సాక్షి, ఖమ్మం: త్వరలో రానున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ‘పట్టు’కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. జనవరిలో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఇన్నటికే ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తూ ఓటరు సవరణ జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసింది. జిల్లాలో పార్టీల వారీగా బరిలో నిలిచేందుకు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి నూతన రాష్ట్ర శాసనమండలిలో తొలి సారిగా ఎమ్మెల్సీగా అడుగుపెట్టేందుకు పార్టీల నేతలు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు.
ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ఫొటో గుర్తింపు కార్డుల సంఖ్య జిల్లాలో ప్రారంభమైంది. కంప్యూటరీకరణ, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియతో పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 15న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలో గతంలో 1,34,224 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో జిల్లాలో 42,619 మంది, వరంగల్‌లో 44,512 మంది, నల్లగొండలో 47,093 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
2009లో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 56,546 (42 శాతం ) ఓట్లు పోలయ్యాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ ఓట్లు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో పోలవరం ముంపు మండలాలను మినహాయించి ఎన్నికలు జరగనున్నాయని పార్టీల నేతలు భావిస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గం పరిధిలో నమోదైన ముంపు మండలాల ఓటర్లను మినహాయిస్తే ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచలో మాత్రం ఓటర్ల సంఖ్య పెరగనుంది.
బరికి సన్నద్ధం..
గతంలో టీఆర్‌ఎస్, వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్‌కుమార్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు కపిలవాయి బీజేపీలో చేరడంతో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు జిల్లా నేతలు క్యూలో ఉన్నారు. ఇటీవల టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో తన అనుచరుడిని అభ్యర్థిగా బరిలో దించుతారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో బలంగా ఉన్న వాపపక్ష పార్టీలు అభ్యర్థులను గతంలో మాదిరే బరిలోకి దించే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్ జిల్లాలో తన పట్టును సాధించేందుకు అభ్యర్థిని ఎలాగైనా బరిలో దింపాలన్న యోచనలో ఆపార్టీ నేతలున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించడం, నల్లగొండలో జిల్లాలో కూడా ఆపార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉండడంతో.. ఆపార్టీ నేతలు కూడా తమ అభ్యర్థిని పోటీకి దించాలన్న యోచనలో ఉన్నారు.
ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం
శాసనమండలి ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వాహణకు జిల్లా యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేస్తోంది. గ్రాడ్యుయేట్స్ ప్రస్తుత ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ పదవీకాలం 2015 మార్చితో ముగియనుంది. జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంచేస్తోంది.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంల్, ఖమ్మం, నల్లగొండ స్థానంలో టీఆర్‌ఎస్ రెండు సార్లు విజయం సాధించింది. రెండు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దిలీప్‌కుమార్ గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ అధికార పార్టీ కావడంతో వరంగల్, నల్లగొండతో పాటు జిల్లాలో కూడా నేతలు బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు చేసేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి.
గతంలో పోటీచేసిన అభ్యర్థులు : దిలీప్‌కుమార్, దుడ్డుకు వేలాద్రి, పెన్నా అనంతరామశర్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, ఎం. శ్రీనివాస్‌రెడ్డి, గుడిపుడి నర్సింహారావు, పల్లెబోయిన శ్యాంసుందర్, సూరపునేని శేషుకుమార్, కె.రాందాస్.
పట్టు కోసం పార్టీల యత్నం
Published Wed, Nov 12 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement