింది. అయినా, జిల్లాలోని కొన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో పొత్తులపై స్పష్టత రాకపోవడంతో అంతా గందరగోళం నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలతో పాటు ఆ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటాయని భావిస్తున్న సీపీఐ, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల్లో సందిగ్ధత నెలకొంది. పొత్తుల అంశాన్ని ఆయా పార్టీల అగ్రనాయకత్వాలు ఎటూ తేల్చకుండా నాన్చుతుండడం జిల్లాలోని పార్టీల శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది.
అసలు పొత్తు ఉంటుందా? ఉంటే ఏ పార్టీతో ఉంటుంది? పొత్తు కుదిరితే ఎన్ని స్థానాలు దక్కుతాయి? ఏ స్థానాలు ఉంటాయి... పోతాయి? అభ్యర్థులు మారుతారా? అసలు పోటీచేసే అవకాశం ఉంటుందా ఉండదా? ఎంపీగా ఎవరు? ఎమ్మెల్యేగా ఎవరు? అనే అంశాల్లో ఎక్కడా స్పష్టత రాకపోవడంతో జిల్లాలోని రాజకీయ పక్షాలు ఆందోళనచెందుతున్నాయి. అసలు ఇంతవరకు సీపీఐ మినహా ఈ పార్టీల తరఫున ఒక్క అభ్యర్థిని కూడా ఎవరూ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.
అధికారపార్టీతోనే చిక్కు
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి ఇతర రాజకీయ పక్షాలకు పెద్ద తలనొప్పినే తెచ్చిపెడుతోంది. ఆ పార్టీ టీఆర్‌ఎస్‌తో జట్టు కడుతుందని తొలుత భావించారు. సీపీఐ కూడా ఆరెండు పార్టీలతో కలుస్తుందని, మూడు పార్టీలు కలిసి జేఏసీ సహకారంతో ఎన్నికల బరిలోకి దిగుతాయని జిల్లా నాయకులు భావించారు. ఇదే జరిగితే ఏ స్థానంలో ఎవరు పోటీచేస్తారనే దానిపై ఓ అంచనాకు కూడా వచ్చారు. కానీ సీన్ మారిపోయింది. టీఆర్‌ఎస్ కలిసి రాని నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ మధ్యే పొత్తు ఉంటుందని జిల్లా రాజకీయ వర్గాలు ఓ నిర్ధారణకు వచ్చాయి.
అదే తరహాలో ఇరుపార్టీల అగ్రనాయకుల మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ ఏదీ తేలడం లేదు. సీపీఐకి తెలంగాణలో ఇచ్చే పార్లమెంటు, శాసనసభ స్థానాల విషయంలో కాంగ్రెస్ నాయకత్వం రోజుకో మాట చెపుతుండడంతో గందరగోళం ఏర్పడింది. 20 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు అడిగిన సీపీఐ చివరకు ఒక పార్లమెంటు, 12 అసెంబ్లీ స్థానాలకు దిగివచ్చింది. అయినా, కాంగ్రెస్ నేతలు మెలికలు పెడుతుండడంతో చివరకు 8 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకునేందుకు కూడా సిద్ధమయింది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో తాము అడుగుతున్న కొత్తగూడెం, వైరా, పినపాక అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా వస్తాయా? లేదా కోత పడుతుందా అనేది సీపీఐ నాయకత్వం తేల్చుకోలేకపోతోంది.
ఒకానొక దశలో అసలు కాంగ్రెస్‌తో పొత్తు కుదిరే అవకాశం లేదని చెపుతుండడం కూడా ఆ పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతోంది. ఇదే అంశంలో కాంగ్రెస్ నేతలు కూడా కంగాళీలోనే ఉన్నారు. సీపీఐతో పొత్తు ఉంటే పినపాక పోతుందా? కొత్తగూడెం కూడా ఇవ్వాల్సి వస్తుందా అనేది తేలక వారు సతమతమవుతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ సీపీఐకి ఇవ్వాల్సి వస్తే ఖమ్మం అభ్యర్థి ఎవరన్నది తేలడం లేదు. మళ్లీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు అంశం తాజాగా తెరపైకి రావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఆమూడు పార్టీల నాయకత్వాలున్నాయి.
టీడీపీతో తంటానే
టీడీపీ, బీజేపీల వ్యవహారం కూడా ఒకింత గందరగోళంగానే ఉంది. జిల్లాలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నా తమకేమీ నష్టం లేదని, అన్ని స్థానాల్లో తామే పోటీ చేస్తాం కనుక బీజేపీ, సంఘ్ ఓట్లన్నీ తమకు అదనం అవుతాయని టీడీపీ నేతలు భావించారు. అయితే, బీజేపీ అగ్రనాయకత్వంతో టీడీపీ నేతలు జరుపుతున్న చర్చలు రోజుకో విధంగా మారుతున్నాయి. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే 45 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సిద్ధపడడంతో ఆ జాబితాలో జిల్లా నుంచి ఒక్క అసెంబ్లీ అయినా ఉంటుందనే ప్రచారం తెలుగుతమ్ముళ్లకు నిద్రపట్టనివ్వడం లేదు. ఏ నియోజకవర్గంలో తమకు ఎసరు వస్తుందో అనే మీమాంసలో వారున్నారు. మరోవైపు జిల్లాలో పెద్దగా బలం లేని కమలనాథులు కూడా టీడీపీతో పొత్తుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క స్థానం కూడా తమకివ్వనప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎందుకని, అదే ఒంటరిగా ఉంటే వీలున్న చోట్ల పోటీచేసి తమ బలమేంటో చూపిస్తామని ఆ పార్టీ నేతలంటున్నారు. ఒవైపు నరేంద్రమోడి హవా, మరోవైపు తెలంగాణవాదం నేపథ్యంలో తాము కూడా తీసిపోని విధంగానే ఉన్నామని అంటున్నా... వారికి టీడీపీతో పొత్తులో ఒక్కస్థానం కూడా ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఇచ్చినా తమకు ఇష్టం లేని స్థానం ఇస్తారేమోననే సందేహం బీజేపీ నాయకులకు నిద్రపట్టనివ్వడం లేదు. మొత్తం మీద ఎన్నికల వేళ రాజకీయ పొత్తులు జిల్లాలోని కొన్ని రాజకీయ పక్షాలను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాల్సిందే.
పొత్తుల కంగాళీ!
Published Thu, Apr 3 2014 2:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement