Gramina bank
-
రాయలసీమకు అన్యాయం చేయద్దు!
కడప కేంద్రంగా 2006లో రాయలసీమ, అనంత, పినాకిని గ్రామీణ బ్యాంకుల విలీనంతో ‘ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు’ (ఏపీజీబీ) ప్రారంభమైంది. గత 18 ఏళ్లలో, స్థానిక అవసరాలకు అనుగుణంగా, కొత్త సాంకేతిక తను స్వీకరిస్తూ, మంచి వ్యాపార ఫలితాలతో 10 జిల్లాల పరిధిలో పనిచేస్తున్నది. రాజకీయ అనిశ్చితులు, మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తన పరిధిలో వెనకబడిన ప్రాంతాల స్థానిక అభివృద్ధికి ఆసరాగా నిలిచింది. ఈ రోజు, దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ బ్యాంకుగా పేరు తెచ్చుకుంది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ‘వన్ స్టేట్, వన్ రూరల్ బ్యాంక్’ విధానంతో రాష్ట్ర స్థాయిలో ఒకే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో... ఏపీజీబీ భవి ష్యత్తు ఏమిటి? దాని ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగితే ఈ ప్రాంతానికి ఎంత మేలు జరుగుతుంది? అమరావతికి తరలిపోతే రూరల్ బ్యాంకింగ్ లక్ష్యాలకు, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎంత నష్టం వాటిల్లుతుంది అన్న ప్రశ్నలపై లోతైన చర్చ అవసరం.గతంలో పినాకిని (నెల్లూరు), అనంత (అనంత పురం), రాయలసీమ (కడప) గ్రామీణ బ్యాంకులు విలీనమైనప్పుడు, రాయలసీమ బ్యాంకు అతిపెద్దది కావడంతో ప్రధాన కార్యాలయం కడపలో ఏర్పాటైంది. ఈ సంప్రదాయం ఇప్పుడూ కొనసాగాలి. ప్రస్తుతం, ఏపీజీబీలో చిత్తూరు కేంద్రంగా ఉన్న సప్తగిరి,గుంటూరు కేంద్రంగా ఉన్న చైతన్య గోదావరి, వరంగల్ కేంద్రంగా ఉన్న ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులు విలీనం కానున్నాయి. వ్యాపారం, ప్రత్యేకతలు, సామర్థ్యం... ఇలా ఏ కోణంలో చూసినా ఈ నాలుగు గ్రామీణ బ్యాంకులలో ఏపీజీబీ అగ్రగామి. అందుకే, కొత్త రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యా లయం కడపలోనే ఉండాలి.2024 నవంబర్ 4న కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్.ఆర్.బి. విభాగం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, విలీనం తర్వాత ప్రధాన కార్యాలయం అతిపెద్ద బ్యాంకు యొక్క కేంద్రంలోనే ఉండాలి. ఈ మార్గదర్శకాన్ని గౌరవించాలి.అమరావతి వాదన ఎవరి కోసం?రాష్ట్ర రాజధానిలో ప్రధాన కార్యాలయం ఉండా లన్న వాదన ప్రజల మనోభావం కాదు – ఇది స్పాన్సర్ బ్యాంకుల రాజకీయం, పాలకవర్గాల స్వార్థం. అమరా వతిని ముందుకు తెచ్చే ఈ ప్రయత్నం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కేంద్రీకృత అభివృద్ధికి ప్రాతినిధ్యం వహించే సిఫారసులు, కేంద్రం యొక్క విభజన హామీల నిర్లక్ష్యం ఉన్నాయి. ఇది రాజకీయ ఒత్తిడికి లోనైన నిర్ణయమే అవుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని చాలా గ్రామీణ బ్యాంకులు రాజధానుల్లో కానీ, రాష్ట్రం నడిబొడ్డున కానీ లేకుండానే విజయవంతంగా నడుస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ (నహర్లగున్), కేరళ (మళప్పురం), మహారాష్ట్ర (ఔరంగాబాద్), పంజాబ్ (కపుర్తలా) గ్రామీణ బ్యాంకులు ఇందుకు ఉదా హరణలు. ఈ వాస్తవాన్ని విస్మరించరాదు. రాయల సీమకు రాష్ట్రావతరణ నుంచీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ బ్యాంకును అమరావతికి తరలించి మరో అన్యాయానికి ప్రభుత్వం పాల్పడ కూడదు.ఏపీజీబీ దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ బ్యాంకు. రాష్ట్ర గ్రామీణ బ్యాంకుల వ్యాపారంలో 43 శాతం (రూ. 56,056 కోట్లు) దీనిదే. 25.65 శాతం మూలధన సామర్థ్యం, 86.75 లక్షల కస్టమర్లు, 551 శాఖలు,రూ. 1,400 కోట్ల రిజర్వులు– ఇవన్నీ ఏపీజీబీ ఔన్న త్యాన్ని చాటుతాయి. కిసాన్ కార్డులు, ఎమ్ఎస్ఎమ్ ఈలకు రూ. 