UP Governor
-
యోగి సర్కారు.. గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్ కాస్గంజ్లో జరిగిన మతఘర్షణలపై ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ తీవ్రంగా స్పందించారు. ఈ అల్లర్లు రాష్ట్ర ప్రతిష్టకు మచ్చలాంటివని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మతఘర్షణలు సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. గత తొమ్మిది, పది నెలల్లో మతఘర్షణలు జరగడం ఇదే తొలిసారి అని గుర్తుచేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో అట్టుడికిన కాస్గంజ్లో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా.. అదుపులోనే ఉంది. ఇక్కడ జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మృతిచెందిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ వర్గం బైకు ర్యాలీ నిర్వహించగా.. మరో వర్గం నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న రాళ్లదాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. -
యూపీ గవర్నర్ సంచలన నిర్ణయం
► యూపీ సీఎం యోగికి గవర్నర్ లేఖ లఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్): యూపీ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మహమ్మద్ ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ రామ్ నాయక్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాయటం సంచలనం రేపుతోంది. ఆజంఖాన్ అధికార దుర్వినియోగంపై రాసిన లేఖలో ఆయన 14 అంశాలను ప్రస్తావించారు. అఖిలేష్‌యాదవ్ సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసిన ఆజంఖాన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను ఆక్రమించుకున్నారని, ప్రజాధనంతో ప్రైవేటు వర్సిటీలో అతిథిగృహాన్ని నిర్మించుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, స్పోర్ట్స్ స్టేడియంనకు సంబంధించిన సామగ్రిని రాంపూర్‌లోని ప్రైవేట్ వర్సిటీ మహ్మద్ అలీ జౌహార్ వర్సిటీకి అక్రమంగా తరలించారని వివరించారు. అంతేకాకుండా వక్ఫ్‌బోర్డు ఆస్తుల ఆక్రమణకు సంబంధించి అధికారులు అందజేసిన 42 పేజీల నివేదికను కూడా జతపరిచారు. -
మరో అఖిలేశ్ వికెట్ ఔట్!
- సీఎం సన్నిహితుడిపై ఆరేళ్ల బహిష్కరణ - గవర్నర్‌ను కలిసిన అఖిలేశ్ లక్నో: కలహాలు లేవంటూనే.. యాదవ్ కుటుంబంలో అంతర్గతంగా తీవ్ర యుద్ధం జరుగుతోంది. బుధవారం యూపీ సీఎం అఖిలేశ్ సన్నిహితుడు, మంత్రి పవన్ పాండేను సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు పార్టీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్ ప్రకటించారు. దీనిపై సీఎం క్యాంపులో అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ రామ్‌నాయక్‌ను అఖిలేశ్ హుటాహుటిన కలసి 15 నిమిషాలు ఏకాంతంగా చర్చించడం యూపీ రాజకీయాల్లో కలకలం రేపింది. అఖిలేశ్ వర్గానికి దెబ్బే..: యూపీ సహాయ మంత్రి తేజ్‌నారాయణ్ పాండే(పవన్ పాండే)ను క్రమశిక్షణారాహిత్యం వల్ల పార్టీనుంచి ఆరేళ్లు బహిష్కరించారు. ఈ విషయాన్ని శివ్‌పాల్ తెలిపారు. రెండ్రోజుల క్రితం సీఎం అధికారిక నివాసంలో అశు మాలిక్ అనే ఎమ్మెల్సీని(అమర్‌సింగ్ వర్గం) పవన్ చెంపదెబ్బ కొట్టారు. అశు తనకు వ్యతిరేకంగా వార్తలు వేయిస్తున్నారంటూ అఖిలేశ్ ఆగ్రహంగా ఉన్నారు. పవన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా సూచించామని శివ్‌పాల్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుకోసం ఆర్ఎల్డీ, కాంగ్రెస్‌లతో చర్చిస్తున్నట్లు శివ్‌పాల్ తెలపగా.. ఇంతవరకు అటువంటి చర్చలేం జరగలేదని కాంగ్రెస్ పేర్కొంది. గవర్నర్‌తో..: పవన్‌పై వేటు పడిన వెంటనే అఖిలేశ్.. గవర్నర్ రామ్‌నాయక్‌ను కలిశారు. ముందుగానే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారని, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు సమావేశమయ్యారని రాజ్‌భవన్, ఎస్పీ వర్గాలు తెలిపాయి. అయితే.. అసలు కారణం వేరని, తన అనుకూల ఎమ్మెల్యేల జాబితాను అడిగిన గవర్నర్‌కు జాబితా ఇచ్చి పరిస్థితిని వివరించేందుకే అఖిలేశ్ కలిశారనే ప్రచారం జరుగుతోంది. తనకింకా అసెంబ్లీలో మెజారిటీ ఉందని చెప్పుకునేందుకే భేటీ జరిగిందని తెలుస్తోంది. అంతకుముందు తన వర్గ యువనేతలు, కార్యకర్తలతో అఖిలేశ్ సమావేశమయ్యారు. పార్టీలో గొడవలు పక్కనపెట్టి.. రథయాత్ర, పార్టీ రజతోత్సవాలపై దృష్టి పెట్టాల న్నారు. సోషలిస్టు పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ములాయం ఢిల్లీ వెళ్లారు. శివ్‌పాల్‌కు అర్థమైంది!: తొలగించిన మంత్రులను తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని అఖిలేశ్ ములాయంతో జరిపి భేటీలో చెప్పారు. దీంతో తనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాల్లేవని అర్థం చేసుకున్న శివ్‌పాల్.. తన అధికారిక వాహనాలను వెనక్కి ఇచ్చేశారు. -
గవర్నర్‌ను అఖిలేష్ ఎందుకు కలిశారు?
