Greater Kailash
-
దిగ్గజాల రాజకీయ క్షేత్రంలో కులానిదే బలం!
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, డిఫెన్స్ కాలనీ వంటి సంపన్న కాలనీలతోపాటు దేవ్లీ వంటి కుగ్రామాలతో కూడిన దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం దిగ్గజాలు పోటీపడిన రాజకీయ క్షేత్రంగా గుర్తింపు పొందింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు పరాజయాన్ని చవిచూపించి, ఎన్నికల రాజకీయాలంటే ఆయనకు దడ పుట్టించిన నియోజకవర్గమిదే. బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ కూడా రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. కుల సమీకరణాలకే పెద్దపీట వేసే ఈ నియోజకవర్గంలో కుల సమీకరణాలు 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో మారిపోయాయి. అంతవరకు పంజాబీ, సిక్కు ఓటర్లు అధికంగా ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దింపేవి. కానీ 2008 తర్వాత నియోజకవర్గంలో జాట్, గుజ్జర్ ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది. దానితో రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యాలను కూడా మార్చాయి. గత ఎన్నికలలో కాంగ్రెస్ జాట్ కులానికి చెందిన రమేష్ కుమార్‌ను బరిలోకి దింపగా, బీజేపీ గుజ్జర్ కులానికి చెందిన రమేష్ బిధూరీని నిలబెట్టింది. ఈ సారి ఎన్నికల్లో కూడా ఈ పార్టీలు ఈ ఇద్దరికే మళ్లీ టికెట్లను ఇచ్చాయి. మోడీ మేనియాపైనే బీజేపీ ఆశలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం నేపథ్యంలో రమేష్ కుమార్‌ను కాకుండా మరో అభ్యర్థిని బరిలోకి దింపాలనుకున్న కాంగ్రెస్ ఆఖరి క్షణంలో మళ్లీ ఆయనకే మళ్లీ టికెట్ ఇచ్చింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో ముక్కోణపు పోరు జరిగినప్పటికీ దక్షిణ ఢిల్లీ ఓటర్లు బీజేపీ వైపే అధిక మొగ్గు చూపారు. ఈ నియోజకవర్గం పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ఏడింటిని బీజేపీ దక్కించుకుంది. దీంతో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం తనదే అన్న ధీమాతో ఉంది. అందుకే గత లోక్‌సభ ఎన్నికలలో 93 వేల ఓట్ల తేడాతో రమేష్ కుమార్ చేతిలో ఓడిపోయిన రమేష్ బిధూరీకే మళ్లీ టికెట్ ఇచ్చింది. రమేష్ బిధూరీ తుగ్లకాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసన భ్యునిగా ఎన్నికయ్యారు. గుజ్జర్ ఓట్లతో పాటు నరేంద్ర మోడీ చరిష్మా బిధూరీని గెలిపిస్తుందని ఆ పార్టీ నమ్ముతోంది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు జాట్ అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం వల్ల జాట్ ఓట్లు చీలవచ్చని, అదీకాక ముజఫర్‌నగర్ అల్లర్ల ప్రభావం వల్ల జాట్ ఓటర్లు తమకు మద్దతు ఇవ్వవచ్చని బీజేపీ ఆశిస్తోంది. ఆప్నే గెలిపిస్తారు: సెహ్రావత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండింటి ఓటు బ్యాంకును కొల్లగొట్టి మూడు సీట్లను గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ దేవేంద్ర సెహ్రావత్‌కు టికెట్ ఇచ్చింది. రిటైర్డ్ కల్నల్ దేవేంద్ర సె్రహావత్ మహిపాల్‌పూర్‌కు చెందిన జాట్ నాయకుడు. ఐదారు సంవత్సరాలుగా స్థానికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. గ్రామపంచాయతీ స్థలాన్ని స్వాధీనపర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. దక్షిణ ఢిల్లీలో నీటి ఎద్దడిని పరిష్కరించడానికి జలాశయాలను సంరక్షించాలని ప్రచారోద్యమం జరిపారు. ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బిజ్వాసన్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పరిస్థితి మారిపోయిందని, అప్పట్లో ఆప్ అంటే తెలియక చాలా మంది ఓటర్లు ఆప్‌కు ఓటేయలేదని, ఇప్పుడు ప్రజల మద్దతు తనకు ఉందని సెహ్రావత్ అంటున్నారు. కుల సమీకరణాల కన్నా ప్రజా సమస్యలు ఎన్నికల్లో అధిక ప్రభావం చూపుతాయని ఆయన అంటున్నారు. నీటి ఎద్దడి ఇక్కడి ప్రధాన సమస్య. ట్యాంకర్ మాఫియాను ఎదుర్కొనే సాహసాన్ని ఆప్ సర్కారు చూపిందని, అందువల్ల కులసమీకరణాలు ఎలా ఉన్నా ఓట్లు తనకే అంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రెండేసి రోజులు గడిపి, స్థానికుల సమస్యలను తెలుసుకునే లా వ్యూహం రూపొందించిన ట్లు ఆయన చెప్పారు. -
‘కైలాసం’ కమలనాథులదేనా?
