శివారుల్లోకి ఫార్మా సిటీ..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను ‘వరల్డ్ క్లాస్ సిటీ’గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా కాలుష్య భూతాన్ని పారదోలేందుకు పకడ్బందీగా చర్యలకు దిగుతోంది. మౌలికావసరాలైన తాగునీరు, మురుగునీటి పారుదల, రోడ్డు, రవాణా, గ్రీనరీ వంటివాటి అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే గ్రేటర్‌ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నద్ధమైంది.
ఇందులో భాగంగా నగరం దాని చుట్టుపక్కల ఉన్న బల్క్‌డ్రగ్, ఫార్మా సంస్థలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించాలని నిర్ణయించింది. వీటికోసం ప్రత్యేకంగా ఏడు వేల ఎకరాల్లో ‘ఫార్మా సిటీ’ని నిర్మించేందుకు అనువైన స్థలాల కోసం అన్వేషణ ప్రారంభించింది. బల్క్‌డ్రగ్ రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో ఆ రంగాన్ని సమున్నతంగా తీర్చిదిద్దాలన్న యోచిస్తోంది.
బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియట్, ఫార్మా నిల్వ గోదాముల కారణంగా నగరంలో తీవ్ర కాలుష్యం వెలువడుతోన్న కారణంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 30 కిలోమీటర్ల వెలుపల గల ప్రాంతాల్లో ఏడు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మించాలని తలపెట్టింది. ప్రస్తుతం జీడిమెట్ల, బాలానగర్, కాటేదాన్, ఐడీఏ బొల్లారం తదితర ప్రాంతాల్లో ఉన్న ఫార్మా కంపెనీలను ప్రతిపాదిత ఫార్మాసిటీకి తరలించేందుకుసర్కార్ సన్నాహాలు చేస్తోంది.
విజయవాడ రూట్లో..
ఫార్మా సిటీని విజయవాడ రూట్లో నల్గొండ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంతంగి టోల్‌గేట్‌కు అవతల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65)కు ఆనుకొని నల్లగొండ జిల్లా పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇరవైకిపైగా బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలున్నాయి. మరోవైపు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపైనున్న గుండ్రాంపల్లి గ్రామ శివార్లలో రె ండేళ్ల క్రితం ఓ ప్రైవేటు సంస్థ పరిశ్రమల సెజ్ ఏర్పాటు కోసం సుమారు రెండు వేల ఎకరాల భూములను రైతుల నుంచి కొనుగోలు చేసింది. దీనికి అనుబంధంగా మరో ఐదు వేల ఎకరాలను సేకరిస్తే ఫార్మాసిటీ ఏర్పాటుకుఅనువుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాయితీలు ప్రకటించాలి..
కొత్తగా అమల్లోకి వచ్చిన భూసేకరణ, పునరావాస బిల్లు వల్ల ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి భూమి సేకరించడం కష్టసాధ్యం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని ప్రకటించడంతోపాటు పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించడమే గాక అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ సూచిస్తోంది.
ముఖ్యంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో జాతీయ రహదారి-65కి సమీపంలో ఉన్న ఎనిమిది గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు, విస్తరణకు అనుకూలంగా ఉంటుందని అధికార వర్గాలు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ప్రతి జిల్లాకు ఓ పారిశ్రామిక కారిడార్‌ను ప్రకటిస్తున్న సర్కార్ నల్లగొండ జిల్లాకు ఫార్మా సిటీని కేటాయించే విషయమై ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంలోనే ఫార్మాసిటీ ఏర్పాటు, మార్గదర్శకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భూసేకరణ, నూతనంగా ఫార్మా కంపెనీల ఏర్పాటు, విస్తరణకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం కల్పించే రాయితీలు, మౌలిక వసతులు, ఇతర ప్రోత్సాహకాలు తదితర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.