రాజధాని రైతుల్లో అంతర్మథనం
రాజధాని రైతుల్లో అంతర్మథనం
Published Mon, Sep 26 2016 7:02 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
* ప్రభుత్వ వైఖరిపై బయటపడుతున్న వ్యతిరేకత
* ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని మండిపాటు
* ప్రజలకు ముఖం చాటేస్తున్న టీడీపీలోనే ఓ వర్గం
* మంత్రులు నారాయణ, ప్రత్తిపాటిపై ఆగ్రహావేశాలు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ వైఖరిపై బయటపడుతున్న వ్యతిరేకత ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని మండిపాటు ప్రజలకు ముఖం చాటేస్తున్న టీడీపీలోనే ఓ వర్గం మంత్రులు నారాయణ, ప్రత్తిపాటిపై ఆగ్రహావేశాలు వెనుకా ముందు ఆలోచించకుండా టీడీపీ పెద్దల మాటలు విని బంగారంలాంటి భూములు ఇచ్చి తప్పుచేశామా? అని రాజధాని నిర్మాణానికి భూములు వదులుకున్న రైతులు, ఆ పార్టీ నాయకులు ఇప్పుడు అంతర్మథనం చెందుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న స్థానికులతో కలిసి పార్టీ పెద్దలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా.. మీ వెంటే ఉంటామని స్థానిక టీడీపీ నాయకులు రాజధాని రైతులకు మద్దతు తెలియజేస్తుండడం గమనార్హం.
గుడ్డిలో మెల్ల చందంగా ఎన్నికల్లో బయటపడ్డ టీడీపీ ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం నిర్మాణానికి పూనుకుంది. స్థానిక టీడీపీ నేతలతో సమావేశమై...రైతుల నుంచి భూములు ఇప్పించే బాధ్యతను వారి భుజాలపై మోపింది. దీంతో 29 గ్రామాలకు చెందిన రైతులతో స్థానిక టీడీపీ నేతలు కాళ్లావేళ్లా పడి ముఖ్యమంత్రి, మంత్రులచే రకరకాల హామీలిచ్చి ఒప్పించారు. గ్రామానికి ఒక్కోరకమైనా హామీలు ఇచ్చారు. అయితే కొందరు నమ్మకపోయినా... మరి కొందరు వ్యతిరేకించినా వారిని భయపెట్టి భూములు లాక్కున్నారు.
హామీలన్నీ గాలికి..
భూములు తీసుకునే సమయంలో మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు వెంకటపాలెంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ప్లాట్లు, కౌలు, కూలీలకు ఫించన్లు, గ్రామాభివృద్ధికి రూ.30లక్షల నిధులు వంటి హామీలు ఇచ్చారు. ముందుగా ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి వెంకటపాలెం నుంచే శ్రీకారం చుడతామని మాటిచ్చారు. అదే విధంగా 2.50 ఎకరాల్లో గ్రీన్‌పార్క్ ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుడు ఒకరికి అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇలా మంత్రులు ఇచ్చిన రకరకాల హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. పా్లట్ల పంపిణీ కార్యక్రమం వెంకటపాలెంలో ప్రారంభించకపోయినా... ఇప్పటి వరకు ప్లాట్లకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. గ్రామంలో కాకుండా వేరొక చోట ప్లాట్లు కేటాయించనున్నారనే విషయం తెలుసుకున్న స్థానికులు టీడీపీ పెద్దలపై మండిపడుతున్నారు. చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? అని ప్రశ్నిస్తుండడంతో టీడీపీ నాయకులు నోరుమెదపలేకపోతున్నారు. భూములిచ్చి రెండేళ్లవుతున్నా.. ఇప్పటి వరకు గ్రామానికీ, రైతులకు ఎటువంటి ప్రయోజనం చూపించలేదని మండిపడుతున్నారు. భూముల కోసం రాత్రి, పగలు లెక్కచేయకుండా తిరిగిన మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ఆ తరువాత గ్రామాలవైపు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల సమాధానం చెప్పలేక స్థానిక టీడీపీ నేతలు మౌనంగా వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా... అందుకు పూర్తి మద్దతు ఇస్తామని టీడీపీ నాయకులు కొందరు గ్రామస్తులకు ఇప్పుడు హామీ ఇస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఒక్క వెంకటపాలెం వాసులే కాదు... రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత చాపకిందలా పారుతోంది.
Advertisement
Advertisement