government programme
-
అభివృద్ధికి అందరూ సహకరించాలి
లింగాపూర్ : మండలంలోని ప్రతీ అధికారి మండల అభివృద్ధికి సహకారించాలని మండల ప్రత్యేక అధికారి ఏయూ ఖాన్ కోరారు. మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. అంతకుముందు మండలంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి అన్నివిధాల కృషి చేస్తామని ఎంఈవో కుడిమెత సుధాకర్ అన్నారు. మూడు మినీ భూసార పరీక్ష కేంద్రాలు.. వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రైతులకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లను 50శాతం సబ్సిడిపై రైతులకు అందజేయడానికి నిధులు విడుదల చేసిందన్నారు. ఇందులో ఫెన్సింగ్ వైరు, స్ప్రింక్లర్లు, ఆయిల్ఇంజన్లు, తాడిపత్రిలు, పాడిపశువులైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల పటించాలన్నారు. భూముల సారాన్ని పరీక్షించడానికి మూడు మినీ భూసార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐకేపీ అధికారులపై కోరం సభ్యుల ఆగ్రహం.. ఐకేపి అ«ధికారుల పనితీరుపై కోరం సభ్యులు, అధికారులు మండిపడ్డారు. స్వయం సహాయక సంఘాలకు విపరీతంగా రుణాలు అందజేసి రికవరీ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ఎస్బీఎం మరుగుదొడ్ల నిర్మాణంలో ఎందుకు సహకరించడంలేదన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. సంఘాలకు ఇచ్చిన రుణాలను రికవరీ చేయకపోవడంతో బ్యాంకు అధికారులు స్వయం ఉపాధి కోసం అందించే రుణాలను ఇవ్వకుండా నిలిపివేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా ఎవరూ నడుచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, ఎస్సై రామారావు, ఐసీడీఎస్ సీడీపీవో ప్రభావతి, ఈవోపీఆర్డీ ఆనందరావు, సర్పంచ్‌లు సుదర్శన్, నాగోరావు, జాలీంశావ్, పద్మ పాల్గొన్నారు. -
రచ్చబండ ఒక్కరోజే!
అది కూడా మండల కేంద్రాలకే పరిమితం ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు సర్కారు ఎత్తుగడ ఇదివరకే గుర్తించిన లబ్ధిదారులకే పెన్షన్లు, ఇళ్లు వారు మాత్రమే రచ్చబండకు రావాలని షరతు కొత్త అర్జీలను స్వీకరించొద్దని అధికారులకు నిర్దేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఈసారి ‘రచ్చబండ’ ఒక్క రోజుతోనే ముగియనుంది. అది కూడా మండల కేంద్రానికే పరిమితం కానుంది. గ్రామాలకు వెళితే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందనే అనుమానంతో రచ్చబండను ఒక్కరోజుతోనే మమ అనిపించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి 26 వరకు రచ్చబండ షెడ్యూల్‌ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. కార్యక్రమాలను మాత్రం మండల కేంద్రాలకే పరిమితం చేయాలని ఆదేశించింది. స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి ప్రతి మండల/పురపాలక హెడ్‌క్వార్టర్‌లో ఒక్క రోజు రచ్చబండను నిర్వహించాలని సూచించింది. ఈ కార్యక్రమానికి మండల పరిధిలో ఇదివరకే గుర్తించిన లబ్ధిదారులు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు వారికి కూపన్లు జారీ చే యాల్సిందిగా ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలందాయి. లబ్ధిదారుల తరలింపును ఆయా శాఖలు పర్యవేక్షించనున్నాయి. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఇందిరమ్మ కలలు పథకం కింద అర్హులుగా గుర్తించిన లబ్ధిదారులు మాత్రమే రచ్చబండకు వచ్చేలా షరతు విధించారు. వీరికి మాత్రమే కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రయోజనాలను అందజేయనున్నారు. రచ్చబండలో కొత్త అర్జీలను స్వీకరించవద్దని ప్రభుత్వం నిర్దేశించింది. కేవలం వికలాంగుల పెన్షన్లకు సంబంధించిన అర్జీలను మాత్రమే తీసుకోవాలని ఆంక్షలు విధించింది. పరిమిత సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నందున ఇబ్బందులుండవని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలోనే లబ్ధిదారులకు మాత్రమే రచ్చబండను పరిమితం చేసింది. అంతేగాకుండా గ్రామాల బాట పడితే సమస్యలు కొని తెచ్చుకోవడమే అవుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడం, సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో నిర్వహిస్తున్న ఈ రచ్చబండలో అధికారపార్టీ నేతలను నిలదీసేందుకు అన్ని పార్టీల శ్రేణులు ఎదురుచూస్తున్నాయని, అనవసరంగా ఈ సమయంలో రచ్చబండకు వెళ్లి చీవాట్లు ఎదుర్కోవడం ఎందుకనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మండల కేంద్రాల్లో జరిగే సభలకు లబ్ధిదారులకు మాత్రమే ప్రవేశ మని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, అధికారులు మాత్రం ఇతర అర్జీలు వస్తే కాదనలేం కదా! అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం అధికారులకు కూడా ఒకింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఈనెల 11 నుంచి 26వరకు ఉన్న 13 పనిదినాల్లో ఒక్కో నియోజకవర్గంలో కేవలం నాలుగైదు రోజుల్లోనే రచ్చబండ ముగియడం వారిని తేలికపరుస్తోంది.