గోధుమ, కందిపప్పు దిగుమతిపై 10% పన్ను
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి అయ్యే గోధుమ, కందిపప్పులపై 10 శాతం పన్ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఈ రెండు పంటల దిగుబడి ఈ ఏడాది భారీగా ఉండనుం దనే అంచనాల నడుమ..ఒక్కసారిగా ధరలు పడిపోయి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్‌సభలో చెప్పారు.
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అంగీకరించే విధంగా దివ్యాంగుల కోసం ఓ ప్రత్యేక గుర్తింపు కార్డును తీసుకొస్తామని సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ లోక్‌సభకు తెలిపారు. ఒకే గుర్తింపు కార్డుతో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ వారికోసం అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను పొందడానికి వీలవుతుందని ఆయన చెప్పారు.
► దేశంలోని మొత్తం శత్రు ఆస్తుల విలువ రూ.1.04 లక్షల కోట్లని హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ లోక్‌సభలో వెల్లడించారు. అలాగే మరో ప్రశ్న కు బదులిస్తూ ఢిల్లీలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లలో గత మూడేళ్లలో 73 చోరీ కేసులు నమోదయ్యాయని హన్స్‌రాజ్ తెలిపారు.
కాషాయం దుస్తుల్లో స్పీకర్
గుడీ పడ్వా పర్వదినం సందర్భంగా స్పీకర్ సుమిత్ర మహాజన్ మంగళవారం లోక్‌సభకు కాషాయ దుస్తుల్లో హాజరవడంతో ఓ మహారాష్ట్ర ఎంపీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మేడమ్, నా సొంత రాష్ట్రంలో పండుగను జరుపుకోలేక పోతున్నందుకు నేను కాస్త అసంతృప్తితో ఉన్నాను. పండుగ రోజున కాషాయం రంగు దుస్తులు ధరించినందుకు మీకు ధన్యవాదాలు’అని ముంబై–ఉత్తర నియోజకవర్గ ఎంపీ గోపాల్ చినయ్య శెట్టి అన్నారు. దీంతో సభలో నవ్వుల పువ్వులు విరిశాయి.