50 లక్షల రుణాలు, 2,934 ఆర్థిక సాక్షరతా శిబిరాల ఏర్పాటు వంటి సేవలను 2,775 గ్రామాలకు అందించడం ద్వారా... మొత్తం రాయలసీమలోనే కాక, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సైతం ప్రజల జీవనోపాధి పెరగడానికి కారణమయ్యింది. అటువంటి బ్యాంకు అమరావతికి తరలితే, ఈ రూరల్ ఎకోసిస్టమ్ కుప్ప కూలుతుంది.రూరల్ బ్యాంకింగ్ లక్ష్యం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి. కడప ప్రధాన కేంద్రంగా ఏపీజీబీ ఈ లక్ష్యాన్ని నెరవేర్చింది. ‘అమరావతి’ రాజకీయ కేంద్రీ కరణకు ప్రతీక అయితే, ‘కడప’ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆలంబన. ఇక్కడి పౌర సమాజం, రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాలు అందరూ అమరావతికి ఏపీజీబీ తరలింపును వ్యతిరేకిస్తున్నారు. అధికార పక్షా నికి కడప పట్ల సానుకూలత ఉన్నా, నాయకుడిని కాదని బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి. వైసీపీ ఎంపీలు అమరావతికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తారు, కేంద్రానికి లేఖలు రాశారు. కాబట్టి కడపకు అనుకూలంగా ఉన్న ఈ ఏకాభిప్రాయాన్ని కాదనడం అన్యాయం. అవసరమైతే, అమరావతిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయవచ్చు. ఒకవేళ కడపలో కేంద్ర కార్యాలయం ఉంచడం సాధ్యం కాకపోతే ఏపీజీబీ, సప్తగిరి బ్యాంకులను రాష్ట్ర స్థాయి విలీన ప్రక్రియ నుంచి మినహాయించాలి. ఆ రెండు బ్యాంకులను మాత్రమే విలీనం చేసి కడప కేంద్రంగా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి నడపాలి. ఏపీజీబీ 18 ఏళ్ల అనుభవం, నెట్వర్క్,సాంకేతికత రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఆధారం. అందువల్ల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలి. రాయలసీమ ఆర్థిక భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలి!రఘునాథరెడ్డి అలవలపాటి వ్యాసకర్త రాయలసీమ ఆకాంక్షల పౌరవేదిక కోఆర్డినేటర్ ‘ 85238 41285 -
నిధుల దుర్వినియోగం కేసు; బ్యాంకు మేనేజర్ అరెస్ట్
సాక్షి, అత్తిలి( పశ్చిమగోదావరి) : బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిన కేసులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ పోతాప్రగడ రామ సూర్య కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు తణుకు సీఐ డి.ఎస్.చైతన్యకృష్ణ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన కిరణ్‌కుమార్ 2015–16 మధ్యకాలంలో బ్యాంకును మోసం చేసి రూ.37 లక్షలను స్వాహా చేశాడు. రైతుల ఆధార్‌కార్డులతో 11 జాయింట్ లయబిలిటి గ్రూపులను ఏర్పాటు చేసి, ఒక్కొక్క గ్రూపునకు రూ. 3 లక్షలు చొప్పున రూ.33 లక్షలతో పాటు మరో 8 మంది రైతుల పేరున రూ.4 లక్షలు పంట రుణాలుగా మంజూరు చేశాడు. రైతుల సంతకాలు, వ్యవసాయశాఖ మండల అధికారి సంతకాలను బ్యాంకు మేనేజర్ పోర్జరీ చేశాడు. తప్పుడు రికార్డులు సృష్టించి మొత్తం రూ.37 లక్షల బ్యాంకు నిధులను స్వప్రయోజనాల కోసం కిరణ్‌కుమార్ వాడుకున్నాడు. రైతులు పేరున తీసుకున్న రుణాలు తిరిగిచెల్లించకపోవడంతో తరువాత కాలంలో వచ్చిన మేనేజర్ రైతులకు నోటీసులు జారీ చేయడంతో నిధులు దుర్వినియోగం విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బ్యాంకు మేనేజర్ కిరణ్‌కుమార్ బ్యాంకు నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణకు వచ్చి 2019 సెప్టెంబర్ 14న అప్పటి మేనేజర్ జి.శ్రీనివాస్ అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు పోతాప్రగడ వెంకట రామసూర్య కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి తణుకు కోర్టుకు హాజరు పర్చగా, 2వ అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్.మేరి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. -
విరివిగా రుణాలు..!
నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు విరివిగా అందజేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నిర్ణయించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రైతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాలు, ఉన్నత చదువుల కోసం రైతుల బిడ్డలకు రుణాలు అందజేయనుంది. పంట రుణాలను ఇవ్వడంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న డీసీసీబీ ఈ సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి మొత్తం రూ.450 కోట్ల పంట రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఖరీఫ్‌లో రూ.270 కోట్లు, రబీలో రూ.180 కోట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం సుమారు రూ.20 కోట్ల మేరకు దీర్ఘకాలిక రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయేతర రుణాలు సైతం.. జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 స్వయం సహాయక సంఘాలకు డీసీసీబీ ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ.40 కోట్ల వరకు రుణాలను ఇవ్వనుంది. వివిధ సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతుల బిడ్డల ఉన్నత చదువులకు లోన్స్ అందజేయనుంది. ఇందుకు అన్ని పత్రాలను సమర్పించిన వారం రోజుల్లోగా విద్యా రుణాలను అందించాలని నిర్ణయించింది. ఒక్కో విద్యార్థికి రూ.30 లక్షల వరకు రుణం ఇవ్వాలని యోచిస్తోంది. విద్యారుణాల కోసం ఎక్కువ డిమాండ్ ఉండడంతో గత సంవత్సరం కంటే రెట్టింపు స్థాయిలో విద్యార్థులకు రుణాలను ఇవ్వాలని భావిస్తోంది. ఎక్స్‌ప్రెస్ గోల్డ్ లోన్ పథకాన్ని ప్రారంభించి గ్రాము బంగారంపై రూ.2200 వరకు తక్కువ వడ్డీతో ఆరునెలల కాలపరిమితిలో చెల్లించే విధంగా రుణాలను ఇవ్వడాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అదే విదంగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలను ఇవ్వాలని భావిస్తోంది. ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇవ్వడానికి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 13 ఏటీఎంలతో పాటు మొబైట్ ఏటీఎంలు సమకూర్చుకుని ఆదాయాన్ని పెంచుకుంటున్న జిల్లా సహకార బ్యాంకు నూతనంగా మఠంపల్లి, మునగాల, మునుగోడులో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏటీఎంల ద్వారా ప్రజలకు తమ సేవలను మరింత విస్తరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం.. 2008 సంవత్సరంలో రుణమాఫీ అర్హత పొందని రైతులకు వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించా రు. అసలు వడ్డీపై 35 శాతం తగ్గించి రుణాల ను చెల్లించే వెÐðసులుబాటును కల్పిలంచారు. జూన్ 30 వరకు చెల్లించే వారికి వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దాంతో పాటు బ్యాంకులో పేరుకుపోయిన వ్యవయేతర రుణాలను చెల్లించే వారికి సైతం వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం ఇవ్వనున్నా రు. రుణానికి సమానంగా వడ్డీ చెల్లించే వెసులుబాటును కూడా కల్పించి పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రికవరీ బృందాలను ఏర్పాటు చేసి వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా బకాయిలు వసూలు చేసుకునే పనిలో బ్యాంకు అధికారులు నిమగ్నమయ్యారు. బ్యాంకు అభివృద్ధికి సహకరించాలి రైతులకు విరివి గా రుణాలు ఇ వ్వాలని నిర్ణయించాం. రైతులతో పాటు ఉ ద్యోగులు, ఇతర వ్యాపారవర్గాలు తమ నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకు అబివృద్ధికి సహకరించాలి. పంట రుణాలను ఇవ్వడంతో అన్ని బ్యాంకులకంటే తామే ముందుం టున్నాం. పేరుకుపోయిన బకాయిల కోసం వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం కల్పించాం. రుణాల ను సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి దోహదపడాలి. – కె.మదన్మోహన్, డీసీసీబీ, సీఈఓ -
న్యూఇయర్ వేడుకల్లో జనాలు, దొంగలు మాత్రం..