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాది పార్టీలో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. తమ కుటుంబం, పార్టీ ఐక్యంగా ఉందని పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, రాష్ట్ర పార్టీ నాయకుడు శివపాల్ యాదవ్ సమక్షంలో ప్రకటించి 24 గంటలు కూడా కాకముందే బుధవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి తేజ్ నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేను పార్టీ నుంచి బహిష్కరించారు. ములాయం సింగ్ యాదవ్ అనుచరుడు, ఎమ్మెల్సీ ఆశు మాలిక్‌పై పార్టీ సమావేశంలో చేయిచేసుకున్నందుకుగాను పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ శివపాల్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు లేఖ కూడా రాశారు. తాజా పరిణామం నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ హడావుడిగా రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్‌ను కలసుకోవడంతో పార్టీ చీలిపోతుందన్న ఊహాగానాలు మళ్లీ బయల్దేరాయి. పార్టీ చీలిపోతే అటు ములాయం, శివపాల్ యాదవ్ వర్గానికే కాకుండా ఇటు అఖిలేష్ యాదవ్ వర్గానికి కూడా కోలుకోని నష్టం జరుగుతోందని, అలాంటప్పుడు పార్టీపైనా ఆధిపత్యం కోసం అధికారం కోల్పోయే ప్రమాదాన్ని ఎవరు మాత్రం కొని తెచ్చుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమాజ్‌వాది పార్టీకి ఓ రూపు తీసుకొచ్చి అధికారం పీటంపై కూర్చోపెట్టడం వెనక ములాయం సింగ్ యాదవ్‌తోపాటు శివపాల్ యాదవ్ పాతికేళ్ల కృషి ఉంది. అలాంటి పార్టీని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా తమ మీద ఉందని వారు భావిస్తున్నారు. అయితే పార్టీ పట్టింపులు, పంతాలతో నిమిత్తం లేకుండా రాష్ట్రాన్ని అభివద్ధి పంథాలో నడిపించాలనే ఉద్దేశంతో అఖిలేష్ యాదవ్ వర్గం ముందుకు పోతోంది. ఈ తరుణంలో పార్టీ వృద్ధ నాయకులు తీసుకుంటున్న చర్యలు తమకు ప్రతిబంధకం అవుతున్నాయని ఆ వర్గం భావిస్తోంది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ములాయం, శివపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరగడంతో, రానున్న ఎన్నికల్లో ఈసారి తన ఆధ్వర్యంలోనే అభ్యర్థుల ఎంపిక జరగాలనే లక్ష్యంతో పార్టీపైనా అఖిలేష్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. యువతరం మద్దతు కలిగిన అఖిలేష్ వృద్ధతరమే దారికొస్తుందని భావించారు. కానీ రావడం లేదు. ఇరువర్గాలు ఒకరిపై, ఒకరు వేటు వేసుకుంటూనే ఉన్నాయి. నిజంగా పార్టీ విడిపోయినట్లయితే సమజ్‌వాది పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి అండగా నిలుస్తున్న యాదవులు, ముస్లింలు పార్టీకి దూరం అవుతారని, బీజేపీని అడ్డుకోవాలనే ఉద్దేశంలో ముస్లింలు బహుజన సమాజ్ పార్టీకి వెళతారని, యాదవ్‌లు బీజేపీవైపు వెళతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రాహుల్‌తో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీతో తన వర్గం కలసి పోటీ చేస్తే రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని, అలా జరిగినట్లయితే తన పార్టీలో తాను తిరుగులేని యువనేత ఎదుగుతానని అఖిలేష్ భావిస్తున్నారు. అయినా ఆయన గవర్నర్‌తో ఎలాంటి చర్చలు జరిపారనే విషయంపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రాష్ట్రపతికి నివేదిక పంపిన గవర్నర్
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల క్షీణతకు కారణమైన మధుర, కైరానా, దాద్రి ఘటనలపై ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి ప్రత్యేక నివేదిక సమర్పించారు. ప్రధానమంత్రి, హోంమంత్రికి సైతం నివేదికలను పంపినట్టు గవర్నర్ వెల్లడించారు. ఈ నివేదికలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా దాటవేశారు. కాగా గతేడాది దాద్రి గ్రామంలో అఖ్లాక్ అనే ముస్లిం ఇంట్లో ఆవు మాంసం ఉందనే అనుమానంతో గ్రామస్థలు దాడి చేసిన ఘటనలో అతను మృతి చెందాడు. ముస్లీం మెజారిటీ గ్రామం అయిన కైరానా లో 360 హిందూ కుటుంబాలకు చెందిన వారు వలస వెళ్లారు. ఆక్రమణ దారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించే ఘటనలో భాగంగా పోలీసులకు, ఆందోళన కారులకు,పోలీసులకు మధ్య జరిగిన ఘర్షనలో 24 మంది మృతి చెందగా 100 మంది గాయపడిన విషయం తెలిసిందే.