మూడేళ్లలో ఇంటింటికీ నీళ్లు | water in the house for three years | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో ఇంటింటికీ నీళ్లు

Published Fri, Mar 18 2016 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

మూడేళ్లలో ఇంటింటికీ నీళ్లు

మూడేళ్లలో ఇంటింటికీ నీళ్లు

శాసనసభలో మంత్రి కె.తారకరామారావు వెల్లడి
మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్ల వరకు ఖర్చు
ఇప్పటికే నాబార్డు, హడ్కోల నుంచి రూ. 20 వేల కోట్ల రుణం
అవసరమైతే జైకా లాంటి అంతర్జాతీయ సంస్థల తలుపుతడతాం

 
హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా ఇంటింటికీ రక్షిత తాగునీటిని అం దించే మిషన్ భగీరథ ప్రాజెక్టును 2018-19 చివరి నాటికి 99 శాతం గ్రామాలకు చేరుస్తామని ప్రభుత్వం శాసనసభలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో 24,224 గ్రామాలకు నీరందించే లక్ష్యంతో అనుకున్న సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి 6,100 గ్రామాలు, 2017-18 చివరికల్లా 15,872 గ్రామాలు, 2018-19 నాటికి 22వేల పైచిలుకు గ్రామాల్లో ఇంటింటికీ రక్షిత తాగునీటిని అందిస్తామని, మిగతా గ్రామాలకూ అప్పటికల్లా నీటిని అందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేసింది. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మిషన్ భగీరథపై సభ్యులు పుట్ట మధు, గాదరి కిశోర్ కుమార్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అజ్మీరా రేఖ, సున్నం రాజయ్య, డాక్టర్ కె.లక్ష్మణ్‌లు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ మేరకు బదులిచ్చారు. మొదటి దశ పనులు పురోగతిలో ఉన్నాయని, రెండో దశ పనులను కూడా ప్రారంభించామన్నారు.

జలమండలి ఆధ్వర్యంలో గోదావరి పైపులైను ద్వారా నికరమైన నీటి సరఫరాపై ఆధారపడి రూపొందించిన నాలుగు ప్యాకేజీలలో పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. మొదటి దశలో మేడ్చల్, కుత్బుల్లాపూర్‌లోని కొంత భాగం, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, భువనగిరి, ఆలేరు, నకిరేకల్‌లోని కొంత భాగం, తుంగతుర్తిలోని కొంత భాగం, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తిల్లోని కొన్ని భాగాలకు నీటి కనెక్షన్లను సమకూర్చాలని ప్రతిపాదించినట్లు మంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ భాగస్వామ్యం ఉందని, వారి నియోజకవర్గాల్లో ప్రాజెక్టు తీరును వివరించే బుక్‌లెట్లను ఈ సమావేశాల్లోనే అందజేస్తామని కేటీఆర్ చెప్పారు. స్థానికంగా సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులు సకాలంలో జరిగేలా చూడాలని సూచించారు.

పథకాన్ని కేంద్రం మెచ్చుకున్నా..
నిధుల సమీకరణ, తదుపరి నిర్వహణ ఖర్చుల ప్రణాళికపై బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నలకు కేటీఆర్ విపులంగా జవాబిచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బీరేంద్రసింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రాజెక్టును సమీక్షించారని, పథకాన్ని పలువురు కేంద్ర మంత్రులు అభినందించటమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేస్తే బాగుంటుందన్నారని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలన్న తన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు ఎలాంటి సహకారం అందలేదన్నారు. ఈ పథకానికి రూ. 36,976.54 కోట్లు అవసరమని, అది రూ. 40 వేల కోట్లకు కూడా చేరుకునే అవకాశం ఉందని, ఇప్పటికే నాబార్డు, హడ్కోల నుంచి రూ. 20 వేల కోట్ల రుణం కోసం కమిట్‌మెంట్ వచ్చిందని కేటీఆర్ సభకు చెప్పారు. ఈ నిధులతో 70 శాతం పనులు పూర్తి చేస్తామన్నారు. ఎస్‌బీఐ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులతోనూ రుణ చర్చలు సాగుతున్నాయన్నారు. జైకా లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.
 
పన్నులతోనే ప్రాజెక్టు నిర్వహణ
మంచినీటి కోసం గ్రామ పంచాయతీలు పన్నులు చెల్లిస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ ఈ పన్నులను పక్కాగా వసూలు చేసి ఆ మొత్తంతోనే నీటి సరఫరా ఖర్చును భరిస్తామన్నారు. మెరుగైన సేవలందిస్తే పన్నులు పక్కాగా చెల్లించేందుకు ప్రజలు ముందుకొస్తారని, గుజరాత్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నీటి కమిటీలు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్న తరహాలో రాష్ట్రంలోనూ నీటి సంఘాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. పథకాన్ని నిర్వహించేందుకు గ్రామ పంచాయతీల్లో రూ. 875 కోట్లు, పట్టణాల్లో రూ. 900 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement