వైరా : కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు మళ్లీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా శుక్రవారం నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌ఓలు) ఇంటింటికి వె ళ్లి ఓటర్ల జాబితా సవరణ, బోగస్ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన యువతను ఓటు హక్కు నమోదు చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
అలాగే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి తనిఖీ నిర్వహించనున్నారు. ఈ తనిఖీలో అధికారులు ఓటర్ల జాబితా సవరణ, వలసలు వెళ్లిన వారి పేర్ల తొలగింపు, డబుల్ ఓటరు కార్డుల తొలగింపు మరణించిన వారి పేర్ల తొలగింపు తదితర వివరాలు నమోదు చేయనున్నారు. జిల్లాలో 20,17,511 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 9,97,366 మంది, స్త్రీలు 10,19,538 మంది ఓటర్లు ఉండగా ఇతరులు 126, సర్వీసు ఓటర్లు 481 మంది ఓటర్లు ఉన్నారు.
15 రోజుల్లో తనిఖీలు పూర్తి....
నేటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ తనిఖీ నిర్వహించనున్నారు. అనంతరం ఆ వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయనున్నారు. మార్పులు చేసిన జాబితాలను నవంబర్ నెలాఖరున ప్రకటించనున్నారు. ఆ జాబితాలో పేర్లు లేని వ్యక్తులు ఓటర్లుగా నమోదు చేయించుకోవడం కోసం డిసెంబర్ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి. ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత ఓటరు నమోదు చేసుకునేందుకు కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ వరకు నిర్వహిస్తారు. 2015 జనవరి 25న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు.
నేటి నుంచి ఓటరు జాబితా సవరణ
Published Fri, Sep 26 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM
Advertisement