Government mental hospital
-
అతని కడుపులో 452 వస్తువులు..
అహ్మదాబాద్ : కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అతని కడుపులో నుంచి 3.5 కిలోల బరువున్న 452 లోహ వస్తువులను వైద్యులు వెలికి తీశారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‌కు ఈ నెల 8వ తేదీన కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో అక్కడి సిబ్బంది అతన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ తొలుత ఎక్స్-రే నిర్వహించిన వైద్యులు.. అతని కుడి శ్వాసకోశంలో ఓ పిన్ చిక్కుకున్నట్టు గుర్తించి దాన్ని తొలగించారు. అయితే దాని తర్వాత తనకు తీవ్రమైన కడుపు నొప్పిగా ఉందని సదురు పేషెంట్ వైద్యులకు తెలిపాడు. దీంతో వైద్యులు అతనికి పూర్తి ఎక్స్-రే నిర్వహించారు. కడుపులో భారీగా వస్తువులు ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే అతన్ని ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. అక్కడ నలుగురు వైద్యులు బృందం రెండున్నర గంటల పాటు శ్రమించి అతనికి శస్త్ర చికిత్స పూర్తి చేసింది. అతని కడుపులో నుంచి మొత్తం 3.5 కిలోల బరువున్న పలు లోహ వస్తువులను వైద్యులు బయటకు తీశారు. అందులో కాయిన్స్, బోల్టులు, బ్లెడ్ ముక్కలు, ఒక నెల్ కట్టర్, ఒక స్పార్క్ ప్లగ్, ఒక లాకెట్ కూడా ఉన్నాయి. ఇలా మొత్తం 452 లోహ వస్తువులను బయటికి తీసినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం రోగిను వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని.. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వారు పేర్కొన్నారు. ‘అతనికి చాలా కాలం క్రితమే వివాహం అయింది. ఆరేళ్ల పాప కూడా ఉంది. కానీ భార్య మాత్రం అతన్ని విడిచి వెళ్లిపోయింది. దీంతో అతడు మానసికంగా కుంగిపోయాడు. దీంతో అతన్ని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చేర్పించాం. గత మూడు నాలుగేళ్ల నుంచి అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు. అతనికి ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచే ఇనుప వస్తువులను తినే అలవాటు ఉండేద’ని పేషెంట్ కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఖైదీల పరారీ
సాక్షి, హైదరాబాద్: భార్యను ములాఖత్‌కు అనుమతించలేదన్న కోపంతో ఓ అండర్ ట్రయల్ ఖైదీ వేసిన పథకంతో ఆస్పత్రి నుంచి చికిత్స పొందుతున్న పదకొండుమంది పరారయ్యారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు మంగళవారం సాయంత్రానికి ఎనిమిది మందిని పట్టుకోగా... మరో ముగ్గురు ముంబైలో ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. వీరికోసం వేట ముమ్మరం చేశారు. సోమవారం రాత్రి 9.30-12.30 మధ్య జరిగిన ఈ ఘటన వివరాలివి... నాంపల్లిలోని ఛాపెల్ రోడ్ ఫాహుద్దీన్ ఖురేషీ (38)పై అబిడ్స్, నాంపల్లి ఠాణాల్లో వరకట్న వేధింపుల కేసుతో పాటు మాదకద్రవ్యాలు కలిగిన తదితర కేసులు నమోదై ఉన్నాయి. ఫలితంగా చంచల్‌గూడ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. ఇతడి మానసిక పరిస్థితి బాలేకపోవడంతో జైలు అధికారులు ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఖురేషీ రెండో భార్య అతడిని కలిసేందుకు రాగా ఆర్ఎంఓ ఓంప్రకాష్ అనుమతించలేదు. దీంతో ఖురేషీ దాదాపు రెండు గంటల పాటు ప్రిజనల్ వార్డులో హంగామా సృష్టించాడు. వార్డు కబోర్డులో ఉన్న తోటి రోగుల కేస్షీట్లను తీసుకుని అగ్గిపెట్టెతో వాటికి నిప్పుపెట్టాడు. దీనివల్ల తీవ్రంగా పొగ రావడంతో ఆందోళన చెందిన సిబ్బంది వార్డులో ఉన్న 50 మంది రోగులను పక్కవార్డుకు మార్చారు. ఈ హడావిడిలో అక్కడే ఉన్న ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి ఖురేషీ మరో పదిమంది ఖైదీలతో పారిపోయాడు. ప్రిజనల్ వార్డుకు అనుకుని ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మాజీ ఉద్యోగులు ప్రశ్నించగా కత్తితో బెదిరించాడు. దీంతో భయపడిన వారు 11మంది ఖైదీలు వెళ్లిపోయాక ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. ఆస్పత్రి అధికారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించి ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశామని పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఖురేషీ టవేరా కారు (ఏపీ09 బిసి 7909)లో రెండో భార్యతో ముంబై పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన వారూ వీరితో పాటే ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. ఖైదీలు పారిపోవడం వెనుక ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం, నిర్లక్ష్యం ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురికీ ఘనమైన నేరచరిత్ర ఉందనీ, వారు సామాన్యులపై దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.