Govt policies
-
అమ్మో.. అమెరికా..!
లూయిస్ కార్లోస్ సోల్డ్విల్లా మెక్సికో సిటీ హైస్కూల్లో మంచి మార్కులతో గ్రాడ్యుయేషన్ చేశాడు. తర్వాత బోస్టన్ యూనివర్సిటీలో కాని, వాషింగ్టన్ యూనివర్సిటీలోకాని చేరాలనుకున్నాడు. ఆ రెండు వర్సిటీలు కార్లోస్‌కు సీటు కూడా ఆఫర్ చేశాయి. అయితే, చివరికి కార్లోస్ ఈ రెండింటిలోనూ కాకుండా కెనడాలోని టొరంటో యూనివర్సిటీలో చేరాడు. అమెరికా వర్సిటీలు సీటివ్వడానికి ముందుకొచ్చినా కూడా కెనడాకెందుకు వెళ్లావని ప్రశ్నిస్తే 19 ఏళ్ల కార్లోస్ చెప్పిన సమాధానం ‘అక్కడ ట్రంప్ లేడుగా’ అని. ప్రస్తుతం ‘అమెరికా చదువుల’ పరిస్థితికి నిదర్శనమిది. సురక్షితం కాదా! కొన్ని దశాబ్దాలుగా అమెరికా ప్రపంచంలోని అత్యుత్తమ విద్యార్థులను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. విదేశీ విద్యార్ధుల వల్ల అమెరికాకు ఏటా కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తోంది. వేల ఉద్యోగాల కల్పన జరుగుతోంది. అయితే, ట్రంప్ సర్కారు విధానాలు వారిని భయపెడుతున్నాయి. దాంతో చదువుకోసం ఇక్కడికి వచ్చే బదులు ఇతర దేశాలకు వెళుతున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, తీసుకుంటున్న చర్యల కారణంగా విదేశీ విద్యార్ధుల రాక తగ్గుతోంది. 2017–18లో అమెరికా విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థుల నమోదు 6.6 శాతం తగ్గిందని ఎన్‌ఏఎఫ్‌ఎస్‌ఏ (అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్) డైరెక్టర్ రాచెల్ బ్యాంక్స్ చెప్పారు. వీసా మంజూరులో జాప్యం, వీసాల తిరస్కరణ, దేశంలో సామాజిక, రాజకీయ వాతావరణం, చదువుకయ్యే ఖర్చు పెరగడం వంటి కారణాల వల్ల విదేశీ విద్యార్ధుల రాక తగ్గుతోందన్నారు. ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను కఠినతరం చేయడం అంటే ముస్లిం దేశాల ప్రజలను అనుమతించకపోవడం, అక్రమంగా వచ్చిన వాళ్లలో తలిదండ్రులను, పిల్లలను వేరువేరుగా బంధించడం వంటి వాటివల్ల విదేశీ విద్యార్ధులు వారి తల్లిదండ్రుల్లో అమెరికా సురక్షితం కాదన్న భావన పెరుగుతోందన్నారు. విదేశీ విద్యార్థులే ఆధారం విదేశీ విద్యార్థుల వల్ల కాలిఫోర్నియా, న్యూయార్క్, మసాచుసెట్స్, టెక్సాస్, పెన్సిల్వేనియాలు ఎక్కువ లాభపడ్డాయి. విద్య, ముఖ్యంగా ఉన్నత విద్య అమెరికా అందించే ప్రధాన సేవ. మనం ఈ సేవను అందించడం వల్ల విదేశీయులు దేశంలోకి డబ్బు పంపుతున్నారు. మనం సోయా లేదా బొగ్గును విదేశాలకు పంపితే ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో అలాంటిదే వీరివల్ల కలుగుతోంది’ అని కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ డిక్ స్టార్ట్జ్ 2017లో బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ బ్లాగ్‌లో రాశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దగ్గర డాలర్లు నిండుకున్నప్పుడు విద్యాసంస్థలు విదేశీ విద్యార్థులను ట్యూషన్లకు ఉపయోగించుకుంటాయన్నారు. కీలక రంగాల్లో వెనకే! సైన్స్, ఇంజనీరింగ్ వంటి కీలక రంగాలకు సంబంధించిన ఉన్నత విద్యలో అమెరికా ఇతర దేశాల కంటే వెనకబడి ఉంది. ఈ రంగాల్లో విదేశీ విద్యార్థులు లేకుండా అమెరికా పని చేయలేదని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ 2017 నాటి నివేదిక హెచ్చరించింది. దాదాపు 90శాతం అమెరికా వర్సిటీల్లో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ ,పీహెచ్‌డీలు చేసే వారిలో అత్యధికులు విదేశీ విద్యార్థులే. ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు విదేశీ మేధావుల్ని ఆకట్టుకుంటున్నాయని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ డైరెక్టర్ రవి శంకర్ అన్నారు. -
