బాబు కాలం.. గుండెకోత
ఆ చీకటి రోజులు మరిచిపోయేవి కావు. ఆ చేదు జ్ఞాపకాలు చేరిపేసుకునేవి కావు. టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనపై ఎవరిని కదిలించినా కన్నీటి ధారలే. ఆరుగాలం శ్రమించి.. అందరికీ పట్టెడన్నం పెట్టే రైతన్నకు పచ్చడి మెతుకులు దొరకని దయనీయ రోజులు ఇప్పటికీ కళ్ల ముందు మెదలుతున్నాయి. దాగుడుమూతలను తలపించే కరెంటు కోతలు.. బిల్లులు కట్టలేక అవస్థలు.. విద్యుత్ అధికారుల వేధింపులు.. వెరసి రైతన్నకు గుండె‘కోత’. కాడి వదిలేసిన రైతులు.. జీవనోపాధి కోసం పిల్లాపాపలతో ఉన్న ఊరుకు దూరమైన ఘటనలు కోకొల్లలు. రైతన్నకు ఇప్పుడు సమయం వచ్చింది.. చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది.
భయం భయంగా బతికేటోళ్లం
చంద్రబాబు నాయుడు పాలన తలుచుకుంటేనే భయమేస్తుంది. కరెంటు కష్టాలు చెప్పనలవి కావు. విత్తనం వేసింది మొదలు అన్నీ సమస్యలే. విద్యుత్ బిల్లులు కట్టలేకపోయేటోళ్లం. అధికారులు ఎప్పుడొచ్చి కనెక్షన్ తొలగిస్తారోనని చస్తూ బతకాల్సి వచ్చేది. అప్పులు తీర్చడమే కష్టమనుకుంటే.. కరెంటు కష్టాలు తడిసి మోపెడయ్యేవి. రాజన్న పాలన మళ్లీ రావాలి. రైతుల కష్టమెరిగిన నేత ఆయన.
- వెళువలి వెంకటరమణ, రుద్రవరం
గుండె తరుక్కుపోయేది
కరెంటు కోతలతో బోరు బావుల కింద పంటలు ఎండిపోతుంటే గుండె తరుక్కుపోయేది. నాకు మూడెకరాల పొలం ఉంటే.. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ, సీడు జొన్న, వరి పైర్లు సాగు చేస్తుంటి. బోరు కింద సాగు కావడంతో కరెంటుపైనే ఆధారం. చంద్రబాబు రైతులను పట్టించుకోకపోవడంతో కరెంటు ఎప్పుడొస్తుందో తెలియక పడిన అవస్థలు అన్నీఇన్నీ కావు.
- మొర్సు వెంకట క్రిష్ణయ్య, రుద్రరవం
సంవత్సరం బిల్లు రూ.7,200
కరెంటు బిల్లు తులుచుకుంటేనే గుండె ఆగినంత పనైతుండె. నాకు ఐదెకరాల పొలం ఉంటే.. బో రుకు 7 హెచ్‌పీ మోటారు బిగించినా. సంవత్సరానికి రూ.7,200ల కరెంటు బిల్లు వస్తుంటే ఎట్ల కట్టినానో దేవుడికెరుక. చంద్రబాబు యానాడు ఆదుకోలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఉచిత విద్యుత్ ఇవ్వడంతో వ్యవసాయం చేసేందుకు గుండె ధైర్యం వచ్చింది.
- ఆవుల చంద్రశేఖర్‌రెడ్డి, సర్వాయిపల్లె
మోటార్లు ఎత్తుకెళ్తుండ్రి
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ అధికారులు ఇష్టానుసారం చేస్తుండ్రి. ఆరు ఎకరాల పొలంలో వరి, జొన్న, మిరప పంటలు సాగు చేస్తుంటి. 10 హెచ్‌పీ మోటార్‌కు ఏడాదికి రూ.10 వేల బిల్లు కడుతుంటి. ఎప్పుడైనా కట్టలేకపోతే మోటారు ఎత్తుకెళ్లిపోతుండ్రి. రైతుల కష్టం తెలియని ఆ నేత పాలన తలుచుకుంటేనే భయమైతాది. రాజన్న పాలన మళ్లీ వస్తే బాగుంటాది.
