Graduate elections Political parties
-
‘మంత్రి ఈటలను సీఎంను చేయండి’
మహబూబాబాద్: తెలంగాణ ఏర్పడితే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ రాష్ట్రం ప్రకటించారని, అయితే దళితుడి బదులు సీఎం పదవిని కేసీఆర్ చేజిక్కించుకున్నారని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ మండిపడ్డారు. దీనికి పోను ఇటీవల కేటీఆర్‌కు పట్టం కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆయనకు బదులు మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించిన సుధాకర్.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. (చదవండి: కలకలం రేపుతున్న ఈటల తూటాలు) ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కాగానే 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు 1,35,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నా.. లెక్కల్లో స్పష్టతలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంకు ఎన్డీఏ నేతలు ఎందుకు మద్దతిస్తున్నారో అర్థం కావడంలేదని, కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న తనను పరిగణలోకి తీసుకుని గెలిపించాలని సుధాకర్ కోరారు. -
2 స్థానాలు.. 33 మంది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 22న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 5వ తేదీతో ముగియగా.. పట్టభద్రుల స్థానానికి 35, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పది నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లను బుధ, గురువారాల్లో స్క్రూటినీ నిర్వహించిన అధికారులు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి రెండింటిని, పట్టభద్రుల నియోజకవర్గంలో 10 నామినేషన్లను తిరస్కరించినట్లు ప్రకటించారు. దీంతో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 25 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది బరిలో మిగిలారు. కాగా నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగియగా సాయంత్రానికి పోటీలో ఉన్న వారెందరనేది తేలనుంది. చంద్రశేఖర్‌గౌడ్‌కు ‘గులాబీ’ మద్దతు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిని పోటీలో పెట్టబోమని టీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ఇస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు ఎంపీ కవిత కూడా ఆయనకు ఆశీస్సులు అందించారు. బుధవారం రాత్రి కరీంనగర్లో ఆయన కేటీఆర్‌ను కలవగా పార్టీ నేతల సమక్షంలో గౌడ్‌కు మద్దతు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో బరిలో నిలిచిన మిగిలిన టీఆర్ఎస్ నాయకులు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ మద్దతు ఆశించి భంగపడిన యాదగిరి శేఖర్‌రావు, జమాలుద్దీన్ నామినేషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. ప్రచారంలో నిమగ్నమైన జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఇప్పటికే జిల్లాల్లో ప్రచారం సాగిస్తున్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ నేతలు ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా సుగుణాకర్‌రావు బరిలో ఉన్నారు. ‘యువ తెలంగాణ’ నుంచి రాణిరుద్రమ యువ తెలంగాణ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ సైతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. పట్టభద్రుల అండతో విజయం సాధిస్తానని చెపుతున్న ఆమె గురువారం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను కలిసి మద్దతు కోరారు. అభ్యర్థులు వీరే... స్క్రూటినీ అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బరిలో మిగిలిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. టి.జీవన్‌రెడ్డి(కాంగ్రెస్), పి. సుగుణాకర్‌రావు(బీజేపీ), గోగుల రాణిరుద్రమ(యువ తెలంగాణ పార్టీ)తో పాటు గుర్రం ఆంజనేయులు, ఎడ్ల రవికుమార్, కడారి అనంతరెడ్డి, కల్లెం ప్రవీణ్‌రెడ్డి, గంట సంపత్, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్(టీఆర్ఎస్), ఎం.డీ.జమాలుద్దీన్, డొంకెన రవీందర్(తెలంగాణ జన సమితి), దేవునూరి రవీందర్, పరువెల్లి ప్రభాకర్‌రావు, ఎం.బాలనాగసైదులు, యాదగిరి శేఖర్‌రావు, జి.రణజిత్ మోహన్, ఎస్.రవీందర్‌గౌడ్, వై.రామిరెడ్డి, వంజరి శివకుమార్, శ్రీకాంత్ తోడే టి, కె.శ్రీధర్ రాజు, షేక్‌షబ్బీర్, సురేష్, అబ్దుల్ హమీద్ ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూర రఘోత్తంరెడ్డి, బి.కొండల్ రెడ్డి, చార్ల మానయ్య, చిట్యాల రాములు, పాతూరి సుధాకర్‌రెడ్డి, బట్టాపురం మోహన్‌రెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి, జి.వేణుగోపాలస్వామి బరిలో ఉన్నారు. -
పట్టు కోసం పార్టీల యత్నం
సాక్షి, ఖమ్మం: త్వరలో రానున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ‘పట్టు’కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. జనవరిలో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఇన్నటికే ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తూ ఓటరు సవరణ జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసింది. జిల్లాలో పార్టీల వారీగా బరిలో నిలిచేందుకు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి నూతన రాష్ట్ర శాసనమండలిలో తొలి సారిగా ఎమ్మెల్సీగా అడుగుపెట్టేందుకు పార్టీల నేతలు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ఫొటో గుర్తింపు కార్డుల సంఖ్య జిల్లాలో ప్రారంభమైంది. కంప్యూటరీకరణ, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియతో పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 15న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలో గతంలో 1,34,224 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో జిల్లాలో 42,619 మంది, వరంగల్‌లో 44,512 మంది, నల్లగొండలో 47,093 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 2009లో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 56,546 (42 శాతం ) ఓట్లు పోలయ్యాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ ఓట్లు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో పోలవరం ముంపు మండలాలను మినహాయించి ఎన్నికలు జరగనున్నాయని పార్టీల నేతలు భావిస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గం పరిధిలో నమోదైన ముంపు మండలాల ఓటర్లను మినహాయిస్తే ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచలో మాత్రం ఓటర్ల సంఖ్య పెరగనుంది. బరికి సన్నద్ధం.. గతంలో టీఆర్ఎస్, వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్‌కుమార్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు కపిలవాయి బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు జిల్లా నేతలు క్యూలో ఉన్నారు. ఇటీవల టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరడంతో తన అనుచరుడిని అభ్యర్థిగా బరిలో దించుతారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో బలంగా ఉన్న వాపపక్ష పార్టీలు అభ్యర్థులను గతంలో మాదిరే బరిలోకి దించే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్ జిల్లాలో తన పట్టును సాధించేందుకు అభ్యర్థిని ఎలాగైనా బరిలో దింపాలన్న యోచనలో ఆపార్టీ నేతలున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడం, నల్లగొండలో జిల్లాలో కూడా ఆపార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉండడంతో.. ఆపార్టీ నేతలు కూడా తమ అభ్యర్థిని పోటీకి దించాలన్న యోచనలో ఉన్నారు. ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం శాసనమండలి ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వాహణకు జిల్లా యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేస్తోంది. గ్రాడ్యుయేట్స్ ప్రస్తుత ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ పదవీకాలం 2015 మార్చితో ముగియనుంది. జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంచేస్తోంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంల్, ఖమ్మం, నల్లగొండ స్థానంలో టీఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించింది. రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా దిలీప్‌కుమార్ గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అధికార పార్టీ కావడంతో వరంగల్, నల్లగొండతో పాటు జిల్లాలో కూడా నేతలు బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు చేసేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. గతంలో పోటీచేసిన అభ్యర్థులు : దిలీప్‌కుమార్, దుడ్డుకు వేలాద్రి, పెన్నా అనంతరామశర్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, ఎం. శ్రీనివాస్‌రెడ్డి, గుడిపుడి నర్సింహారావు, పల్లెబోయిన శ్యాంసుందర్, సూరపునేని శేషుకుమార్, కె.రాందాస్.