రాజధాని రైతుల్లో అంతర్మథనం
* ప్రభుత్వ వైఖరిపై బయటపడుతున్న వ్యతిరేకత * ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని మండిపాటు * ప్రజలకు ముఖం చాటేస్తున్న టీడీపీలోనే ఓ వర్గం * మంత్రులు నారాయణ, ప్రత్తిపాటిపై ఆగ్రహావేశాలు సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ వైఖరిపై బయటపడుతున్న వ్యతిరేకత ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని మండిపాటు ప్రజలకు ముఖం చాటేస్తున్న టీడీపీలోనే ఓ వర్గం మంత్రులు నారాయణ, ప్రత్తిపాటిపై ఆగ్రహావేశాలు వెనుకా ముందు ఆలోచించకుండా టీడీపీ పెద్దల మాటలు విని బంగారంలాంటి భూములు ఇచ్చి తప్పుచేశామా? అని రాజధాని నిర్మాణానికి భూములు వదులుకున్న రైతులు, ఆ పార్టీ నాయకులు ఇప్పుడు అంతర్మథనం చెందుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న స్థానికులతో కలిసి పార్టీ పెద్దలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా.. మీ వెంటే ఉంటామని స్థానిక టీడీపీ నాయకులు రాజధాని రైతులకు మద్దతు తెలియజేస్తుండడం గమనార్హం. గుడ్డిలో మెల్ల చందంగా ఎన్నికల్లో బయటపడ్డ టీడీపీ ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం నిర్మాణానికి పూనుకుంది. స్థానిక టీడీపీ నేతలతో సమావేశమై...రైతుల నుంచి భూములు ఇప్పించే బాధ్యతను వారి భుజాలపై మోపింది. దీంతో 29 గ్రామాలకు చెందిన రైతులతో స్థానిక టీడీపీ నేతలు కాళ్లావేళ్లా పడి ముఖ్యమంత్రి, మంత్రులచే రకరకాల హామీలిచ్చి ఒప్పించారు. గ్రామానికి ఒక్కోరకమైనా హామీలు ఇచ్చారు. అయితే కొందరు నమ్మకపోయినా... మరి కొందరు వ్యతిరేకించినా వారిని భయపెట్టి భూములు లాక్కున్నారు. హామీలన్నీ గాలికి.. భూములు తీసుకునే సమయంలో మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు వెంకటపాలెంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ప్లాట్లు, కౌలు, కూలీలకు ఫించన్లు, గ్రామాభివృద్ధికి రూ.30లక్షల నిధులు వంటి హామీలు ఇచ్చారు. ముందుగా ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి వెంకటపాలెం నుంచే శ్రీకారం చుడతామని మాటిచ్చారు. అదే విధంగా 2.50 ఎకరాల్లో గ్రీన్‌పార్క్ ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుడు ఒకరికి అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇలా మంత్రులు ఇచ్చిన రకరకాల హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. పా్లట్ల పంపిణీ కార్యక్రమం వెంకటపాలెంలో ప్రారంభించకపోయినా... ఇప్పటి వరకు ప్లాట్లకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. గ్రామంలో కాకుండా వేరొక చోట ప్లాట్లు కేటాయించనున్నారనే విషయం తెలుసుకున్న స్థానికులు టీడీపీ పెద్దలపై మండిపడుతున్నారు. చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? అని ప్రశ్నిస్తుండడంతో టీడీపీ నాయకులు నోరుమెదపలేకపోతున్నారు. భూములిచ్చి రెండేళ్లవుతున్నా.. ఇప్పటి వరకు గ్రామానికీ, రైతులకు ఎటువంటి ప్రయోజనం చూపించలేదని మండిపడుతున్నారు. భూముల కోసం రాత్రి, పగలు లెక్కచేయకుండా తిరిగిన మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ఆ తరువాత గ్రామాలవైపు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల సమాధానం చెప్పలేక స్థానిక టీడీపీ నేతలు మౌనంగా వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా... అందుకు పూర్తి మద్దతు ఇస్తామని టీడీపీ నాయకులు కొందరు గ్రామస్తులకు ఇప్పుడు హామీ ఇస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఒక్క వెంకటపాలెం వాసులే కాదు... రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత చాపకిందలా పారుతోంది.