- బుడ్డయ్యగారి చంద్రశేఖర్‌రెడ్డి, ఉయ్యాలవాడ
బాబు రైతులకు ఏమీ సేయలేదు
రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు రైతులను యానాడు పట్టించుకోలేదు. బోరు బావుల కింద వ్యవసాయమంటే రైతులకు చుక్కలు కనిపించేవి. కరెంటు ఎప్పుడొస్తాదోనని బోర్ల కాడ రాత్రంతా కాపలా కాయాల్సి వస్తుండె. కరెంటు బిల్లులు నెలానెలా కట్టాలంటే అప్పులు సేసుకుని బతికే రైతులకు ఎట్టా సాధ్యమైతాది. ఉచిత విద్యుత్ అందించిన వైఎస్ దేవుడు.
- లింగారెడ్డి, నగరడోణ
అప్పుల కుప్పలే
చంద్రబాబు పాలనలో తొమ్మిదేళ్లు అప్పుల కుప్పలే మిగిలినయి. మూడు ఎకరాల్లో బోరు కింద చీని పంట సాగు చేస్తుంటి. కరెంటు బిల్లులు కట్టనీక తలకిందులైతుంటి. పంట కూడా అంతంత మాత్రమే వస్తుండె. గిట్టుబాటు ధర లేక మా కష్టాలు దేవునికెరుక. మా బాధల్లో మేముంటే కరెంటోళ్లు బిల్లుల కోసం ఇళ్ల కాడికొచ్చి నానా రభస చేస్తుండ్రి. వైఎస్ పాలనలో బతుకు కుదుట పడింది.
- యల్లారెడ్డి, లాల్‌మాన్‌పల్లె
కష్టాలతో సావాసం
ఐదు ఎకరాల పొలంలో పత్తి, పూల తోటలు సాగు చేస్తుంటి. వర్షాలు అంతంత మాత్రమే కురుస్తుండె. కరెంటు కోతలు అబ్బో సానా ఉంటుండె. మోటార్ల కాడ కాపలా కాస్తుంటిమి. బిల్లేమో వేలల్లో.. ఎట్లా కట్టాల్నో తెలక సచ్చిపోతుంటిమి. వ్యవసాయం మానుకోలేక.. అట్లని పొలంలోకి దిగలేక రైతులు ఎదుర్కొన్న అవస్థలు ఒకటా రెండా. ఎన్నికల్లో ఆయన సెప్పేవి నమ్మితే మళ్లీ కష్టాలే.
- బడేసాహెబ్, టి.గోకులపాడు
హేళన చేస్తుండ్రి
కరెంటు బిల్లులు కట్టకపోతే అధికారులు ఇండ్ల కాటికొచ్చి హేళన చేస్తుండ్రి. చంద్రబాబు పాలనంతా నరకంలా సాగిపాయె. పొలం కాడికి పోవాలంటే కరెంటోళ్లు వస్తారేమోనని దాక్కుంటుంటిమి. చేసుకుంటే తినాల.. ల్యాకుంటే ఉపసాముండేటోళ్లం. అలాంటి మా మీద జులుం చేస్తే ఎవరికి సెప్పుకోవాల. వైఎస్ ఒక్కరే మమ్మల్ని అర్థం సేసుకున్యారు. ఆయన పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నా.
- వెంకటేష్, ఊటకొండ
కనెక్షన్ తొలగించిండ్రి
మూడు ఎకరాల్లో బోరు కింద వ్యవసాయం చేస్తుంటి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు లేక పంటలు సరిగా పండుతుండ్ల్యా. బోర్లలో నీళ్లు ఇంకిపోయి వ్యవసాయం చేయాలంటే కష్టమైతుండె. కరెంటు బిల్లు నెలకు రూ.300 వస్తుంటే కట్టనీక అప్పులు చేస్తుంటి. ఒకసారి బిల్లు కట్టేది లేటైతే కరెంటోళ్లు కనెక్షన్ కట్ చేసిండ్రి. చంద్రబాబు పేరు వింటేనే భయమేస్తాది.
- హనుమంతు, దొడ్డనగేరి
అప్పులు చేసి కట్టినా
కరెంటు బిల్లు కట్టనీక అప్పులు సేస్తుంటి. ఇల్లు గడవటమే కస్టంగుంటే బిల్లు ఎట్లా కడతామని చంద్రబాబు ఆలోచించల్యా. రైతులు బాగుంటేనే కదా పంటలు బాగా పండించేది. కరువు కాలంల ఆయన యానాడు నేనున్నానని సెప్పలేదు. కరెంటోళ్లు ఏపుకు తింటుండ్రి. నాలుగు ఎకరాల పొలం బోరు కింద సాగు చేయనీక రూ.40వేలు అప్పు సేసుకునింటి. మా బతుకు నరకంగుండె.
- సలాం, సాంబగల్