గవర్నర్‌ను అఖిలేష్‌ ఎందుకు కలిశారు? | why Akhilesh Yadav meets UP governor | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను అఖిలేష్‌ ఎందుకు కలిశారు?

Published Wed, Oct 26 2016 2:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

గవర్నర్‌ను అఖిలేష్‌ ఎందుకు కలిశారు?

గవర్నర్‌ను అఖిలేష్‌ ఎందుకు కలిశారు?

లక్నో:
ఉత్తర్ప్రదేశ్‌ రాష్ట్రంలో సమాజ్‌వాది పార్టీలో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. తమ కుటుంబం, పార్టీ ఐక్యంగా ఉందని పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్, రాష్ట్ర పార్టీ నాయకుడు శివపాల్‌ యాదవ్‌ సమక్షంలో ప్రకటించి 24 గంటలు కూడా కాకముందే బుధవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి తేజ్‌ నారాయణ్‌ పాండే అలియాస్‌ పవన్‌ పాండేను పార్టీ నుంచి బహిష్కరించారు. ములాయం సింగ్‌ యాదవ్‌ అనుచరుడు, ఎమ్మెల్సీ ఆశు మాలిక్‌పై పార్టీ సమావేశంలో చేయిచేసుకున్నందుకుగాను పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ శివపాల్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు లేఖ కూడా రాశారు.

తాజా పరిణామం నేపథ్యంలో అఖిలేష్‌ యాదవ్‌ హడావుడిగా రాష్ట్ర గవర్నర్‌ రామ్‌నాయక్‌ను కలసుకోవడంతో పార్టీ చీలిపోతుందన్న ఊహాగానాలు మళ్లీ బయల్దేరాయి. పార్టీ చీలిపోతే అటు ములాయం, శివపాల్‌ యాదవ్‌ వర్గానికే కాకుండా ఇటు అఖిలేష్‌ యాదవ్‌ వర్గానికి కూడా కోలుకోని నష్టం జరుగుతోందని, అలాంటప్పుడు పార్టీపైనా ఆధిపత్యం కోసం అధికారం కోల్పోయే ప్రమాదాన్ని ఎవరు మాత్రం కొని తెచ్చుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమాజ్‌వాది పార్టీకి ఓ రూపు తీసుకొచ్చి అధికారం పీటంపై కూర్చోపెట్టడం వెనక ములాయం సింగ్‌ యాదవ్‌తోపాటు శివపాల్‌ యాదవ్‌ పాతికేళ్ల కృషి ఉంది. అలాంటి పార్టీని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా తమ మీద ఉందని వారు భావిస్తున్నారు.

అయితే పార్టీ పట్టింపులు, పంతాలతో నిమిత్తం లేకుండా రాష్ట్రాన్ని అభివద్ధి పంథాలో నడిపించాలనే ఉద్దేశంతో అఖిలేష్‌ యాదవ్‌ వర్గం ముందుకు పోతోంది. ఈ తరుణంలో పార్టీ వృద్ధ నాయకులు తీసుకుంటున్న చర్యలు తమకు ప్రతిబంధకం అవుతున్నాయని ఆ వర్గం భావిస్తోంది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ములాయం, శివపాల్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరగడంతో, రానున్న ఎన్నికల్లో ఈసారి తన ఆధ్వర్యంలోనే అభ్యర్థుల ఎంపిక జరగాలనే లక్ష్యంతో పార్టీపైనా అఖిలేష్‌ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. యువతరం మద్దతు కలిగిన అఖిలేష్‌ వృద్ధతరమే దారికొస్తుందని భావించారు. కానీ రావడం లేదు. ఇరువర్గాలు ఒకరిపై, ఒకరు వేటు వేసుకుంటూనే ఉన్నాయి.

 
నిజంగా పార్టీ విడిపోయినట్లయితే సమజ్‌వాది పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా  పార్టీకి అండగా నిలుస్తున్న యాదవులు, ముస్లింలు పార్టీకి దూరం అవుతారని, బీజేపీని అడ్డుకోవాలనే ఉద్దేశంలో ముస్లింలు బహుజన సమాజ్‌ పార్టీకి వెళతారని, యాదవ్‌లు బీజేపీవైపు వెళతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రాహుల్‌తో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకొని కాంగ్రెస్‌ పార్టీతో తన వర్గం కలసి పోటీ చేస్తే రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని, అలా జరిగినట్లయితే తన పార్టీలో తాను తిరుగులేని యువనేత ఎదుగుతానని అఖిలేష్‌ భావిస్తున్నారు. అయినా ఆయన గవర్నర్‌తో ఎలాంటి చర్చలు జరిపారనే విషయంపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement