కాలేజీకి వెళ్లొస్తుంటే లాగేసి ‘ఐ లవ్ యూ’..
ముంబయి: నలుగురిలో ఓ యువతి చేయిపట్టిలాగినందుకు 22 ఏళ్ల వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడింది. లైంగికపరమైన నేరాల నుంచి బాలికలకు ప్రత్యేక రక్షణ కల్పించే చట్టం(పోస్కో యాక్ట్) ద్వారా అతడికి ఈ శిక్ష ఖరారైంది. అయితే, నిత్యం అతడు ఆ యువతిని అనుసరిస్తూ చెడుగా ప్రవర్తించేవాడని, అసభ్యకరంగా మాట్లాడేవాడంటూ చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయినందున ఆ ఆరోపణలు మాత్రం కోర్టు కొట్టేసింది. అలాగే, అతడిపై కేసు నమోదైన అక్టోబర్ 29, 2015 నుంచి బెయిల్ పొందిన అక్టోబర్ 19, 2016వరకు జైలులోనే గడిపాడు.
తాజాగా కోర్టు కూడా ఏడాదికాలం మాత్రమే శిక్ష వేయడంతో అతడి శిక్షకాలం దాదాపు పూర్తయినట్లు ప్రకటించే అవకాశం ఉంది. కోర్టు విచారణ ప్రకారం 2015 అక్టోబర్ 6న ఖడ్సే అనే యువకుడు 16 ఏళ్ల యువతి తన స్నేహితురాలితో కలిసి కాలేజీకి వెళ్లొస్తుండగా మధ్యలో వారిని అడ్డుకున్నాడు. ఆమెతో పలు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడాడు. అలా మాట్లాడుతూనే అనూహ్యంగా ఆమె చేయి పట్టిలాగి ‘ఐ లవ్ యూ’ అనేశాడు. దీంతో ఏడ్చుకుంటూ ఆ అమ్మాయి ఇంటికెళ్లింది.
స్నేహితురాలు ఆమె తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. దీంతో వారు వెళ్లి ఖడ్సే తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పి మందలించే ప్రయత్నం చేశారు. అయినా.. వాళ్లు వినకుండా ఎదురుతిరిగిన పరిస్థితి ఎదురవ్వడంతో భయాందోళనకు గురైన ఆ యువతి కాలేజీకి వెళ్లడం మానేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు విచారణను నెమ్మదిగా చేసిన పోలీసులపై కోర్టు అక్షింతలు వేసింది.