సాక్షి, రంగారెడ్డి : అందరూ న్యూ ఇయర్ వేడుకలో మునిగి తేలుతుండగా.. దొంగలు మాత్రం అదే అదునుగా చూసుకున్నారు. తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం రగన్నగుడ గ్రామంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దుండుగులు చోరికి ప్రయత్నించారు. బ్యాంకు వెనుక నుంచి గోడకు రంధ్రం చేసి బ్యాంకు లోపలికి ప్రవేశించారు. బ్యాంకు లోపల లాకర్ తెరవడంలో మాత్రం విఫలయత్నం పొందారు. లాకర్ తెరుచుకోకపోవడంతో, దుండగులు వెనుదిరిగి వెళ్లిపోయినట్టు తెలిసింది. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఉండగా.. దుండగులు ఈ చోరికి ప్రయత్నించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అక్కడున్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. -
న్యూ ఇయర్ వేళ బ్యాంక్ చోరీకి విఫలయత్నం
-
కాటారం డీజీబీలో బంగారం మాయం?
కాటారం, న్యూస్‌లైన్: కాటారం దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో ఓ ఖాతాదారుడు రుణం కోసం తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది! ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, డీజీబీ రీజినల్ మేనేజర్ విచారణ ప్రారంభించారు. ఇది ఇంటిదొంగల పనేనని అనుమానాలు వ్యక్తమవుతుండడంతో బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన వారు ఆందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రానికి చెందిన బొల్లం రాజబాపు గత ఆగస్టులో తన అవసరాల నిమిత్తం సుమారు 9తులాల బంగారాన్ని బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.1.08 లక్షలు రుణం పొందాడు. బుధవారం బ్యాంక్‌లో తాకట్టు పెట్టి న తన బంగారాన్ని విడిపించుకోవడం కోసం వడ్డీతో కలిపి రూ.1.23 లక్షలు చెల్లించాడు. బంగారం లాకర్లో భద్రపర్చి ఉందని, లంచ్‌టైం తర్వాత వచ్చి తీసుకువెళ్లాలని బ్యాంక్ అధికారులు ఆయనకు సూచించారు. వా రు చెప్పిన సమయానికి బాధితుడు బ్యాంక్‌కు రాగా బం గారం దొరకడం లేదని, మరునాడు రావాలని కోరారు. రాజబాపు గురువారం ఉదయం బ్యాంక్‌కు చేరుకోగా.. బంగారం కోసం వెతుకుతున్నామని, సమయం పడుతుందన్నారు. ఆయన సాయంత్రం వరకు వేచి చూశా డు. వారి నుంచి స్పందన లేకపోవడంతో వాగ్వాదానికి దిగాడు. దీంతో దిగి వచ్చిన అధికారులు బాధితుడికి న చ్చజెప్పి బంగారం వెతికి అప్పజెప్పుతామని సమయం కోరినట్లు తెలిసింది. ఈ విషయం ఆ నోటా ఈనోటా రా త్రి బయటకు పొక్కింది. సమాచారం అందుకున్న బ్యాంక్ రీజినల్ మేనేజర్ హుటాహుటిన కాటారం చేరుకుని విచారణ చేపట్టారు. కొన్ని రోజులుగా సీసీ కెమెరా ల్లో నిక్షిప్తమైన వీడియో రికార్డులు పరిశీలిస్తున్నట్లు స మాచారం. బంగారం మాయం వెనుక సిబ్బంది హస్త మున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా మరి కొంత బం గారం సైతం మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. అకౌంటెంట్, క్యాషియర్ తప్పిదమేనా...? బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన పూర్తి బాధ్యత అ కౌంటెంట్, క్యాషియర్ పైనే ఉంటుంది. బ్యాంక్‌లో నిల్వ ఉండే సొమ్ము, బంగారం ఆభరణాలు భద్రపర్చాల్సిన బాధ్యత వారిదే. తాళాలు సైతం వారిద్దరి దగ్గరే ఉంటా యి. వీరిని కాదని లాకర్లను తెరిచే అధికారం ఎవరికీ ఉండదు. బంగారం మాయం కావడంపై వీరి తప్పిదం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే కానీ ఇది ఇంటి దొంగల ప నా... లేక ఇతరుల ప్రమేయం ఉందా అన్న నిజం బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఈ విషమయై బ్యాంక్ మే నేజర్ రాంచంద్రంరావును వివరణ కోరగా.. బంగారం మాయమైన విషయం వాస్తవమేనని, నిందితులు ఎవరైనా ఉపేక్షించబోమని అన్నారు.