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ కైలాష్‌లో పోటీపడుతున్న నేతల్లో ఎవరూ సొంత చరిష్మాతో గట్టేక్కే అవకాశం కనిపించడంలేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేతలందరూ ఇతరుల చరిష్మాతోనే గెలుపొందే అవకాశాలను మెరుగుపర్చుకుంటున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి అజయ్‌కుమార్ మల్హోత్రా, కాంగ్రెస్ నుంచి వీరేందర్ కసానా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సౌరభ్ భరద్వాజ్‌లు పోటీ పడుతున్నారు. టికెట్ కోసం బీజేపీలో ఆసక్తికర పోరు.. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం టికెట్ కోసం బీజేపీ నేతలు పోటీపడిన తీరు ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికను ఆసక్తికరంగా మార్చాయి. పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్‌కుమార్ మల్హోత్రా ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీకి కంచుకోటగా పేరొందిన ఈ నియోజకవర్గం టికెట్‌ను ఆయన తన కుమారుడు అజయ్ మల్హోత్రాకు ఇప్పించుకునే ప్రయత్నంలో సఫలమయ్యారు. దీంతో ఈ నియోజకవర్గం టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించిన మరో నేత విజయ్ జోలీకి నిరాశే ఎదురైంది. కాగా రాజకీయాల్లో ఇంకా ఓనమాలు దిద్దుతున్నా తండ్రి చరిష్మా అజయ్‌ను గెలిపిస్తుందని చెప్పుకుంటున్నారు. ఇదిలాఉండగా ఈ నియోజకవర్గం సీటుకోసం కాంగ్రెస్, ఆప్‌లలో పెద్దగా పోటీ నెలకొనలేదు. కాంగ్రెస్ నుంచి చిత్తరంజన్ పార్క్ కౌన్సిలర్ వీరేందర్ కసానా పోటీ చేస్తున్నారు. బీజేపీ కంచుకోటగా చెప్పుకునే ఈ నియోజకవర్గంలో గెలుపు అసాధ్యమని భావించిన కాంగ్రెస్ నామమాత్రంగా పోటీ చేసేందుకే కసానాకు టికెట్ ఇచ్చారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం బీజేపీతో గట్టిగా తలపడాలనే అభిప్రాయంతోనే ఇంజనీరింగ్‌తో పాటు న్యాయశాస్త్రంలోనూ పట్టాపుచ్చుకున్న సౌరభ్ భరద్వాజ్ ఎన్నికల బరిలోకి దించిందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురిలో అజయ్‌కుమార్ మల్హోత్రాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. భిన్నమైన పరిస్థితులు.. గ్రేటర్ కైలాష్‌ను ప్రధానంగా సంపన్నులు నివసించే నియోజకవర్గంగా పేర్కొనవచ్చు. అయితే గ్రేటర్ కైలాష్, చిత్తరంజన్ పార్క్, పంచ్‌శీల్ వంటి ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చేసిన సంపన్న కాలనీల సరసన కాల్కాజీ, సంత్‌నగర్ , షేఖ్ సరాయ్, డీడీఏ ఫ్లాట్లు, చిరాగ్ దిల్లీ షాపుర్ జాట్, జమ్రుద్పూర్ , సావిత్రీనగర్ వంటి పట్టణ గ్రామాలు, జేజే క్లస్టర్లు కూడా ఉన్నాయి. పార్కింగ్, ట్రాఫిక్ , సీవేజ్ తదితరాలు ఈ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. బీఆర్టీ కారిడార్ కారణంగా ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమయ్యాయని ఇక్కడి వారు అంటున్నారు. పంజాబీ ఓటర్లు 20 శాతం కాగా, వైశ్యులు 18 శాతం, షెకులు 10 శాతం ఉన్నారు. -
దూసుకెళుతున్న అజయ్ మల్హోత్ర
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్ర రాజకీయవారసుడిగా ఈమారు ఎన్నికల బరిలోకి దిగుతున్న అజయ్ మల్హోత్ర సొంత పంథాలో ముందుకెళుతున్నారు. విజయ్‌కమార్ మల్హోత్ర కుమారుడైన విజయ్‌కుమార్ మల్హోత్ర తన తండ్రికి కలిసొచ్చిన నియోజకవర్గమైన గ్రేటర్ కైలాశ్ నుంచి పోటీపడుతున్నారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించక ముందు నుంచే నియోజకవర్గ ప్రజలతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ వచ్చారు. పార్టీ టికెట్ లభించినప్పటి నుంచి వరుసగా బీజేపీ జాతీయ స్థాయి నాయకులను కలుస్తూ వారి ఆశ్వీర్వాదాలు పొందుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్,అగ్రనేత అద్వానీ, సుష్మాస్వరాజ్ ఇలా రోజుకొకరి కలుస్తూ వార్తలో నిలి చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గపరిధిలోని ఓటర్లకు చేరువయ్యేందుకు పాదయాత్రలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఢిల్లీ బీజేపీలో వారసత్వ రాజకీయాలకు తెరతీసిన కొందరు నాయకుల్లో ఒకడైన అజయ్‌కుమార్ మల్హోత్ర రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు గ్రేటర్‌కైలాశ్ నియోజకవర్గ ప్రజల చే తుల్లో ఉంది.