సర్దుకు పోవద్దు.. సర్దుకుందాం ఇలా..!
కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకోవడంలో మొదటి మెట్టు... వంట పూర్తి కాగానే.. కిచెన్ ప్లాట్‌ఫామ్, స్టౌను వెంటనే శుభ్రం చేసేసుకోవడం. స్టవ్ మీద, ప్లాట్‌ఫామ్ మీదా మనం వండిన వంటలోని చిందులు, నూనె మరకలు పడటం సహజం. అలాంటి వాటిని వంట అవగానే వెంటనే తుడిచేయాలి. గోరువెచ్చటి నీళ్లలో వెనిగర్ కలిపి శుభ్రం చేస్తే.. క్రిములు తొలగిపోతాయి. స్టౌ మీద పడిన నూనె మరకలను తొలగించడానికి, కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రం చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్‌ని ఉపయోగించచ్చు.
అవి కాసింత ఖరీదైనవి కావడం వల్ల చాలామంది కిచెన్ టవల్స్నే వాడతారు. ఒకోసారి కిచెన్‌లో నూనె ఒలికిపోతుంటుంది. వెంటనే ఆ నూనె మీద గోధుమ పిండి లేదా బియ్యప్పిండిని చల్లి కాసేపటి తరువాత పేపర్‌తో తుడిస్తే జిడ్డులేకుండా శుభ్రపడుతుంది.
కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై మరకలు ఉంటే..
వంటసోడా వేసిన నీళ్లతో కిచెన్ ప్లాట్‌ఫామ్ తుడిస్తే చాలు. అంతేకానీ బ్లీచింగ్, అమోనియా లాంటివి వాడటం వల్ల క్యాబినెట్కున్న రంగులు, టైల్స్ దెబ్బతింటాయి. కూరగాయలు తరగడం పూర్తయిన వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయకపోతే అక్కడున్న తేమ, కాయగూరల అవశేషాలు వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల్ని త్వరగా ఆకర్షిస్తాయి. తరిగేటప్పుడే ఓ డబ్బా పెట్టుకొని, తొక్కలు, తొడిమల్లాంటివి దాంట్లో వేసి తర్వాత చెత్తడబ్బాలో పడేస్తే.. శుభ్రంగా ఉంటుంది.
కిచెన్ టవల్స్‌ను కూడా...
కిచెన్ ప్లాట్‌ఫామ్‌ని, స్టవ్నీ క్లీన్ చేసేందుకు ఉపయోగించే కిచెన్ టవల్ని సరిగా శుభ్రం చేయకపోతే దానికి ఉండే బ్యాక్టీరియా వల్ల అంతవరకు మనం చేసినదంతా నిరర్థకమవుతుంది. కిచెన్ టవల్స్ జిడ్డుగా ఉంటే గోరువెచ్చని నీటిలో సర్ఫ్, వాషింగ్ లిక్విడ్ వేసి కాసేపు నానబెట్టిన తర్వాత బట్టలుతికే బ్రష్‌తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతాయి.
కిచెన్ క్యాబినెట్
కిచెన్ ప్లాట్‌ఫామ్ కింద లేదా పైన సామాన్లు పెట్టుకోవడం కోసం ఉంచిన ర్యాక్స్, క్యాబినెట్ పుల్స్, హ్యాండిల్స్‌పై కూడా సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటిని క్రిమిసంహారక వైప్‌తో క్లీన్ చేస్తే మంచిది. వెనిగర్‌ని క్లాత్‌పై స్ప్రే చేసి వాడండి. దీనివల్ల వేలిముద్రలు, నీటి గుర్తులు పోయి తెల్లగా మెరుస్తాయి.
ఫ్రిజ్ క్లీన్‌గా..
ఫ్రిజ్‌లో మనం చాలా స్టఫ్ పెడుతుంటాం. కానీ, దానిని ఎప్పుడో ఓసారి క్లీన్ చేస్తుంటాం. అలా కాకుండా దీనిని కూడా మరకలు లేకుండా శుభ్రంగా తుడవడం మంచిది. ఫ్రిజ్ కింద, డోర్స్, లోపల గ్లాసెస్.. ఇలా అన్నింటిని తడిగుడ్డతో తుడిస్తే త్వరగా క్లీన్ అవుతుంది. ఇక మిగిలిపోయిన ప్రతిదానిని ఫ్రిజ్‌లో తోసేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం చాలా మంచిది.
సింక్ క్లీన్..
కిచెన్ క్లీన్ చేయాలంటే ముందుగా సింక్‌ని క్లీన్ చేయాలి. సింక్ బేసిన్ నీట్‌గా ఉందో లేదో చూసుకోండి. కౌంటర్ చుట్టూ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటివి దూరమవుతాయి. అందుకే, ముందు దీనిని క్లీన్ చేయండి. సింక్ సరిగ్గా లేకపోతే అందులో నుంచే ఎక్కువ బొద్దింకలు, వాటి ద్వారా వ్యాధులు వస్తాయి. కొద్దిగా బ్లీచింగ్ పౌడర్, డిష్‌వాష్, బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే సరి. సింక్‌లో మాంసాహారం కడిగిన తర్వాత దాన్ని సోప్ వాటర్‌తో శుభ్రం చేసేస్తే సింక్ దుర్వాసన రాకుండా ఉంటుంది.
కాస్త తీరిక దొరికినప్పుడు ఓ క్లాత్ తీసుకుని వాటర్ స్ప్రే చేస్తూ కిచెన్ గోడలు, కౌంటర్స్‌ని క్లీన్ చేయండి. ఇందుకోసం మార్కెట్లో దొరికే స్ప్రేలను కూడా ఉపయోగించవచ్చు.. ఇప్పుడు డోర్ ఫ్రేమ్స్‌ని క్లీన్ చేయండి. వంటగదిని అన్ని వస్తువులు సులభంగా దొరికేలా సర్దుకుంటే వంట చేయడం ఈజీ అవుతుంది. ఎలాగో చూద్దాం...
ట్రాన్స్పరెంట్ డబ్బాలు
వంట చేసుకునేప్పుడు ఏ డబ్బాలో ఏముందా? అని వెతుక్కోవడానికే సమయం వృథా అవుతుంది. అలా కాకుండా షెల్ఫుల్లో ట్రాన్స్పరెంట్గా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు లేదా స్టీల్ డబ్బాలూ గాజు సీసాలూ అందుబాటులో ఉంటాయి. వాటిని ప్రయత్నించి చూడండి. పని సులభం అవుతుంది.
సరుకులనూ వేరు చేయడం
వంట గదిలో షెల్ఫులలో అన్ని సరుకుల్ని అన్ని షెల్ఫుల్లో సర్దేయకుండా ఎక్కువగా వంటకు వాడే వాటిని ఒకచోట, తక్కువగా వాడే పదార్థాల్ని వేరే షెల్ఫులో, బేకింగ్ సామగ్రిని మరో దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది.
(చదవండి: కార్ డిజైనర్ థార్ డిజైనర్!)