పేదల వంటనూనెకు మంగళం
- ఇక పామాయిల్ లేనట్లే..
- ఏడాదిన్నర నుంచి ఇదేతంతు....
- రేషన్ షాపుల్లో ప్రైవేట్ బ్రాండ్ల విక్రయం
- పట్టని పౌరసరఫరాల శాఖ
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే పేదల వంట నూనె (పామాయిల్)కు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పామాయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఏడాదిన్నర కాలంగా పామాయిల్ కోటా కేటాయింపు లేక పోవడంతో రేషన్ షాపుల్లో ప్రైవేట్ బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో డీలర్లు బహిరంగంగా ప్రైవేట్ బ్రాండ్ పామాయిల్ ప్యాకెట్లను లబ్ధిదారులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు.
నిరుపేదలకు దూరమే..
నిరుపేదలకు పామాయిల్ దూరమైంది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో ప్రతీ నెల సుమారు 20.29 లక్షల లీటర్ల పామాయిల్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం అసలు కేటాయింపులే లేకుండా పోయాయి. గతంలో పామాయిల్ కోసం డీలర్లు డీడీలు చెల్లించినా పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోవడంతో వారి డబ్బు ప్రభుత్వం వద్ద పెండింగ్లో పడిపోయింది. అసలు కేటాయింపులు లేకపోవడంతో డీలర్లు పామాయిల్ కోసం డీడీలు చెల్లించడం మానేశారు. దీంతో ప్రభుత్వ పామాయిల్ అడ్రస్ లేకుండా పోయింది.
భగ్గుమంటున్న వంట నూనె ధరలు...
బహిరంగ మార్కెట్లో వంట నూనె ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కనీసం లీటర్ నూనె ధర రూ.85 నుంచి 95ల వరకు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధరకు రెక్కలు రావడంతో మార్కెట్లో పామాయిల్ ధర రూ.58 నుంచి 65 వరకు పెరిగింది. గతంలో చౌకధరల దుకాణాల ద్వారా లీటరు రూ.40లకు లభించేది. బహిరంగ మార్కెట్లో మంచి నూనె ధరలు మండిపోతుండటంతో లబ్ధిదారులు పామాయిల్ కోసం గగ్గోలు పెడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. డీలర్లు ప్రైవేట్ బాండ్లను లబ్ధిదారులకు అంటగట్టి లీటర్కు రూ.65 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.