2 స్థానాలు.. 33 మంది | The Process Of MLC Election Nominations In Karimnagar | Sakshi
Sakshi News home page

2 స్థానాలు.. 33 మంది

Published Fri, Mar 8 2019 10:37 AM | Last Updated on Fri, Mar 8 2019 10:37 AM

The Process Of MLC Election Nominations In Karimnagar - Sakshi

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ మద్దతు కోరుతున్న రాణిరుద్రమ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 22న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 5వ తేదీతో ముగియగా.. పట్టభద్రుల స్థానానికి 35, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పది నామినేషన్లు దాఖలయ్యాయి.

ఈ నామినేషన్లను బుధ, గురువారాల్లో స్క్రూటినీ నిర్వహించిన అధికారులు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి రెండింటిని, పట్టభద్రుల నియోజకవర్గంలో 10 నామినేషన్లను తిరస్కరించినట్లు ప్రకటించారు. దీంతో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 25 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది బరిలో మిగిలారు. కాగా నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగియగా సాయంత్రానికి పోటీలో ఉన్న వారెందరనేది తేలనుంది.

చంద్రశేఖర్‌గౌడ్‌కు ‘గులాబీ’ మద్దతు

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిని పోటీలో పెట్టబోమని టీఆర్‌ఎస్‌ ప్రకటించినప్పటికీ కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ఇస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు ఎంపీ కవిత కూడా ఆయనకు ఆశీస్సులు అందించారు. బుధవారం రాత్రి కరీంనగర్‌లో ఆయన కేటీఆర్‌ను కలవగా పార్టీ నేతల సమక్షంలో గౌడ్‌కు మద్దతు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో బరిలో నిలిచిన మిగిలిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ మద్దతు ఆశించి భంగపడిన యాదగిరి శేఖర్‌రావు, జమాలుద్దీన్‌ నామినేషన్లు దాఖలు చేసిన విషయం విదితమే.

ప్రచారంలో నిమగ్నమైన జీవన్‌రెడ్డి

కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఇప్పటికే జిల్లాల్లో ప్రచారం సాగిస్తున్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలు ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా సుగుణాకర్‌రావు బరిలో ఉన్నారు.

‘యువ తెలంగాణ’ నుంచి రాణిరుద్రమ

యువ తెలంగాణ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ సైతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. పట్టభద్రుల అండతో విజయం సాధిస్తానని చెపుతున్న ఆమె గురువారం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను కలిసి మద్దతు కోరారు.

అభ్యర్థులు వీరే...

స్క్రూటినీ అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బరిలో మిగిలిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. టి.జీవన్‌రెడ్డి(కాంగ్రెస్‌), పి. సుగుణాకర్‌రావు(బీజేపీ), గోగుల రాణిరుద్రమ(యువ తెలంగాణ పార్టీ)తో పాటు గుర్రం ఆంజనేయులు, ఎడ్ల రవికుమార్, కడారి అనంతరెడ్డి, కల్లెం ప్రవీణ్‌రెడ్డి, గంట సంపత్, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌(టీఆర్‌ఎస్‌), ఎం.డీ.జమాలుద్దీన్, డొంకెన రవీందర్‌(తెలంగాణ జన సమితి), దేవునూరి రవీందర్, పరువెల్లి ప్రభాకర్‌రావు, ఎం.బాలనాగసైదులు, యాదగిరి శేఖర్‌రావు, జి.రణజిత్‌ మోహన్, ఎస్‌.రవీందర్‌గౌడ్, వై.రామిరెడ్డి, వంజరి శివకుమార్, శ్రీకాంత్‌ తోడే టి, కె.శ్రీధర్‌ రాజు, షేక్‌షబ్బీర్, సురేష్, అబ్దుల్‌ హమీద్‌ ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూర రఘోత్తంరెడ్డి, బి.కొండల్‌ రెడ్డి, చార్ల మానయ్య, చిట్యాల రాములు, పాతూరి సుధాకర్‌రెడ్డి, బట్టాపురం మోహన్‌రెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి, జి.వేణుగోపాలస్వామి బరిలో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement