మరో అఖిలేశ్ వికెట్ ఔట్!
- సీఎం సన్నిహితుడిపై ఆరేళ్ల బహిష్కరణ
- గవర్నర్‌ను కలిసిన అఖిలేశ్
లక్నో: కలహాలు లేవంటూనే.. యాదవ్ కుటుంబంలో అంతర్గతంగా తీవ్ర యుద్ధం జరుగుతోంది. బుధవారం యూపీ సీఎం అఖిలేశ్ సన్నిహితుడు, మంత్రి పవన్ పాండేను సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు పార్టీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్ ప్రకటించారు. దీనిపై సీఎం క్యాంపులో అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ రామ్‌నాయక్‌ను అఖిలేశ్ హుటాహుటిన కలసి 15 నిమిషాలు ఏకాంతంగా చర్చించడం యూపీ రాజకీయాల్లో కలకలం రేపింది.
అఖిలేశ్ వర్గానికి దెబ్బే..: యూపీ సహాయ మంత్రి తేజ్‌నారాయణ్ పాండే(పవన్ పాండే)ను క్రమశిక్షణారాహిత్యం వల్ల పార్టీనుంచి ఆరేళ్లు బహిష్కరించారు. ఈ విషయాన్ని శివ్‌పాల్ తెలిపారు. రెండ్రోజుల క్రితం సీఎం అధికారిక నివాసంలో అశు మాలిక్ అనే ఎమ్మెల్సీని(అమర్‌సింగ్ వర్గం) పవన్ చెంపదెబ్బ కొట్టారు. అశు తనకు వ్యతిరేకంగా వార్తలు వేయిస్తున్నారంటూ అఖిలేశ్ ఆగ్రహంగా ఉన్నారు. పవన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా సూచించామని శివ్‌పాల్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుకోసం ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్‌లతో చర్చిస్తున్నట్లు శివ్‌పాల్ తెలపగా.. ఇంతవరకు అటువంటి చర్చలేం జరగలేదని కాంగ్రెస్ పేర్కొంది.
గవర్నర్‌తో..: పవన్‌పై వేటు పడిన వెంటనే అఖిలేశ్.. గవర్నర్ రామ్‌నాయక్‌ను కలిశారు. ముందుగానే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారని, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు సమావేశమయ్యారని రాజ్‌భవన్, ఎస్పీ వర్గాలు తెలిపాయి. అయితే.. అసలు కారణం వేరని, తన అనుకూల ఎమ్మెల్యేల జాబితాను అడిగిన గవర్నర్‌కు జాబితా ఇచ్చి పరిస్థితిని వివరించేందుకే అఖిలేశ్ కలిశారనే ప్రచారం జరుగుతోంది. తనకింకా అసెంబ్లీలో మెజారిటీ ఉందని చెప్పుకునేందుకే భేటీ జరిగిందని తెలుస్తోంది. అంతకుముందు తన వర్గ యువనేతలు, కార్యకర్తలతో అఖిలేశ్ సమావేశమయ్యారు. పార్టీలో గొడవలు పక్కనపెట్టి.. రథయాత్ర, పార్టీ రజతోత్సవాలపై దృష్టి పెట్టాల న్నారు. సోషలిస్టు పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ములాయం ఢిల్లీ వెళ్లారు.
శివ్‌పాల్‌కు అర్థమైంది!: తొలగించిన మంత్రులను తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని అఖిలేశ్ ములాయంతో జరిపి భేటీలో చెప్పారు. దీంతో తనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాల్లేవని అర్థం చేసుకున్న శివ్‌పాల్.. తన అధికారిక వాహనాలను వెనక్కి ఇచ్చేశారు.