లాడెన్ ఇల్లు శ్మశానమా, ప్లే గ్రౌండా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో ఐదేళ్ల క్రితం అమెరికా నిర్వహించిన ఆపరేషన్‌లో మరణించిన అంతర్జాతీయ టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్ నివాసాన్ని ఇప్పుడు ఏం చేయాలి? అన్న అంశంపై పాక్ సైన్యానికి, స్థానిక రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గొడవ జరుగుతోంది. దాన్ని శ్మశాన వాటిక చేయాలని ఇప్పటికే అక్కడ ప్రహారి గోడను నిర్మించిన సైన్యం వాదిస్తుండగా, పిల్లల ప్లే గ్రౌండ్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ స్థలం దాదాపు 3,800 చదరపు గజాలు ఉంది.
2011లో అమెరికా సైన్యం నిర్వహించిన ప్రత్యేక కమాండో ఆపరేషన్‌లో అక్కడున్న ఇంట్లో ఒసామా బిన్ లాడెన్ మరణించాడు. అనంతరం అదొక స్మారక కేంద్రంగా మారకూడదనే ఉద్దేశంతో స్థానిక రాష్ర్ట ప్రభుత్వం అక్కడున్న భవనాన్ని కూల్చేసింది. ఆ తర్వాత పాక్ సైన్యం ఆ స్థలానికి మూడు పక్కల ప్రహారి గోడను నిర్మించింది. 'ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా మేము రక్షిస్తూ వచ్చాం. ఆ ప్రాంతంలో శ్మశాన స్థలం దొరక్క చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే దీన్ని శ్మశాన స్థలంగా మారిస్తేనే బాగుంటుంది' అని సైన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న అబోటాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఉపాధ్యక్షుడిగా ఉన్న జుల్ఫికర్ అలీ భుట్టో మీడియాతో వ్యాఖ్యానించారు.
'అక్కడ శ్మశానం నిర్మించేందుకు మేం ఏమాత్రం ఒప్పుకోం. ఈ ఏడాది నిధులు విడుదల కాగానే మేము అక్కడ పిల్లల క్రీడా స్థల నిర్మాణ పనులు చేపడతాం'అని కైబర్ ఫంఖ్తుక్వా ప్రొవిజనల్ ప్రభుత్వానికి చెందిన ముస్తాక్ ఘని స్పష్టం చేశారు. ఇళ్ల మధ్యన శ్మశానాన్ని నిర్మించేందుకు ప్రజలెవరూ ఒప్పుకోరని, అక్కడ తాము మూడు ప్లే గ్రౌండ్లను నిర్మించాలనుకుంటున్నామని ముస్తాక్ వ్యాఖ్యానించారు. తమ పరిధిలో ఉన్న ఆ వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునే అధికారం తమకుందని, త్వరలోనే ప్రావిన్స్ ప్రభుత్వాన్ని తాము కలుసుకొని సమస్యను పరిష్కరించుకుంటామని భుట్టో తెలిపారు.